రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇవాళ రాష్ట్ర ప్రకటన చేసిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
తెలంగాణలో మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై నేటికి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు రూ.8459 కోట్ల విలువైన ప్రయాణం పొందారు. ఈ పథకం మహిళా సాధికారతకు, కుటుంబ బంధాలకు, విద్య/ఉపాధి అవకాశాలకు తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశానని, గ్రామ సర్పంచిగా నన్ను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతమన్నారు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు సర్పంచ్ అభ్యర్థి పాతకోటి పద్మ వేంకటేష్. సిద్దిపేట జిల్లా రాజక్కపేట సర్పంచ్ అభ్యర్థి పాతకోటి పద్మ (కత్తెర గుర్తు) భర్త, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వెంకటేష్, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మేనిఫెస్టో విడుదల చేశారు. రాజక్కపేట-ఎల్లాపూర్ బ్రిడ్జి, పారిశుద్ధ్యం, ఉచిత అంబులెన్స్, యువతకు క్రీడా సౌకర్యాలు, గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామిక వాడలో ఉన్న షాహి ఎక్స్ స్పోర్ట్స్ గార్మెంట్ సంస్థ ముందు కార్మికులు చేపట్టిన ధర్నా రెండో రోజు కొనసాగుతోంది. ఈ సంస్థలో పని చేస్తున్న మహిళా కార్మికులు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. తమకు పనికి తగ్గ జీతం ఇవ్వకుండా, జీతాల్లో అక్రమంగా కోతలు విధిస్తూ వెట్టి చాకిరి చేయిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి తమ జీతాలు పెంచి, న్యాయమైన వేతనం అందించాలని వారు డిమాండ్ చేశారు.
గాంధీ ఆసుపత్రిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోగులు, వారి కుటుంబ సభ్యులపై దాడి చేసేందుకు యత్నిస్తున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో గట్టిగా అరుస్తూ, దారిలో నడుస్తూ వెళ్లేవారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇప్పటికైన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రోగుల కుటుంబ సభ్యులు.
వరంగల్ జిల్లా రాయపర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని గుబ్బేడితండా ఓటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న జరగనున్న పంచాయతీ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నట్లు ఏకగ్రీవంగా ప్రకటించారు. గత 60 ఏళ్లుగా తమ తండా సమస్యలు పరిష్కారం కావడం లేదని మండిపడుతున్నారు. తమకు తాగునీరు, రోడ్లు, విద్యా, వైద్య సదుపాయాలు సరిగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన నాయకులను నిలదీసిన తండావాసులు, తమ సమస్యలు తీర్చే వరకు ఓటు వేయబోమని స్పష్టం చేశారు. కేవలం 45 మంది ఓటర్లు ఉన్న ఈ తండా తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో రాజేశ్వరి అనే మహిళ ఎన్నికల బరిలో నిలిచారు. తనను గెలిపిస్తే 12 పడకల ఆస్పత్రి, మినీ ఫంక్షన్ హాల్, ఓపెన్ జిమ్ ఏర్పాటుతో పాటు, కోతుల సమస్యను పరిష్కరిస్తానని బాండుపై రాసిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మూడేళ్లలో నెరవేర్చకపోతే చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తానని ఓ సర్పంచ్ అభ్యర్థి బాండ్ రాసివ్వడం చర్చనీయాంశమైంది.
గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌక్ వద్ద మద్యం మత్తులో ఉన్న స్నేహితులు వంశీ, అరవింద్, వసంత్ మధ్య ఘర్షణ జరిగింది. మాటామాటా పెరిగి ముగ్గురూ కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్ఆర్ పురం మండలం పాతపాలెంలో జరిగిన ‘పల్లె నిద్ర’ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే థామస్ పాల్గొన్నారు. ఎస్ఆర్ పురం పంచాయతీకి ఆయన వరాల జల్లు కురిపించారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో 6 పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పాతపాలెం పరిధిలో 700 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు చేసి, భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
అనంతపురం జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బుక్కరాయసముద్రం మండలం వీరభద్ర కాలనీలో శనివారం ముగ్గురు స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో సాయి అనే యువకుడిని అక్కడికక్కడే హత్య చేశారు. హత్య అనంతరం మృతదేహాన్నికెనాల్ సమీపంలోని ఓ బావిలో పడేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన స్నేహితుల్లో ఒకరైన ధనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు యువకులు ఘటన సమయంలో స్వామి మాలలు ధరించి ఉన్నట్లు సమాచారం. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నెల్లూరులో సీటీ బస్సు సిబ్బందిపై బ్లేడ్‌తో దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆది, సోమవారం రాత్రులు ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న వారిని, మద్యం సేవించిన వారిని పోలీసులు అదుపు చేసి, లాఠీలు ఝుళిపించారు. రాత్రి పూట అనవసరంగా తిరిగితే సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు.
