Aakasa Deepam : కార్తీక మాసం ఆరంభం నుంచి ఆలయాల్లోని ధ్వజ స్తంభాలకు ఆకాశ దీపాన్ని వేళ్లాడదీస్తుంటారు. చిన్న చిన్న చిల్లులున్న ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశదీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుంది. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు.
శివకేశవుల తేజస్సు ఆకాశదీపం రూపంలో విశ్వానికి అందిస్తుంది. దీపాన్ని వెలిగించేటప్పుడు దామోదరమావాహయామి అని, త్రయంబకమావాహయామి అని శివ, కేశవులను ఆహ్వానిస్తూ వెలిగించాలి. కాంతి లాగా మనలోని ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుందని అర్థం. దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీకమాసం ప్రారంభం కూడా ఆకాశదీపంతోనే జరుగుతుంది.
ఆకాశదీపం వెలిగించినా, దీపంలో నూనె పోసినా, ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్నా పుణ్యప్రాప్తి కలుగుతుంది. మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి… అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు.
దేవాలయాలతోపాటు ఇంట్లో కూడా ఆకాశదీపాన్ని వెలిగించవచ్చు. దీపానికి పూజచేసి దీప, ధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత శివ, కేశవుల్ని స్మరిస్తూ ఒక కర్రకట్టి ఎత్తుగా వేలాడదీయచ్చు.కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు ఆకాశ మార్గాన ప్రయాణించే పిృతదేవతలకు దారిచూపించేందుకు ఆకాశ దీపం దారిచూపుతుందని నమ్మకం.