అమెరికా స్థానిక ఎన్నికల్లో న్యూయార్క్ మేయర్ ఎలక్షన్ ఒక సంచలనంగా మారింది. న్యూయార్క్ మేయర్ గా డెమోక్రటిక్ పార్టీకి చెందిన జొహ్రాన్ మమ్‌దానీ ఘన విజయం సాధించారు. న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో బలమైన ప్రత్యర్థిగా ఉన్నా కూడా మమ్ దానీ విజయకేతనం ఎగురవేశారు. ఇక్కడ అసలు విషయం ఇంకోటి ఉంది. ఈ ఎన్నికల్లో ఆండ్రూ క్యూమో తరపున స్వయంగా అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారం నిర్వహించారు. కానీ ఫలితం లేదు. ట్రంప్ కి షాక్ ఇస్తూ మమ్ దానీ విజయం సాధించారు. అయితే ఈ విజయం తర్వాత మమ్ దానీ పేరుకంటే ఎక్కువగా ఆయన భార్య రామా దువ్వాజి పేరు తెరపైకి వచ్చింది. ఆ విజయానికి అసలు కారణం ఆమేనంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.
ప్రత్యేక విజయం..
జొహ్రాన్ మమ్ దానీ విజయం చాలా ప్రత్యేకం. 34 ఏళ్ల వయసులోనే న్యూయార్క్ గవర్నర్ గా ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా మమ్ దానీ రికార్డ్ సృష్టించారు. అంతే కాదు ఆ స్థానాన్ని దక్కించుకున్న తొలి ఇండియన్ ముస్లిం కూడా మమ్ దానీయే. ఆయన తల్లి ప్రముఖ భారతీయ దర్శకురాలు మీరా నాయర్. ఇక మమ్ దానీ భార్య, న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి పేరు కూడా ఈ విజయం తర్వాత బాగా హైలైట్ అవుతోంది.
ఎవరీ రామా?
28 ఏళ్ల అతి చిన్న వయసులోనే న్యూయార్క్ ఫస్ట్ లేడీగా అరుదైన ఘనత సాధించింది రామా దువ్వాజి. ఈమె ఒక కళాకారిణి. బొమ్మలు బాగా వేస్తుంది. హ్యూస్టన్ లో ఆమె జన్మించింది. ఆమె తల్లిదండ్రులకు సిరియా మూలాలున్నాయి. చిన్న తనంలో ఆమె దుబాయ్ లో పెరిగింది. ఖతర్ లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి, ఆ తర్వాత వర్జీనియా రిచ్మండ్ క్యాంపస్ కు వెళ్ళింది. ఆ తర్వాత న్యూయార్క్‌లోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ లో ఇల్లస్ట్రేషన్ మాస్టర్స్ పూర్తి చేసింది. ఆమె ఇన్ స్టా పేజ్ కి 2.65 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె భర్త న్యూయార్క్ మేయర్ పోటీలో బరిలో దిగిన తర్వాత ఆమె ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఆమె పెయింటింగ్స్, ఆమె గీసిన క్యారికేచర్స్ మరింత పాపులర్ అవుతున్నాయి. మధ్యతరగతి మహిళల జీవన విధానం, వారి ఆలోచనలు, మగవారి చేతిలో అణచివేత.. వంటి సున్నిత అంశాలను కూడా ఆమె స్పృశించారు.
ప్రచారంలో కీలకం..
జోహ్రాన్ మమ్ దానీ విజయం ఎంత కీలకమో, అందులో ఆయన భార్య పాత్ర కూడా అంతే కీలకం అంటున్నారు. మమ్ దానీ ప్రచారం విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఆడియో, వీడియో ప్రోమోలు, సోషల్ మీడియా పోస్టర్లు అన్నీ ఆవిడే డిజైన్ చేశారట. అందులో కలర్ కాంబినేషన్లు కూడా బాగా హైలైట్ అవుతున్నాయి. సహజంగా రాజకీయాల్లో భర్త విజయం తర్వాత భార్యకు పేరొస్తుంది. కానీ ఇక్కడ భర్త విజయంలో ఆమె కీలక భాగస్వామి అనే విషయం ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. రామా దువ్వాజీ సోషల్ మీడియాలో మరింత ఫేమ్ సంపాదించింది. మమ్ దానీ భారత సంతతి వ్యక్తి కావడంతో రామా దువ్వాజీ విషయంలో కూడా భారతీయులు అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్