కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి వివరించారు. తల్లికి వందనం, పించన్ల పెంపు, నిరుద్యోగుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ వంటి కీలక నిర్ణయాలను ప్రస్తావించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ట్రోల్స్ చేసినా వెనకడుగు వేయకుండా కడపను అభివృద్ధి పథంలో నిలుపుతామని ఆమె స్పష్టం చేశారు.
జగిత్యాల జిల్లా ధర్మపురిలో మాతా శిశు ఆసుపత్రి భవనం పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా సేవలు ప్రారంభించకపోవడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్నా చేపట్టారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ నిర్లక్ష్యం వల్ల గర్భిణీలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రొద్దుటూరు మున్సిపల్ అవుట్‌సోర్సింగ్ కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు అందకపోవడంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కనీసం వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని విమర్శించారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మౌనం వీడి, సంక్రాంతి లోపు బకాయిలు విడుదల చేయాలన్నారు.
హైదరాబాద్ బోరబండలో లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయిన లారీ ఒక్కసారిగా పక్కనే ఉన్న షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడ ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాకలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ కల్కి వెంకటేశ్వరస్వామి ఉత్తర ద్వార దర్శనానికి ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయాధికారులు ప్రత్యేక క్యూలైన్లు, అన్నసమర్పణ ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఈగల్ టీమ్ పోలీసులు ఓ మహిళ నుంచి డ్రగ్స్ సీజ్ చేశారు. నిందితురాలు హస్సా నుంచి MDMA, LSD మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో గోవాలోని వాగటార్ క్లబ్ వేదికగా డ్రగ్స్ దందా సాగుతున్నట్లు తేలింది.
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాయచోటిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముస్లిం మత పెద్దలు, స్థానిక నేతలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల సామాన్యులపై పన్నుల భారం పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా పహాడీ షరీఫ్ వద్ద మీర్‌పేట్ ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. గోవా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 5 లక్షల రూపాయల విలువైన 229 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మహబూబ్‌నగర్ డీటీసీ కిషన్‌ను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయన నుంచి వందల కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముదిరాజ్ సర్పంచుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ ఈటెల రాజేందర్ తదితర ప్రముఖులు హాజరై, గెలుపొందిన సర్పంచులను అభినందించారు. ముదిరాజులంతా ఐక్యంగా ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు.
భారతదేశం సంస్కరణ ఎక్స్‌ప్రెస్‌లోకి ప్రవేశించింది. 2025 వివిధ రంగాలలో గణనీయమైన సంస్కరణలకు నాంది పలికిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జీఎస్టీ, బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐ, విద్యా, కార్మిక రంగాల్లో చేపట్టిన మార్పులు దేశ అవృద్ధిని వేగవంతం చేస్తాయని లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వివరించారు.
కరీంనగర్ రూరల్ మండలం బహుదూర్ ఖాన్ పేటలో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గుర్రం భూమిరెడ్డి అనే రైతు పొలంలో పులి పాదముద్రలను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పంట పొలాలకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరించారు.
కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవ అవకతవకలపై టీడీపీ నేత వర్మ ఆరోపణల నేపథ్యంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరసింహ నాయక్ తనిఖీలు చేపట్టారు. బాధితుల ఫిర్యాదులను పరిశీలించి, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదికను రేపు జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జార్ఖండ్‌లోని గుమ్లాలో జరిగిన కార్తీక యాత్ర సాంస్కృతిక సమ్మేళనానికి హాజరయ్యారు. గిరిజన సంప్రదాయాలను, భవిష్యత్ తరాలను అనుసంధానించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గిరిజన వారసత్వాన్ని, ప్రత్యేక గుర్తింపును కాపాడుకుంటూనే, యువత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.
వరంగల్‌లో SBI ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ ప్రైవేట్ లెక్చరర్ నుంచి 37 లక్షల రూపాయలు కాజేశారు. అధిక లాభాల ఆశచూపి, నకిలీ అప్లికేషన్ ద్వారా పెట్టుబడులు పెట్టించి ఈ మోసానికి పాల్పడ్డారు. డబ్బు విత్‌డ్రా కాకపోవడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
అమెరికాకు 10 ఏళ్లపాటు వలసలు నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ అన్నారు. ఇమిగ్రేషన్ వ్యవస్థలో భారీగా అవినీతి పేరుకుపోయిందని వ్యాఖ్యానించారు. అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ కార్మికులతో కంపెనీలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాయని హెచ్-1బీ వీసా కార్యక్రమం గురించి పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మరణం పట్ల ఆమె కుమారుడు తారీకు రెహ్మాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన తల్లి దేశం కోసం భర్తను, బిడ్డను కోల్పోయిందని.. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన రాజీలేని నాయకురాలని కొనియాడారు. చాలామందికి ఆమె ప్రజాస్వామ్య తల్లి, కానీ నాకు మాత్రం ప్రేమగల తల్లి అని పేర్కొన్నారు.
బీఎస్ఎన్ఎల్ సేవలను మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు జార్ఖండ్, రాజస్థాన్, తమిళనాడు సర్కిళ్ల పనితీరును పరిశీలించారు. జార్ఖండ్ సర్కిల్ రూపొందించిన వ్యాపార వృద్ధి ప్రణాళికను ఆయన అభినందించారు.
విజయ్ హజారే ట్రోఫీలో దిల్లీ తరఫున ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. తొలి మ్యాచ్‌లో 131, రెండో మ్యాచ్‌లో 77 పరుగులు చేశాడు. జనవరి 11న న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ మరో మ్యాచ్ ఆడబోతున్నాడు.
నటుడు అల్లు శిరీష్ కొత్త ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ ఏడాది అక్టోబరులో ఆయనకు.. తన ప్రియురాలు నయనికతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ జంట వచ్చే ఏడాది మార్చి 6న పెళ్లి పీటలెక్కనుంది. ఈమేరకు తమ పెళ్లి తేదీని శిరీష్ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు.