Alcohol-Free Villages: సాధారణంగా గ్రామాల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే కొన్నాళ్లకే అది మరుగునపడిపోతుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలోని కొన్ని గ్రామాలు మాత్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏళ్లు గడిచినా తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. మద్యం వల్ల కుటుంబాలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఏళ్ల క్రితమే తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పాతిక సంవత్సరాలుగా మద్యానికి దూరంగా ఉంటున్నాయి. నూజండ్ల మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 11 గ్రామాల్లో మద్య నిషేధం దశాబ్దాలుగా ఏళ్లుగా అమలవుతోంది.
‘కల్లు మానండోయ్.. కళ్లు తెరవండోయ్!’ అనే గాంధీజీ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్టుగా ఈ గ్రామాలు మద్యానికి దూరంగా ఉంటున్నాయి. మద్యం కారణంగా కుటుంబాల్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు పెరగకూడదనే ఉద్దేశంతో గ్రామస్థులే కలిసి నిర్ణయాలు తీసుకున్నారు. మద్యం తాగకపోవడమే కాకుండా.. గ్రామంలో విక్రయాలు జరగకుండా చూడటంపైనా స్థానికులు దృష్టి పెడుతున్నారు.
ఈ గ్రామాల్లో మద్య నిషేధానికి మరో చరిత్ర కూడా ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో అమలైన మద్యనిషేధం కూడా తమకు స్ఫూర్తినిచ్చిందని గ్రామస్థులు చెబుతున్నారు. కాలం మారినా.. ఆ నిర్ణయాన్ని మాత్రం అక్కడి ప్రజలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. జంగాలపల్లె గ్రామం ఈ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. గ్రామంలోని అన్ని కులాలకు చెందిన పెద్దలు కలిసి ఒక కమిటీగా ఏర్పడి మద్యనిషేధాన్ని ప్రకటించారు. దాదాపు 25 ఏళ్లుగా ఈ కట్టుబాటు కొనసాగుతోంది. ఎవరైనా మద్యం విక్రయించినా, కొనుగోలు చేసినా కమిటీ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నది గ్రామస్థుల తీర్మానం. అంటే గ్రామంలో మద్యం విషయంలో వ్యక్తిగత నిర్ణయం కంటే సామూహిక నిర్ణయానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
గాంధీనగరంలో సుమారు రెండు దశాబ్దాలుగా మద్యంపై నిషేధం కొనసాగుతోంది. ముప్పరాజుపాలెంలో దాదాపు 15 ఏళ్లుగా ఇదే విధానం అమల్లో ఉంది. ఇవే కాకుండా తెల్లబాడు, తిమ్మాపురం, సాయినగరం, దాట్లవారిపాలెం, అప్పాపురం ఎస్సీ కాలనీలు, పాత త్రిపురాపురం, కొత్త త్రిపురాపురం, చెరువుకొమ్ముపాలెం గ్రామాల్లోనూ మద్యానికి దూరంగా ఉండేలా స్థానికంగా కట్టుబాట్లు ఏర్పడ్డాయి.
మద్యం నిషేధం కేవలం చట్టాలతోనే సాధ్యమా? లేక ప్రజల భాగస్వామ్యంతోనే దీర్ఘకాలం కొనసాగుతుందా? నూజండ్ల మండలంలోని ఈ గ్రామాలు మాత్రం రెండో మార్గాన్ని చూపిస్తున్నాయి. తరాలు మారుతున్నా.. గ్రామాలు మారుతున్నా.. దశాబ్దాల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించడం అంత సులభం కాదు. కానీ, మద్యం వల్ల కుటుంబాలు నష్టపోకూడదన్న ఉద్దేశంతో గ్రామస్థులు కలిసి నిలబడుతున్నారు. అందుకే, ఈ గ్రామాల్లో ‘మద్యం వద్దు.. కుటుంబం ముద్దు’ అనే మాట కేవలం నినాదంగా కాకుండా.. ఏళ్లుగా పాటిస్తున్న కట్టుబాటుగా మారింది.
Read Also: ఉరిశిక్షలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా చనిపోని మహిళ, చివరకు ఏం చేశారంటే?