చిత్తూరు జిల్లా నగరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు వేగంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. తిరుపతి నుంచి తిరుత్తణి వైపు వెళుతున్న కారు.. తిరుపతి నుంచి నగరి మీదుగా వస్తున్న కారు వేగంగా ఢీకొన్నాయి. జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా సరైన దారి మళ్లింపు సూచిక బోర్డులు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం మిస్టరీ వీడింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోడ్డుపై కంటైనర్‌ను ఆపడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి, వాహనాలు ఆపుతూ.. ఓ ASI కుమారుడు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ లోడుతో వెళ్తున్న కంటైనర్‌ను సైగలు చేసి హైవేపై నిలిపాడు. దీంతో వెనక నుంచి వచ్చిన కారు కంటైనర్‌ను ఢీకొట్టడంతో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు.
మునుగోడు నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపిస్తే గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు రాజగోపాల్‌రెడ్డి. మంత్రి పదవి ఇస్తానని తనకు కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. మంత్రివర్గ విస్తరణ ఆలస్యమైనప్పటికీ తనకు మంత్రి పదవి వస్తుందని నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తే గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తనదంటున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
లండన్‌లో జెలెన్‌స్కీ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ నాయకులతో భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ట్రంప్ ప్రతిపాదించిన ట్రంప్ శాంతి ప్రణాళికపై రెండు గంటలు చర్చించారు. ఉక్రెయిన్‌కు ఐరోపా మిత్రదేశాలైన ఈ దేశాల మద్దతు కీలకం. రాబోయే రోజులు శాంతికి ముఖ్యమని జర్మనీ ఛాన్స్‌లర్ మెర్జ్ అన్నారు.
ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. వ్యవస్థలను మెరుగుపర్చేందుకే నిబంధనలని.. ప్రజలను వేధించడానికి కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎన్డీయే పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
ఎన్నికల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలో మహిళా న్యాయవాదులకు 30 శాతం సీట్లు కేటాయించాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ప్రస్తుత ఏడాదికి ఎన్నికల్లో పోటీ చేయడానికి తగినంత మంది మహిళా న్యాయవాదులు లేనట్లయితే 20శాతం సీట్లు వారికి కేటాయించి, మరో 10 శాతం సీట్లకు వారిని కో-ఆప్ట్ చేసుకోవాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి ధర్మాసనం సూచించింది.
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె మరో భారీ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత అమర్ కౌశిక్ తెరకెక్కించిన ‘స్త్రీ 2’ భారీ విజయం తర్వాత విక్కీ కౌశల్ హీరోగా ‘మహావతార్’ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్ట్‌లోకి చిత్రబృందం దీపికను తీసుకోనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026 లీగ్ వేలం త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 350 మంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. బీసీసీఐ అనూహ్యంగా నమోదు చేసుకున్న ప్లేయర్ల జాబితా నుంచి వెయ్యి మంది పేర్లను తొలగించింది. అలాగే 35 మంది కొత్త ఆటగాళ్ల పేర్లను చేర్చింది. 350 మంది ఆటగాళ్లకు సంబంధించిన ఆక్షన్ డిసెంబర్ 16 మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అబుదాబీలో జరగనుందని బీసీసీఐ.. ఐపీఎల్ ప్రాంఛైజీలకు పంపిన మెయిళ్లలో తెలిపింది.
టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ పలు కీలక సూచనలు చేశాడు. హార్ధిక్ పాండ్య పునరాగమనం గురించి అతడు మాట్లాడాడు. అతడు చాలా ముఖ్యమైన ఆటగాడు. బంతి, బ్యాట్‌తోనూ రాణించగలడు. జట్టులో అతడు ఉండటం చాలా అవసరం. టీమ్‌కు అతడి అనుభవం ఉపయోగపడుతుందన్నాడు