BigTV English

Chandrasekharendra Saraswati: నడిచే దైవం.. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి..!

Chandrasekharendra Saraswati: నడిచే దైవం.. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి..!

Chandrasekharendra Saraswati: ఆయన పాదముద్రలతో యావత్ భారతావని పులకరించి పోయింది. ఆయన నడచిన ప్రతిచోటా అంతరించిపోయిన సనాతన సంప్రదాయం పున:ప్రతిష్టితమైంది. ఆయన ప్రతి సందేశమిచ్చిన ప్రతి ప్రదేశమూ మానవత్వానికి చిరునామాగా మారింది. వందల ఏళ్ల పరాయి పాలనలో విస్మృతమైన భారత జాతి ఆత్మను తట్టి లేపుతూ సాగిన ఆయన పాదయాత్రలో జ్ఞాన ప్రవాహం ఏరులై పారింది. కైలాస శంకరుడే కంచి స్వామిగా మళ్లీ వచ్చాడంటూ జాతి చేతులెత్తి మొక్కింది. ఆ నడిచే దేవుడిని చూసేందుకు ఆబాలగోపాలం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఆయన పాదయాత్రా మార్గంలో ఎదురుచూసింది. ఆయనే కంచి పరమాచార్య.. శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి. నేడు ఆయన బృందావన ప్రవేశం చేసిన రోజు. ఈ సందర్భంగా ఆ జ్ఞాన జ్యోతి జీవిత విశేషాలు..


తమిళనాడులోని విల్లుపురంలో 1894లో స్వామి ఆవిర్భవించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు.. స్వామినాథుడు కాగా ఇంట్లో అందరూ ‘గిని’ అనేవారు. గిని అంటే కన్నడంలో పంచ వన్నెల చిలక అని అర్థం. స్కూలు ఇన్‌స్పెక్టర్ అయిన స్వామినాథుని తండ్రి.. తన కుమారుడిని మిషనరీ పాఠశాలలో చేర్చారు. 1900లో ఒకటో తరగతి చదువుతున్న స్వామినాథుడు.. స్కూలులో ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన అధికారి ఇచ్చిన పై తరగతి టెక్ట్స్‌బుక్‌ను అలవోకగా చదవటంతో.. ఆ అధికారి ఆరేళ్లకే మూడో తరగతిలో చేరేందుకు అనుమతినిచ్చాడు. ఆ మిషన్ పాఠశాలలోని క్రైస్తవ ప్రార్థనలు, బైబిల్ సూక్తులనూ స్వామినాథుడు అలవోకగా నేర్చేసుకుని ఆచరించేవాడు.

1907లో నాటి కంచికామకోటి 66వ పీఠాధిపతి మశూచితో శివైక్యం చెందగా, స్వామినాథుడి పెద్దమ్మ కుమారుడు, స్వామినాథుడి కంటే పెద్దవాడైన లక్ష్మీనాథుడు.. మహేంద్ర సరస్వతి పేరుతో పీఠాధిపతిగా ఎంపికయ్యారు. ఆయన పీఠాధిపత్యం వహించే వేడుకకు తల్లితో బాటు స్వామినాథుడు కూడా కంచికి వెళ్లారు. అయితే.. మహేంద్ర సరస్వతి కూడా మశూచితో కన్నుమూయటంతో.. ఆ స్థానంలో స్వామినాథుడిని పీఠపు పెద్దలు ఎంపికచేశారు. ఆ సమయంలో స్వామినాథుడి తండ్రి ఎక్కడో ఉద్యోగ నిర్వహణలో ఉన్నారు. టెలిఫోన్‌లో ఆయన అనుమతి పొందిన కంచి పీఠం పెద్దలు.. చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరుతో 68వ పీఠాధిపతిగా స్వామినాథుడికి పీఠపు బాధ్యతలను అప్పగించారు.


ఆ విధంగా 1907, ఫిబ్రవరి 13న 68వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించి, 1994, జనవరి 8 (ఆ మహాస్వామి శివైక్యం చెందే) వరకు అనగా సుమారు 83 సంవత్సరాలు (మధ్యలో నాలుగేళ్లు వైదిక విద్యాభ్యాసానికి వదలివేస్తే) అతి సమర్ధవంతంగా పీఠాన్ని ప్రపంచమంతా తలవంచుకుని నమస్కరించే విధంగా నడిపారు.

సాక్షాత్తూ ఆదిశంకరుడి ప్రతిష్టించిన ఆ పీఠానికి కేవలం 13 ఏళ్ల ప్రాయంలో స్వామివారు అధిపతిగా వచ్చారు. అప్పటికి వేదాధ్యయనం కూడా చేయని.. స్వామివారు గురువుల వద్ద వేద, పురాణాదులను అధ్యయనం చేశారు. ఇతర పీఠాధిపతుల మాదిరిగా తనకూ తన పూర్వపు పీఠాధిపతి శుశ్రూష చేసే అవకాశం రాలేదని బాధపడేవారు. అలాగే కాషాయ వస్త్రాలు తనను వెతుక్కుంటూ వచ్చాయని అనేవారు. అలా పీఠాధిపతి అయిన స్వామివారు.. అనతి కాలంలోనే గొప్ప జ్ఞాన జ్యోతిగా భాసించి, కంచి పీఠపు ఖ్యాతిని, అద్వైత సిద్ధాంతాన్ని దశదిశలా వ్యాపింపజేశారు.

