Sunflower Seeds: చర్మ సౌందర్యాన్ని సహజంగా మెరిసేలా చేసుకోవాలని ఎవరు మాత్రం అనుకోరు చెప్పండి! సహజసిద్ధంగానే చర్మం మెరవాలంటే.. కచ్చితంగా కొన్ని సీడ్స్ తీసుకోవాల్సిందే. ఆరోగ్యకమైన చర్మానికి కొన్ని విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి పోషకాలు లభించడమే కాకుండా.. అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చు. అలాంటి విత్తనాల్లో పొద్దుతిరుగుడు గింజలు అతి ముఖ్యమైనవి. ముఖం మీద మొటిమలు, మచ్చలు రాకుండా ఉండాలంటే.. ఈ గింజలను రోజూ తినమని నిపుణులు సూచిస్తున్నారు.
సన్‌ఫ్లవర్ సీడ్స్‌ను రెండు గంటల పాటు ఎండలో ఉంచి, ఆ తర్వాత మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా.. కాస్త గరుకుగా ఉండాలి. ఇలా తయారుచేసిన పొడిని టీస్పూన్ తీసుకుని, దానికి కొద్దిగా పాలు, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఈ ప్యాక్ ముఖంపై పేరుకొన్న మురికిని తొలగిస్తుంది. చర్మానికి తేమనందించి పొడి చర్మం సమస్య నుంచి విముక్తి కలిగిస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు.
మిశ్రమ చర్మతత్వం ఉన్న వారికి చర్మంపై ప్యాచెస్ మాదిరిగా అక్కడక్కడా పొడిగా కనిపిస్తుంటుంది. ఇలాంటి వారికి సన్‌ఫ్లవర్ సీడ్స్ ఫేస్‌ప్యాక్ చక్కగా నప్పుతుందంటున్నారు నిపుణులు. దీనికోసం పై పద్ధతిలో తయారుచేసి పెట్టుకొన్న సన్‌ఫ్లవర్ గింజల పొడిని టీస్పూన్ తీసుకోవాలి. దీనికి కొద్దిగా గంధం పొడి, రోజ్‌వాటర్ కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్త్లె చేసుకుని, 20 నిమిషాల తర్వాత తడి వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై డ్రై ప్యాచెస్ పోవడంతో పాటు.. చర్మం సూర్యకాంతిలా ప్రకాశిస్తుంది.
* రోజుకి గుప్పెడు పొద్దుతిరుగుడు గింజలు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు.
* ఈ విత్తనాల్లో ప్రొటీన్ , జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ , విటమిన్ ఈ, బీ, బీ6, మంచి కొవ్వులు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
* పొద్దుతిరుగుడు గింజల్లోని విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం రక్త పీడనం నియంత్రణలో ఉండడానికి తోడ్పడతాయి.
* విటమిన్ బి మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ గింజలు డైలీ తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలు కూడా పెరుగుతాయి. బరువు అదుపులో ఉంచడం, రోగనిరోధక శక్తిని పెంచి ఇతర అనారోగ్య సమస్యలు దరిచేరనివ్వదు.
* ఇంకా దీనిలో ఉన్న విటమిన్ ఈ చర్మానికి పోషణ అందించి, హానికర కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి పొద్దుతిరుగుడు గింజలు ఔషధంలా పనిచేస్తాయట. అంతేకాదు.. వీటిని నేరుగా తినడం వల్ల కూడా మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.