Grokipedia: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఏఐ అంకుర సంస్థ ‘ఎక్స్ ఏఐ’ మరో సంచలనానికి నాంది పలికింది. వికీపీడియాకు ప్రత్యామ్నాయంగా గ్రోకీపీడియాను రూపొందించింది. ఇది వికీపీడియా కంటే పదిరెట్లు ఎంతో మేలు అంటూ బిలియనీర్ ఎలాన్ మస్క్ తెలిపారు. గ్రోకీపీడియా Grokకు conversational AI మోడల్. వాస్తవాలను ఆధారంగా తీసుకుని.. శరవేగంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా సమాచారం అందించడం దీని ఉద్దేశమని ఎలాన్ మస్క్ తెలిపారు.
గ్రోకీపీడియా ప్రారంభమైన కొద్దిసేపటికే సర్వర్ సమస్యల వల్ల డౌన్ అయినా.. తర్వాత స్థిరంగా పనిచేయడం ప్రారంభించింది. విస్తృత వనరుల నుంచి సేకరించిన వాస్తవ సమాచారాన్ని ఏఐ ఆధారంగా ప్రాసెస్ చేసి వినియోగదారులకు అందిస్తుంది. గ్రోకీపీడియాలో ప్రస్తుతం 8,85,000 వ్యాసాలు అందుబాటులో ఉన్నాయి. చాట్‌జీపీటీ లేదా గ్రోక్ వంటి సంభాషణాత్మక ఏఐ మోడళ్లలా కాకుండా, గ్రోకీపీడియా ప్రస్తుతం కీవర్డ్ సెర్చ్ విధానంలో పనిచేస్తుంది.
ప్రస్తుతం ఉన్న వికీపీడియా వంటి వేదికల్లో ఎడిటోరియల్, పక్షపాత ధోరణులు ఉన్నాయని, గ్రోకీపీడియా వాటికి ప్రత్యామ్నాయంగా నిష్పక్షపాతంతో ధ్రువీకరించిన సమాచారాన్ని మాత్రమే అందిస్తుందని మస్క్ తెలిపారు. అయితే, గ్రోకీపీడియా ప్రారంభదశలో ఉందని, భవిష్యత్తులో తీసుకొచ్చే అప్‌డేట్స్‌తో కచ్చితత్వం, నమ్మకాన్ని అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వెర్షన్ కంటే రాబోయే 1.0 వెర్షన్ పదిరెట్లు మెరుగ్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫాంకు అధికారిక మొబైల్ యాప్స్ లేనందున ఎలాంటి థర్డ్‌పార్టీ యాప్స్‌ను వాడొద్దని సూచించారు.
గ్రోకీపీడియాను వినియోగించుకోవాలంటే.. grokipedia.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎక్స్ ఖాతాతో లాగిన్ అవ్వడం ద్వారా దీన్ని ఉపయోగించవచ్చు.
వికీపీడియాను జిమ్మీ వేల్స్, ల్యారీ సాంగర్ కలిసి 2001 జనవరి 15న స్థాపించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సమాచార వేదికల్లో వికీపీడియా ఒకటి. ఇది ఒక ఫ్రీ ప్లాట్‌ఫారమ్. ఇందులో ఎవరైనా సమాచారాన్ని పొందుపరచొచ్చు.. లాగిన్ అయ్యి ఎడిట్ కూడా చేయొచ్చు. ఇది వికీపీడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే.. వికీపీడియాకు పోటీగా, నిజమైన సమాచారం కోసం కొత్త వేదికలు అవసరం అంటూ మస్క్ చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు అన్నట్టుగానే గ్రోకీపీడియాను తీసుకొచ్చారు.