CP Sajjanar: చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సౌత్-ఈస్ట్ జోన్ డీసీపీ ఎస్. చైతన్య కుమార్ పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. డీసీపీ తన ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరపడంతో ఓ రౌడీ షీటర్ గాయపడ్డాడు. మొబైల్ స్నాచింగ్ చేస్తూ పారిపోతున్న ఇద్దరు నిందితులను పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది.
పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. డీసీపీ చైతన్య కుమార్ తన గన్‌మెన్‌తో కలిసి చాదర్‌ఘాట్ ప్రాంతంలో ఉండగా, ఇద్దరు మొబైల్ స్నాచర్లు నేరం చేస్తుండగా గమనించారు. వెంటనే డీసీపీ, ఆయన గన్‌మెన్ వారిని వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దొంగల్లో ఒకడైన రౌడీ షీటర్ మహమ్మద్ ఉమర్ అన్సారీ కత్తి తీసి గన్‌మెన్‌పై దాడికి పాల్పడ్డాడు.
దొంగ కత్తితో దాడి చేయడంతో గన్‌మెన్ గాయపడి కిందపడిపోయారు. పరిస్థితి అదుపు తప్పడంతో.. డీసీపీ చైతన్య కుమార్ తక్షణమే స్పందించి.. ఆత్మరక్షణలో భాగంగా నిందితుడిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మహమ్మద్ ఉమర్ అన్సారీకి చేతిపై మరియు కడుపులో గాయాలయ్యాయి. గాయపడిన దొంగను వెంటనే మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు.
20కి పైగా కేసులు..పీడీ యాక్ట్‌లు..
ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక వివరాలు వెల్లడించారు. నిందితుడు మహమ్మద్ ఉమర్ అన్సారీపై ఇప్పటికే 20కి పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతంలో రెండుసార్లు పీడీ యాక్ట్‌లు కూడా నమోదై.. రెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపాడని సీపీ సజ్జనార్ తెలిపారు. ‘రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం. నేరాలకు పాల్పడేవారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదు’ అని గట్టిగా హెచ్చరించారు. డీసీపీ చైతన్య కుమార్ స్వల్ప అస్వస్థతకు గురైనప్పటికీ, గాయపడిన కానిస్టేబుల్ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
ALSO READ: Inter exams: స్టూడెంట్స్‌కు బిగ్ అలర్ట్.. తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు
ప్రస్తుతం పరారీలో ఉన్న మరో దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మహమ్మద్ ఉమర్ అన్సారీ నేర చరిత్ర, కేసుల వివరాలు, అతనికి సహకరిస్తున్న వారిని కూడా గుర్తిస్తామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ కాల్పులు జరిపారని అన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని ఆయన వివరించారు. ఈ చర్య రౌడీయిజం, స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడేవారికి గట్టి హెచ్చరికగా నిలిచిందని చెప్పవచ్చు.