ChatGPT Locked Chats: చాట్‌జీపీటీలో మనం రోజూ ఎన్నో విషయాలు అడుగుతుంటాం. వ్యక్తిగత విషయాల నుంచి ఆఫీస్ పనుల వరకు చాలా సమాచారం చాట్స్‌లో ఉంటుంది. అయితే, మన ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను వేరే వాళ్లు ఉపయోగించినప్పుడు ఈ చాట్స్‌ను చూసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా OpenAI కొత్తగా Locked Chats ఫీచర్‌ను తీసుకొస్తోంది. దీనితో మనకు ప్రైవేట్‌గా ఉంచాలనుకున్న చాట్స్‌ను PIN లేదా బయోమెట్రిక్ సాయంతో లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? దీన్ని ఉపయోగించే ముందు ఏ విషయాలు తెలుసుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
ఒక చాట్‌ను లాక్ చేసిన తర్వాత అది సాధారణ చాట్ లిస్ట్‌లో కనిపించదు. పిన్ చేసిన చాట్స్‌లోనూ, సెర్చ్ రిజల్ట్స్‌లోనూ కనిపించదు. వాటిని తిరిగి చూడాలంటే Locked Chats సెక్షన్‌లోకి వెళ్లి పిన్ ఎంటర్ చేయాలి లేదా అందుబాటులో ఉన్న బయోమెట్రిక్ పద్ధతిని ఉపయోగించాలి. ఇలా వ్యక్తిగత సంభాషణలను ఇతరుల కంట పడకుండా ఉంచుకోవచ్చు.
Also Read: రూ.10 వేలకే కొత్త ఫ్లిప్ ఫోన్.. ఇందులో ఉన్న ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఈ ఫీచర్‌లో నాలుగు అంకెల పిన్ పెట్టుకోవచ్చు. సపోర్ట్ చేసే పరికరాల్లో Face ID లేదా Touch ID ద్వారా కూడా లాక్ చేసిన చాట్స్‌ను తెరవొచ్చు. అయితే, ఇది పూర్తి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్న ప్రత్యేక డిజిటల్ లాకర్ కాదు. మీ పరికరాన్ని వేరే వాళ్లు ఉపయోగించినప్పుడు చాట్స్‌ను సులభంగా చూడకుండా అడ్డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం.
Locked Chatsకు ప్రత్యేక మెమరీ స్పేస్ ఉంటుంది. మెమరీ ఫీచర్ ఆన్‌లో ఉంటే, లాక్ చేసిన చాట్స్‌లోని సమాచారం వాటి మధ్యే ఉపయోగించబడుతుంది. అది సాధారణ ChatGPT అనుభవంలో కనిపించదు. అయితే, చాట్‌ను లాక్ చేయడానికి ముందే చాట్‌జీపీటీ గుర్తుంచుకున్న సమాచారం ప్రధాన మెమరీలో అలాగే ఉండొచ్చు. అవసరమైతే దాన్ని విడిగా మార్చుకోవాలి.
ఈ ఫీచర్ వెబ్‌సైట్, మ్యాక్, విండోస్ డెస్క్‌టాప్ యాప్స్‌తో పాటు ఆండ్రాయిడ్, iOS యాప్స్‌కు అందుబాటులోకి రానుంది. Free, Go, Plus, Pro, Business, Enterprise, Edu ప్లాన్లకు అందించనున్నారు. అయితే, టెంపరరీ చాట్స్, ఆర్కైవ్ చేసిన చాట్స్, గ్రూప్ చాట్స్, షేర్ చేసిన లింక్ చాట్స్‌కు ఇది పనిచేయదు. పిన్ మర్చిపోతే రీసెట్ చేయడం వల్ల లాక్ చేసిన చాట్స్, ఫైల్స్, ప్రైవేట్ మెమరీ తొలగిపోవచ్చు. వాటిని తిరిగి పొందలేకపోవచ్చు కాబట్టి పిన్‌ను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి.
Also Read: శాంసంగ్ యూజర్లకు అలర్ట్.. ఈ 5 ఫోన్లకు అప్‌డేట్స్ ఎప్పటివరకంటే?