వరుస విమాన ప్రమాదాలు ప్రయాణీకులను బెంబేలెత్తిస్తున్నాయి. విమాన ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా హాంకాంగ్ లో మరో విమాన ప్రమాదం జరిగింది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే నుంచి ఓ విమానం జారి సముద్రంలో పడిపోయింది. ఫ్లైట్ అదుపుతప్పి జారిపోయే సమయంలో గ్రౌండ్ సర్వీస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. ప్రమాదానికి కారణం అయిన కార్గో విమానం దుబాయ్ నుంచి వచ్చింది.
టర్కిష్ క్యారియర్ ఎయిర్ ACT నడుపుతున్న ఎమిరేట్స్ స్కైకార్గో విమానం EK9788 దుబాయ్ లోని అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (DWC) నుండి బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున ఈ విమానం హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వచ్చింది. విమానాశ్రయంలోని నార్త్ రన్‌వే 07R మీద దిగాల్సి ఉంది. అయితే, ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పినట్లు అధికారులు వెల్లడించారు. ల్యాండింగ్ రోల్ సమయంలో ఎడమ వైపుకు తిరిగి, రన్ వే పక్కన ఉన్న సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విమానం కొంత మేర నీళ్లలో మునిగిపోయింది.
ఇక కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పడం వల్ల గ్రౌండ్ సర్వీస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో వెహికిల్ లోని ఇద్దరు కార్మికులు తీవ్ర గాయాలపాలై సముద్రంలో పడిపోయారు. వెంటనే రంగంలోకి దిగిన ఎయిర్ పోర్ట్ ఫైర్ సేఫ్టీ సిబ్బంది సముద్రంలో పడిపోయిన ఇద్దరు కార్మికులను బయటకు తీశారు. అప్పటికే డ్రైవర్ అపస్మారక స్థితిలోకి చేరాడు. వెంటనే అతడిని నార్త్ లాంటావు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు చనిపోయినట్లు డాక్టు వెళ్లడించారు. మరో కార్మికుడు స్పాట్ లోని చనిపోయాడు.
అటు కార్గో విమానంలో ఉన్న నలుగురు సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరిగలేదు. వెంటనే, ఫైర్ సేఫ్టీ సిబ్బంది వారిని బయటకు తీశారు. విమానాన్ని బయటకు తీసేందుకు సహాయక చర్యలు మొదలు పెట్టారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు మెరైన్ పోలీసులు షిఫ్ లు, ఫ్లయింగ్ సర్వీస్ హెలికాప్టర్ లో ఆ ప్రాంతానికి చేరకున్నారు. విమానాన్ని బయటకు తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఈ ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయం నార్త్ రన్ వేను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్‌సైట్ Flightradar24 డేటా ప్రకారం.. కార్గో విమానం ల్యాండింగ్ మార్గంలో ఏదో సమస్య ఏర్పడింది. విమానం ఎడమవైపుకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నేపథ్యంలో నెక్ట్స్ ల్యాండింగ్ లైన్ లో ఉన్న కాథే పసిఫిక్ విమానం CX851ను కాసేపు నిలిపివేశారు. కాసేపటి తర్వాత ఆ విమానాన్ని రన్ వే మీద ల్యాండింగ్ కు అనుమతించారు. మరోవైపు ఈ ప్రమాదానికి గల కారణాలపై ఎయిర్ పోర్టు అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రమాదానికి కారణం ఏంటి? అనే విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందని అధికారులు తెలిపారు.
Read Also: రైలు నుంచి పడి చనిపోయిన భర్త.. పరిహారం ఇవ్వని రైల్వే, సుప్రీం కోర్టు ఊహించని తీర్పు!