ఏ క్షణాన లక్షల కోట్లు పోసి కొన్నాడో గానీ… అప్పటి నుంచి ఎలాన్ మస్క్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది… ట్విట్టర్ పిట్ట. మిగతా అన్ని పనులూ వదిలేసిన మస్క్… ఇప్పుడు దృష్టి మొత్తం ట్విట్టర్ మీదే పెట్టాడు. లేకపోతే సంస్థ ఎక్కడ దివాళా తీస్తుందోనని తెగ భయపడిపోతున్నాడు. అందుకే… వారంలో ఏడు రోజులూ… రోజులో 24 గంటలూ ట్విట్టర్ మీదే పని చేస్తున్నానని చెప్పుకొస్తున్నాడు.
ట్విటర్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు… మస్క్. ఉద్యోగులంతా కష్టపడి ఎక్కువ గంటలు పనిచేస్తేనే… సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని చెబుతున్నాడు. అటు ప్రధాన ఉద్యోగులు, ఇటు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కలిపి మొత్తం 8 వేల మంది సిబ్బందిని తీసేసిన మస్క్… మిగిలిన ఉద్యోగులంతా 12 గంటల పాటు పనిచేయాల్సిందేనని హుకుం జారీ చేశాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ తో పాటు ఇతర సదుపాయాల్ని ఒక్కొక్కటిగా తొలగిస్తున్నాడు. సిబ్బందితో పనిచేయించడమే కాదు… తాను కూడా పని చేస్తున్నానని చెప్పుకొస్తున్నాడు… మస్క్.
ఇండోనేషియాలో G20 సదస్సు నేపథ్యంలో ఓ బిజినెస్ కాన్ఫరెన్స్ కోసం మాట్లాడిన మస్క్… ఇప్పుడు తన చేతిలో చాలా పని ఉందన్నాడు. వారంలో ఏడు రోజులూ… ఉదయం నుంచి రాత్రి దాకా విశ్రాంతి, విసుగు లేకుండా పనిచేస్తున్నానని చెప్పాడు. దాంతో… ట్విట్టర్ కు పూర్తి సమయం కేటాయించేందుకు మస్క్ టెస్లాను కూడా వదిలేశాడా? అని… టెస్లా షేర్‌హోల్డర్లు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు… కొన్ని దేశాల్లో ట్విటర్ చాలా నెమ్మదిగా పనిచేస్తోందని… దీనికి యూజర్లు తనను క్షమించాలని మస్క్ కోరాడు. ట్విటర్ బ్లూ ఫీచర్ పునరుద్ధరణలో భాగంగా కొత్త ఫీచర్ తీసుకురాబోతున్నామని… ఏయే ఇతర ఖాతాలు ట్విటర్‌తో అసోసియేట్ అయ్యాయో గుర్తించేలా… కంపెనీలు, సంస్థలకు అధికారం ఇవ్వబోతున్నామని చెప్పాడు… మస్క్.