Revanth Reddy Birthday: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది. సీఎం రేవంత్ 57వ పుట్టిన రోజు సందర్భంగా.. ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ విజయరెడ్డి ఆధ్వర్యంలో ఈ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగా ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. చూసిన వారంతా సైకత శిల్పం చాలా బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద.. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఓయూ జేఏసీ ఛైర్మన్ ఓరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై 57 కేజీల భారీ కేక్ కట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. బడుగు, బలహీన, వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రానున్న 20 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి ఆద్వర్యంలో పీవీ మార్గ్ లోని ఎన్టీయార్ గార్డెన్ వద్ద జరిపిన సంబరాల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక కట్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు, రాబోయే కాలంలో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని..ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డికి మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు.
ప్రముఖ సైకత శిల్పి వరప్రసాద్.. హుస్సేన్ సాగర్ తీరాన రేవంత్ రెడ్డి సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా వరప్రసాద్‌ను మంత్రి జూపల్లి అభినందించారు.
ఇదిలా ఉంటే.. ఆకాశాన్నంటిన అభిమానం – సీఎం రేవంత్ రెడ్డికి వినూత్న శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన.. రాష్ట కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని.. పీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి రేవంత్ రెడ్డి చిత్రపటంతో కూడిన ఎయిర్ బెలూన్ ను అయన హిడెన్ కాస్టల్ సిద్దిపేటలో ఎగరవేశారు.
అనంతరం మాట్లాడిన పీసరి మహిపాల్ రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని, ప్రతి తెలంగాణ బిడ్డకు కనిపించాలనే ఆలోచనతోనే.. ఎయిర్ బెలూన్ గ్రీటింగ్స్ కి పూనుకున్నట్లు ఆయన తెలిపారు.
ఆరు గ్యారంటీల అమలు, తెలంగాణను విద్యారంగంలో మేటిగా నిలబెట్టేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, డ్రగ్స్ రహిత తెలంగాణ, ముంపు లేని హైదరాబాద్ ను సాధించేందుకు.. లక్షలాది మంది ప్రజలు మురికినీటితో ఇబ్బంది పడుతున్న మూసీ నది ప్రక్షాళన వంటి అద్భుతమైన కార్యక్రమాలతో దశాబ్ద కాలం పాటు తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు, పరిష్కారం చూపుతూ తెలంగాణను నంబర్ వన్ స్టేట్ గా నిలబెట్టేందుకు చేస్తున్న వారి కృషికి.. కాంగ్రెస్ కార్యకర్తలుగా మేమంతా అండగా ఉంటామని ఆయన తెలిపారు.
రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లోను ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసంతో జూబ్లీహిల్స్ ఏ మూలకు వెళ్లిన ప్రజలంతా జై కాంగ్రెస్ అంటున్నారని.. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పీసరి మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Also Read: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు విస్తరణ: మంత్రి కోమటిరెడ్డి
కోట్లాదిమంది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తమ అభిమాన నాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని, వారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ.. వారి పుట్టినరోజున వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపినట్లు పీసరి మహిపాల్ రెడ్డి తెలిపారు.