1975 Wedding Expenses: పెళ్లి అంటే ఇప్పుడు భారీ ఖర్చులతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది. ఫంక్షన్ హాల్ మొదలుకొని భోజనాలు, అలంకరణలు, బట్టలు, బంగారం, పెళ్లి పత్రికలు.. ఇలా ఒక్కోదానికి వేల నుంచి లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. సాధారణ కుటుంబాల్లో కూడా పెళ్లి ఖర్చులు భారీగానే ఉంటున్నాయి. అయితే, కొన్నేళ్ల క్రితం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. 1975లో ఓ పెళ్లికి సంబంధించిన ఖర్చుల లెక్కలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. 9/7/1975 తేదీతో రాసి ఉన్న ఆ పాత లెక్కల చిట్టాను ఓ అమ్మమ్మ చదువుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో ఒక్కో ఖర్చును ఆమె వివరంగా చెప్పడం, అప్పటి ధరలు ఎలా ఉండేవో తెలియజేస్తోంది. ముఖ్యంగా చిన్నచిన్న అవసరాలకు పెట్టిన మొత్తాలు చూస్తే ఇప్పటి తరానికి ఆశ్చర్యం కలగక మానదు.
బామ్మ చెప్పే లెక్కల ప్రకారం.. అప్పట్లో పెళ్లి కట్నంగా రూ.200 ఇచ్చినట్లు ఉంది. ఆడపడుచు కట్నం కింద మరో రూ.58 ఖర్చు చేశారు. పెళ్లి బట్టల కోసం రెండుసార్లు రూ.117, రూ.167 ఖర్చు చేశారు. అంటే బట్టలకు మొత్తం రూ.284 ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి బటువు, మంగళసూత్రం కోసం రూ.30 ఖర్చు చేశారు. ఇక పెళ్లికి అవసరమైన ఇతర సరుకుల కోసం రూ.150 కేటాయించారు. అప్పటి ధరలతో పోలిస్తే ఈ మొత్తాలు కూడా పెద్ద ఖర్చుగానే భావించాల్సి ఉంటుంది.
ఇక పెళ్లి ఏర్పాట్లలో భాగంగా కూరగాయల కోసం కేవలం రూ.5 ఖర్చు చేసినట్లు ఆ లెక్కల్లో ఉంది. పూలకు రూ.2, మిఠాయిలకు కూడా రూ.2 మాత్రమే వెచ్చించారు. అరటి గెలకు రూ.10 ఖర్చు చేసినట్లు రాశారు. ఇప్పటి పెళ్లిళ్లలో కేటరింగ్, డెకరేషన్, పూల అలంకరణ వంటి వాటికే భారీగా ఖర్చవుతోంది. అలాంటిది అప్పట్లో పూలు, మిఠాయిలు వంటి వాటిని కేవలం కొన్ని రూపాయల్లోనే పూర్తి చేయడం చూస్తే అప్పటి జీవన విధానం ఎంత భిన్నంగా ఉండేదో అర్థమవుతుంది.
ప్రయాణం కోసం రిక్షాలకు రూ.4.50 ఖర్చు చేసినట్లు లెక్కల్లో ఉంది. మైక్ సెట్ కోసం రూ.10 చెల్లించారు. పెళ్లి కూతురు కాళ్ల గోళ్లు తీసే వ్యక్తికి రూ.12 ఇచ్చినట్లు కూడా ఆ చిట్టాలో ప్రత్యేకంగా రాశారు. అలాగే చాకలికి రూ.2, బ్రాహ్మణుడికి రూ.5 చెల్లించారు. ప్రథానం సామాను కోసం రూ.14 ఖర్చు చేసినట్లు వివరాలు చెబుతున్నాయి. కార్యం జరిగిన రోజు రాత్రి ఖర్చుల కోసం మరో రూ.5 వెచ్చించారు.
ఈ పాత పెళ్లి ఖర్చుల చిట్టా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కారణమవుతోంది. అప్పట్లో పెళ్లికి అవసరమైన ప్రతి చిన్న ఖర్చును కూడా ఇలా కాగితంపై రాసుకుని లెక్క పెట్టుకునేవారని తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని రూపాయలకే పూర్తయ్యే ఖర్చులు ఇప్పుడు వేల రూపాయలకు చేరుకోవడం చూస్తే కాలంతో పాటు పెళ్లిళ్ల నిర్వహణలో ఎంత మార్పు వచ్చిందో అర్థమవుతోంది. అయితే, అప్పటి ధరలను ఇప్పటి ధరలతో నేరుగా పోల్చడం కంటే.. ఆ కాలంలో ప్రజల జీవన విధానం, వస్తువుల ధరలు, పెళ్లిళ్లు జరిపే పద్ధతులు ఎలా ఉండేవో ఈ లెక్కలు చూపిస్తున్నాయని చెప్పొచ్చు. మొత్తంగా 1975 నాటి ఈ పెళ్లి ఖర్చుల చిట్టా పాత తరం జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, నేటి తరాన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Read Also: మద్యానికి నో.. 70 ఏళ్లుగా ఇదే రూల్.. సూర్యాపేటలోని ఈ ఆదర్శ గ్రామం గురించి తెలుసా?