గతానికి భిన్నంగా కులమతాలకు అతీతంగా పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ.. కంచి పీఠాన్ని ప్రజలకు చేరువ చేశారు. జనం తమ కష్టనష్టాలు ఆయనకు చెప్పుకునే అవకాశాన్ని కల్పించారు. 1746లో కుంభకోణానికి తరలించబడిన కంచి పీఠాన్ని తన హయాంలో తిరిగి కంచికి తీసుకొచ్చారు. 1919లో స్వామివారు దేశపర్యటన చేశారు. 20 ఏళ్ల పాటు సాగిన ఈ ‘విజయ యాత్ర’లో, ఆ తర్వాత తన 86 వ ఏట ఆరేళ్లపాటు తమిళ, కన్నడ, మరాఠా నేలపై సాగిన 3860 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా అది శంకరులని తలపింపచేశారు. పాదయాత్రలో ప్రజలను కలుసుకోగలుగుతున్నానంటూ మురిసిపోయిన ఆ ‘పెరియవ’ను చూసి కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దేశమంతా ‘నడిచే దైవం’ అంటూ చేతులెత్తి మొక్కింది.

పాదయాత్ర క్రమంలో కర్నూలు జిల్లా ‘రామాపురం బిలం’ వద్ద అనేక వేల శివ లింగాలున్న గుహలను దర్శించటమే గాక శ్రీశైలం అడవిలో మట్టిలో కప్పబడి ఉన్న నాటి ఆదిశంకరుల తపస్థలాన్ని తన తపోబలంతో గుర్తించి.. అక్కడే ఆదిశంకరులు ‘శివానందలహరి’, ‘సౌందర్యలహరిలు’ కూర్చారని ఇప్పుడది గొప్ప యాత్రాస్థలంగా నిలిచింది.

1927లో మహాత్మా గాంధీజీ పాల్‌ఘాట్‌లో స్వామీజీని దర్శంచుకున్నారు. వీరిద్దరూ నాడు గోశాలలో నేలపైనే కూర్చొని చర్చలు జరిపారు. గాంధీ హిందీలో, స్వామి సంస్కృతంలో మాట్లాడారు. సాయంత్రం ఆరు గంటల లోపే భోజనాన్ని ముగించే అలవాటున్న గాంధీకి.. రాజాజీ వచ్చి భోజన వేళను గుర్తుచేయగా.. ‘ఈ పూటలకు స్వామి వాక్కులే నాకు ఆహారం’ అన్నారట.

1966లో శాంతి స్థాపన ప్రయత్నాల్లో భాగంగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన సమితి వార్షికోత్సవ సభకు భారతీయ బృందాన్నీ ఆహ్వానించారు. దీనికి ప్రధాని ఇందిరాగాంధీ..కర్ణాటక సంగీత విదుషీమణి.. ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మినీ ఎంపిక చేశారు. అక్కడేమి పాడాలో తోచక.. ఆమె స్వామి వారి వద్దకు రాగా.. అప్పటికప్పడు ‘మైత్రీం భజతా’ కీర్తనను సంస్కృతంలో రాసిచ్చారు. ‘అందరితో స్నేహంగా ఉందాం. మిమ్మల్ని మీరు ప్రేమించినట్లుగా తోటివారినీ ప్రేమించండి. విద్వేషం వద్దేవద్దు. యుద్ధాన్ని, ఆక్రమణలనూ వదిలేయండి’ అనే అర్థం గల ఆ కీర్తన ఆంగ్ల అనువాదాన్ని విన్న సభికులంతా లేచి.. నిమిషాల తరబడి చప్పట్లు కొట్టారు.

కన్నతల్లి, గోమాత, జన్మభూమి మనకు ముగ్గురు తల్లులనీ, వీరి ముగ్గురి కలయికే.. కంచి కామాక్షి అని చెప్పేవారు. ‘నాకు ఏ కానుకలూ వద్దు. రోజూ రెండు నిమిషాల సమయం పరమేశ్వరుడిని ప్రార్థించేందుకు ఇవ్వండి. అదే నాకు ఇష్టమైన కానుక’ అనేవారు స్వామీజీ.
మహోత్కృష్టమైన సనాతన ధర్మపు వైభవాన్ని శివైక్యం పొందే క్షణం వరకు చాటి చెప్పిన ఆ జ్ఞాన జ్యోతి 1994 జనవరి 8న.. మార్గశిర కృష్ణ పక్ష ద్వాదశినాడు ఆ పరమేశ్వరుడిలో లీనమైపోయింది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×