ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఓ అరుదైన ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ నెల 13న హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మెస్సీ టీమ్ తో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్ కోసం ఎంసి హెచ్ ఆర్ డి గ్రౌండ్ లో ప్రాక్టీసు చేశారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో భాగంగా ఈ డ్రీమ్ మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఆర్-9 జట్టు తరఫున 9వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగనుండగా.. లియోనెల్ మెస్సీ 10వ నంబర్ జెర్సీతో ఎల్ఎం-10 జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
తెలంగాణ వారి దిష్టి తగిలిందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. పవన్ సినిమా యాక్టర్‌గా ఉన్నప్పటీ నుంచి.. ఇప్పటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. యాక్టర్‌గా ఉన్నప్పుడు ఏమి మాట్లాడిన చెల్లింది.. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మాట్లాడితే కుదరదంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆనాడు పార్లమెంట్‌లో కూడా ఏపీకి ప్రత్యేక హెదా కావాలంటూ.. తాను మాట్లాడానని చెప్పారు కవిత. తెలంగాణ ప్రజలు ఎప్పడు దిష్టి పెట్టలేదన్నారు. కోనసీమ మాదిరి తెలంగాణ ఉండాలనుకున్నామంటూ చెప్పారు. ఇక నుంచి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని సూచించారు.
మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో మొసళ్లు కలకలం రేపాయి. పంట పొలాల సమీపంలో ఉన్న మున్నేరు వాగులో భారీ మొసళ్లు ప్రత్యక్షమవడంతో రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పశువుల కాపరులు కూడా తమ మూగజీవాలకు దాహార్తి తీర్చాలంటే జంకుతున్నారు. మొసళ్ల కారణంగా తమ పనులు నిలిచిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అటవీ అధికారులు స్పందించి, వాగులో సంచరిస్తున్న ఈ మొసళ్లను పట్టుకుని తరలించాలని కోరుతున్నారు గ్రామస్తులు.
హిల్ట్ పాలసీ లీక్‌పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. జీవో రాకముందే సమాచారం లీక్ అవడంపై.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. హైదరాబాద్ చుట్టుపక్కల భూములపై..HILT పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కసరత్తు దశలోనే సమాచారం బయటకు లీకైనట్లు తెలుస్తోంది. నవంబర్ 20నే ఫొటోస్టాట్ కాపీలు బయటకొచ్చినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. గతనెల 21న హిల్ట్ పాలసీపై ప్రెస్‌మీట్ పెట్టారు KTR. 22న ప్రభుత్వం…జీవో విడుదల చేసింది. ముందే సమాచారం ఎవరు లీక్ చేశారో తేల్చేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
వరంగల్‌లో కత్తితో దాడి చేసుకున్నారు మామ, అల్లుడు. తన భార్యను కాపురానికి పంపించడం లేదని వాదనకు దిగి.. మామను కత్తితో పొడిచాడు అల్లుడు. అదే కత్తి లాక్కొని తిరిగి అల్లుడిని పొడిచాడు మామ. ఈ ఘటన రామన్నపేట బొడ్రాయి దగ్గర జరిగింది. ఇద్దరు తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలి పడిపోయారు. వెంటనే స్థానికులు మామ, అల్లుడిని ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.
నల్గొండ జిల్లా అనుముల పరిధిలోని పేరూరు గ్రామపంచాయతీ ఎన్నికల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకి రిజర్వ్ కావడంతో పాటు, ఎనిమిది వార్డుల్లో నాలుగు వార్డులు ఎస్టీలకు రిజర్వ్ కావడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు.
మన్యం జిల్లా సాలూరు లైంగిక వేధింపుల కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదే విధంగా బాధిత మహిళతో పాటు ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర మొబైల్స్‌ను సీజ్ చేశారు. పోలీసులు మొత్తం 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లు అన్నింటిని సైబర్ క్రైమ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్‌కి పంపించినట్లు తెలుస్తోంది. సతీష్ వద్ద కూడా స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్నట్లు సమాచారం.
