Komatireddy Venkat Reddy: తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కోసం రూ. 60,799 కోట్ల భారీ ప్రాజెక్టును చేపట్టినట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి అనుమతులు ఇచ్చి, నిధుల మంజూరుకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మౌలిక సదుపాయాల కల్పనతో తెలంగాణ బహుళజాతి సంస్థలకు కేంద్రంగా మారుతుందని, లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది మంది గ్రామీణ యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రి మాట్లాడుతూ.. ఇది తెలంగాణ చరిత్రలో రికార్డు స్థాయిలో పెట్టుబడి. ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు నా కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టులు రాష్ట్రాన్ని మౌలిక వసతుల పరంగా మరో స్థాయికి తీసుకెళ్తాయని చెప్పారు.
సుమారు రూ.10,400 కోట్లతో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్న హైవేను.. ఎనిమిది లైన్లుగా విస్తరించనున్నారు. ఈ రహదారి పూర్తయితే రాజధాని ప్రాంతం, తూర్పు తెలంగాణ మధ్య వాణిజ్య రవాణా మరింత వేగవంతం కానుంది.
తెలంగాణ రాష్ట్ర గమనాన్ని మార్చబోయే RRR నిర్మాణానికి రూ.36,000 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ భారాన్ని తగ్గించడంతో పాటు, కొత్త పరిశ్రమలు ఏర్పడేందుకు ఇది కీలక మౌలిక సదుపాయంగా మారనుంది.
గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా HAM (Hybrid Annuity Model) ప్రాజెక్ట్ కింద రూ.11,399 కోట్లతో కొత్త రహదారులు నిర్మించనున్నారు. సింగిల్ రోడ్లు ఉన్నచోట డబుల్ రోడ్లు, రహదారులేని ప్రాంతాల్లో కొత్త మార్గాలు వేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనున్నారు.
అదేవిధంగా మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు.. 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.8,000 కోట్ల వ్యయం అంచనా వేయబడింది. ఇది దేశంలోనే ఒక ప్రత్యేక ప్రాజెక్టుగా నిలవనుంది. పుణ్యక్షేత్రాలకు చేరుకునే భక్తులకు సౌకర్యవంతమైన రహదారి ఏర్పాటవుతుంది.
దేశానికే తలమానికంగా మారే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు.. గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం ప్రతిపాదనలో ఉంది. ఈ రూ.20,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్ పూర్తయితే, రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుందని మంత్రి తెలిపారు.
Also Read: సీఎం రేవంత్ పుట్టినరోజు.. PM నుండి CM వరకు శుభాకాంక్షలు
ఈ రహదారి నిర్మాణాలతో రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు రానున్నాయని.. మంత్రి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహిస్తున్నారని మంత్రి వెల్లడించారు. పనుల పురోగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, అన్ని జిల్లాల్లో రోడ్ల నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
తన రాజకీయ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు అని మంత్రి కోమటి అన్నారు.