World’s Most Unique Education Systems: స్కూల్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసులు.. ఇంటికి వెళ్లాక హోంవర్క్.. పరీక్షల సమయంలో టెన్షన్.. మార్కుల కోసం పోటీ.. సాధారణంగా మనకు కనిపించే విద్యా విధానం ఇదే. కానీ, ప్రపంచంలో మరో దేశం మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన పద్ధతిని అనుసరిస్తోంది. అంతేకాదు, ప్రపంచంలోనే విద్యా విధానంలో నెంబర్ వన్ గా నిలుస్తోంది. అదే ఫిన్‌లాండ్. ఇక్కడ విద్యార్థులపై చదువు భారాన్ని తగ్గిస్తూ.. నేర్చుకోవడంపై ఆసక్తి పెంచేలా విద్యా వ్యవస్థను రూపొందించారు. హోంవర్క్ చాలా తక్కువగా ఉండటం, తరచూ పరీక్షలు పెట్టకపోవడం లాంటి విధానాలు ఫిన్‌లాండ్ విద్యా వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెట్టాయి.
ఫిన్ లాండ్ లో పిల్లలను చిన్న వయసులోనే పుస్తకాల ముందు కూర్చోబెట్టరు. జస్ట్ నాలుగు గంటలే స్కూల్ ఉంటుంది. ఆ సమయంలోనూ చిన్నారులకు ఆటలు, సామాజిక నైపుణ్యాలు, సృజనాత్మక కార్యకలాపాల ద్వారా నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లడం అంటే కేవలం పాఠాలు చదవడం మాత్రమే కాకుండా.. ఇతరులతో కలిసి పనిచేయడం, సమస్యలను పరిష్కరించడం, స్వతంత్రంగా ఆలోచించడం లాంటి అంశాలను కూడా నేర్చుకోవడంగా భావిస్తారు.
ఫిన్‌లాండ్‌లో విద్యార్థులకు ఇంటి దగ్గర గంటల తరబడి కూర్చొని చేసే హోంవర్క్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. క్లాస్‌రూమ్‌లోనే ఎక్కువ విషయాలను అర్థం చేసుకునేలా బోధించడంపై దృష్టి పెడతారు. స్కూల్ తర్వాత పిల్లలకు కుటుంబంతో గడపడానికి, ఆటలు ఆడటానికి, తమకు నచ్చిన పనులు చేసుకోవడానికి సమయం ఉండాలని అక్కడి విద్యా విధానం భావిస్తుంది.
మన దగ్గర పరీక్షలు, మార్కులు విద్యార్థి ప్రతిభను అంచనా వేయడంలో కీలకంగా ఉంటాయి. కానీ, ఫిన్ లాండ్‌లో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. విద్యార్థులను తరచూ పరీక్షలకు సిద్ధం చేయడం కంటే.. వారు పాఠాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు? దాన్ని నిజ జీవితంలో ఎలా ఉపయోగించగలరు? అనే అంశాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. దీంతో మార్కుల కోసం మాత్రమే చదివే పరిస్థితి తగ్గి.. విషయం అర్థం చేసుకుని నేర్చుకునే అవకాశం పెరుగుతుంది.
ఫిన్‌లాండ్ విద్యా వ్యవస్థలో టీచర్ల పాత్ర చాలా కీలకం. ఉపాధ్యాయులను కేవలం పాఠాలు చెప్పే వ్యక్తులుగా కాకుండా.. విద్యార్థుల అభివృద్ధికి మార్గనిర్దేశం చేసే నిపుణులుగా చూస్తారు. టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వడంతో పాటు.. క్లాస్‌రూమ్‌లో బోధనా విధానాలను ఎంచుకునే విషయంలో కూడా స్వేచ్ఛ ఇస్తారు. ప్రతి విద్యార్థి అవసరానికి తగ్గట్టుగా బోధించే అవకాశం ఉంటుంది.
ఫిన్‌లాండ్ విద్యా విధానంలో మరో ముఖ్యమైన అంశం సమానత్వం. విద్యార్థుల మధ్య భారీ పోటీని పెంచడం కంటే.. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను రూపొందించారు. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం వంటి కారణాలతో ఏ విద్యార్థి కూడా విద్యలో వెనుకబడకూడదనే లక్ష్యంతో అనేక రకాల సహాయక వ్యవస్థలు ఉన్నాయి.
ఫిన్ లాండ్ విద్యా వ్యవస్థ విజయానికి కేవలం హోంవర్క్ లేకపోవడం, ఎగ్జామ్స్ ఉండకపోవడం మాత్రమే కారణం కాదు. విద్యార్థులపై నమ్మకం, మంచి టీచర్ శిక్షణ, సమాన విద్యా అవకాశాలు, ఆచరణాత్మక బోధన, పిల్లల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం వంటి అనేక అంశాలు కలిసి పనిచేస్తాయి. అందుకే ఫిన్‌లాండ్ విద్యా విధానం ప్రపంచానిక ఆదర్శంగా నిలుస్తోంది. పిల్లలను ఎక్కువ గంటలు చదివించడం కంటే.. చదువుపై ఆసక్తి కలిగించడం, స్వతంత్రంగా ఆలోచించేలా చేయడం, నేర్చుకున్న విషయాలను జీవితంలో ఉపయోగించుకునేలా తీర్చిదిద్దడమే అసలు విద్య అనే ఆలోచనకు ఫిన్‌లాండ్ బెస్ట్ ఎగ్జాంఫుల్ గా నిలుస్తోంది.
Read Also: జపాన్‌లో శాశ్వత నివాసం అంత ఈజీ కాదు.. ఫీజు 20 రెట్లు పెంపు, కొత్త రూల్స్!