హన్మకొండ జిల్లా, కమలాపూర్ మండలం నేరెళ్ళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు శ్రీరామ్, నాగలక్ష్మి వినూత్న ప్రచారం చేపట్టారు. గ్రామానికి ప్రధాన సమస్యగా ఉన్న కోతులను తరిమేందుకు, తమ అనుచరులకు ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణ వేయించారు. కోతులను తరుముతూ, తమను గెలిపిస్తే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇక్కడ 11వ తేదీన మొదటి విడత పోలింగ్ జరగనుంది.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గునుపూడిలో అర్ధరాత్రి మెడికల్ షాప్ లో చోరీ జరిగింది. దుండగుడు షాపు వెనుక భాగంలో షట్టర్ తాళాలు పగలగొట్టి, అద్దాలను ధ్వంసం చేసి షాప్ లోపలకు ప్రవేశించాడు. కౌంటర్లో ఉంచిన సుమారు రూ.30 వేల నగదును అపహరించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇది గమనించిన షాప్ యజమాని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ఓబులవారి చెరువు అశోక్ డాబా వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళ్తున్న రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఘటనా స్థలంలో ప్రథమ చికిత్స అందించి కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒక లారీ క్యాబిన్ లోకి మరో లారీ చొచ్చుకుపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు జేసీబీ సహాయంతో అక్కడ పరిస్థితిని చక్కదిద్దారు.
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కండ్ల గూడూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న శివ నారాయణ, శివరామరాజులకు పాము కాటు వేయడంతో 2వ తరగతి చదువుతున్న శివ నారాయణ మృతి చెందాడు. శివరామరాజు పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. శివరామరాజు 5వ తరగతి చదువుతున్నాడు. పాముకాటుతో విద్యార్థి మృతి
శ్రీశైలం పాతాళగంగలో నీటి కుక్కలు దాడి చేయడంతో ఐదుగురు భక్తులకు గాయాలయ్యాయి. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులను నీటి కుక్కలు కరుస్తున్నాయని, చిన్నపిల్లలను నీటిలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నాయని హైదరాబాద్ భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ, దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థి కత్తుల మాధవరెడ్డి వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టారు. గ్రామం అభివృద్ధికి నోచుకోక వెనుకబడిందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఇచ్చిన హామీలను నెరవేర్చి, గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు.
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై సురుట్లపల్లి కొండేశ్వర్ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పద్మనాభ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధికి ఏనాడూ పనిచేయని ఎమ్మెల్యే తనిఖీలు చేయడంపై మండిపడ్డారు. తనపై దుష్ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు. ఆలయానికి రూ.100 విరాళం ఇవ్వని నువ్వు వచ్చి ఈవోను బెదిరించావు అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
మంచిర్యాల జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు ఆర్డీవో శ్రీనివాస్ రావు. చెన్నూరు మండలం కిష్టంపేట నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన, అభ్యర్థులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ కాంగ్రెస్ నాయకురాలు పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర దుమారం రేపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కించపరిచేలా ఆ వీడియో ఉండటంపై భాజపా నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రాగిణి నాయక్ తన సోషల్‌మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ప్రధాని చాయ్ అమ్ముతున్నట్లుగా ఉన్న ఏఐ జనరేటెడ్ వీడియో అది. దీంతో ఇది వివాదాస్పదమైంది. ఈ వీడియోపై బీజేపీపా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రధాని మూలాలను వారు అవమానిస్తున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా దుయ్యబట్టారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సోదరి అలీమా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో యుద్ధం కోసం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. అయితే, తన సోదరుడు మాత్రం పొరుగుదేశంతో స్నేహపూర్వక సంబంధాల కోసం ప్రయత్నాలు చేశారన్నారు.
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్ వాక్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించబోతున్నారు. ఇప్పటికే విగ్రహం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మ్యూజియంలో సచిన్, ధోనీ, కోహ్లీ విగ్రహాలు ఉన్నాయి.
తన వద్ద ఆయుధాలు లేకపోయినా దోషిగా ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించినట్లు బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ తెలిపారు. అలాగే బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత తన కుటుంబం ఎదుర్కొన్న బెదిరింపులను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తన కుటుంబంలోని వారందరికీ బెదిరింపులు వచ్చాయని చెప్పారు.