Secunderabad History: సికింద్రాబాద్ అసలు పేరేంటో తెలుసా..? అసలు హైదరాబాద్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? ఇంకా చెప్పాలంటే హైదరాబాద్, సికింద్రాబాద్ లోని కొన్ని ప్రాంతాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
హైదరాబాద్: కులీకుతుబ్ షా భార్య భాగమతి వివాహం తర్వాత తన పేరుని హైదర్ మహల్ గా మార్చుకున్నారు. హైదర్ మహల్ కాలక్రమేణా హైదరాబాద్ అయిందని చెప్తుంటారు.
సికింద్రాబాద్: సికింద్రాబాద్ అనే పేరు వెనకాల కూడా ఒక హిస్టరీ ఉంది. మూడో నిజాం సికిందర్ ఝా పేరు మీద ఈ ప్రాంతానికి సికింద్రాబాద్ అనే పేరు వచ్చింది . అంతకు ముందు సికింద్రాబాద్ ని లష్కర్ అని పిలిచే వారు.
బేగం బజారు: హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో బేగంబజారుగా మారిపోయింది.
అఫ్జల్ గంజ్: ఐదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్ గంజ్ గా మారింది
చిక్కడపల్లి: చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్ పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో బురద ఉండేదట. అలా బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడపల్లిగా మారిపోయింది.
అంబర్ పేట: అంబర్ అంటే ఉర్దూలో మేఘాలు అని అర్ధం. పేట అంటే కాలనీ. ఆ ఏరియా ఎప్పుడూ మేఘావృతమై ఉండేది. దాంతో అది అంబర్ పేటగా స్థిరపడిపోయింది.
బేగంపేట: 6వ నిజాం మహబూబ్ అలీ కుమార్తె బషీర్ ఉన్నిసా బేగం ను ఉమ్రన్ అమిర్ కు ఇచ్చి పెళ్లి చేశాడు.. కూతురికి కట్నం కింద ఒక స్థలాన్ని ఇచ్చాడు. ఆ స్థలానికి బషీర్ ఉన్నిసా బేగం పేరు మీదగా బేగంపేట అని పేరు వచ్చింది.
చార్మినార్: కులికుతుబ్ షా కట్టిన ఈ కట్టడానికి ప్రధాన ఆకర్షణ నాలుగు స్థంబాలు. ఉర్దూలో చార్ అంటే నాలుగు, మినార్ అంటే స్థంబాలు… వీటి పేరు మీదుగానే చార్ మినార్ అనే పేరు వచ్చింది.
ఖైరతాబాద్: ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది
శంషాబాద్: షమ్స్-ఉల్-ఉమ్రా అనే పేరు మీద శంషాబాద్ అనే పేరు వచ్చింది. షమ్స్ అంటే సూర్యుడు. దీని అర్థం ప్రభువుల యందు సూర్యుడిలాంటి వాడని. ఈ బిరుదు నవాబ్ మొయిన్-ఉద్-దౌలా బహదూర్ కు ఉండేదట.
నాంపల్లి: నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్ అనే దివాన్‌కు నెఖ్ నామ్ ఖాన్ అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెఖ్- నామ్- పల్లిగా పిలిచేవారు. ఇప్పుడది నాంపల్లిగా మారిపోయింది.
హిమయత్ నగర్: 1933 లో ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్ యొక్క పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ ఆసఫ్ జా పేరు మీద ఆ స్థలానికి హిమాయత్ నగర్ అని పేరు వచ్చింది.
అబిడ్స్: ఆరో నిజాం కాలంలో అల్‌బర్ట్ అబిద్ అనే ఒక ఆర్మేనియా యూదు వ్యాపారి ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. తర్వాత కొంతకాలానికి ఆల్బర్డ్ అబిడ్ ఇంగ్లాండ్ కి వెళ్లిపోయినప్పటికీ ఆ స్థలానికి ఆ పేరే స్థిరపడిపోయింది!కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా అబిడ్స్ గా మారిపోయింది.
సోమాజిగూడ: నిజాం కాలంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారైన సోనాజీకి కొన్ని భూములుండేవి. సోనాజీ కాస్త సోమాజి అయింది. గూడ అంటే చిన్న గూడెం లేదా ప్రాంతం అని అర్ధం. రెండు కలిపి సోమాజిగూడ అయ్యింది!
మలక్ పేట్: గోల్కొండ రాజు అబ్దుల్ కుతుబ్ షా యొక్క సేవకుడు మాలిక్ యాకుబ్ పేరు మీదగా ఈ ప్రదేశానికి మలక్ పేట్ అనే పేరు వచ్చింది
బషీర్ బాగ్: బసిరుద్దౌలాకు హైద్రాబాద్ లో ఒక ప్యాలెస్ ఉండేది. ఆ ప్యాలెస్ దగ్గర పెద్ద గార్డెన్ ఉండేది . బసిరుద్దౌలా పేరు మీద ఆ ప్రదేశానికి బషీర్ బాగ్ అనే పేరు వచ్చింది. బాగ్ అంటే గార్డెన్ అని అర్ధం.
ఫలక్ నుమా: ఫలక్ అంటే ఆకాశం , నామ అంటే అద్దం . ఈ ప్రదేశం అంతా కొండలతో ఎంతో ఎత్తుగా ఉండేది . కాబట్టి ఆకాశానికి అద్దం అనే అర్థం వచ్చేలా ఫలక్ నామ అని పేరు పెట్టారు . ఫలక్ నామ కాస్త ఫలక్ నుమా అయ్యింది!
సరూర్ నగర్: రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధానిగా పని చేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి చార్మినార్‌కు 4 మైళ్ల దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం సరూర్ నగర్ అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరుమీదనే స్థిరపడింది.
లంగర్ హౌజ్: గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ ఖానా కాలక్రమేణా లంగర్ హౌజ్ మారింది. గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.
చెంచల్ గూడ: చిచ్‌లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో చెంచల్ గూడగా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.
దోమలగూడ: దోమలగూడ అసలు పేరు దో మల్ గూడ! పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారి పేరు మీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది దోమలగూడగా మారింది.
తార్నాక: తార్నాక అసలు పేరు తార్ నాకా! తార్ అంటే ముళ్లకంచె. నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది తార్నాకగా మారింది.
శాలిబండ: శాలిబండ అసలు పేరు షా-అలీ-బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ నివసించేవాడు. ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు.. కాలక్రమంలో అది శాలిబండగా మారింది
మదీనా: ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనం వల్ల ఈ ప్రాంతానికి మదీనా అనే పేరు వచ్చింది.
ముషీరాబాద్: హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీ-రుల్-ముల్క్ అనే నవాబ్ కు రెండో నిజామ్ కానుకగా ఇచ్చాడు. 1785లో ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్, గార్డెన్ నిర్మించాడు. ముషీ-రుల్-ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం ముషీరాబాద్ గా స్థిరపడిపోయింది.
చాదర్ ఘాట్: మూసీ నుంచి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పై నుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట. అందుకే ఆ ఏరియాకు చాదర్ ఘాట్ అని పేరొచ్చింది.
సుల్తాన్ బజార్: 1933 కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడే చౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం ఆధికారంలోకి వచ్చాక, ఆ ఏరియాని సుల్తాన్ బజార్ అని మార్చేశారు.
చాంద్రాయణగుట్ట: చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది చాంద్రాయణగుట్టగా మారిపోయింది.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.