పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ప్రతి ఏడాది గోదావరి నది నుంచి 2800 టీఎంసీల గోదావరి నీరు.. సముద్రంలో కలుస్తుందని తెలిపారు. ఆ నీటి వినియోగానికే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చినట్లు వివరించారు. మూడేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే.. రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని చెప్పారు సీఎం.
అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఆఫీస్ నిర్మాణాలకు పునాది వేయడంతో ఏపీ అభివృద్ధికి పునాది పడిందని హర్షం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట ఉండటం అరుదని.. అది అమరావతి సాధించిందని తెలిపారు పవన్.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీసి చలాన్లు వేయడంపై హైకోర్టులో అభ్యంతరం తెలిపారు పిటిషనర్ రాఘవేంద్ర చారి. ఈ విధానంపై సీరియస్ అయిన హైకోర్టు.. చలాన్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై పూర్తి నివేదిక ఇవ్వాలని హోం శాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ 2019 గ్రూప్ 2 సెలక్షన్ లిస్ట్‌పై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. నిబంధనలు పాటించిన వారు బయట ఉండగా, ఉల్లంఘించిన వారు ఉద్యోగాలలో ఉన్నారని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఆరేళ్లుగా ఉద్యోగం చేస్తున్న వారిని తొలగించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. తదుపరి సుదీర్ఘ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.
హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థిని దీపికా చౌదరి మృతి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. సనత్‌నగర్‌లోని కల్పతరు రెసిడెన్సీలోని 14వ అంతస్తు నుంచి పడి ఆమె అనుమానాస్పదంగా మృతి. దీపిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు. ఆమెది ఆత్మహత్య? లేక వేరే కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది.
హైదరాబాద్‌లో ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ప్రేక్షకుల డబ్బును దోచుకుంటోన్న థియేటర్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా సంధ్య థియేటర్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై రవి కుమార్, సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ముత్తోజిపేట శివారులో అనుమానాస్పదంగా కనిపించిన బొమ్మెర మహేష్ పారిపోబోయాడు. పోలీసులు అతన్ని పట్టుకొని తనిఖీ చేయగా, అతని వద్ద అరకేజీ ఎండు గంజాయి లభించింది.
ఢిల్లీ పేలుడు ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితురాలు షహీన్ సయీద్‌ను అల్ ఫలాప్ వర్సిటీకి తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా సయీద్‌ను వర్సిటీలో పలు అంశాలపై విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం.
చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో క్రిటికల్‌గా ఉన్న ఆరు గ్రామాలలో ఏసీపీ కిషన్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఓటర్లు శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు.
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరొకరిని అరెస్ట్ చేసింది సిట్. ఈ కేసులో మొదటి సారి టీటీడీ అధికారిని అరెస్ట్ చేశారు. టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ మాజీ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్నతో కలిసి కల్తీ నెయ్యి సరఫరాలో కుట్రలకు పాల్పడ్డారని ఆయనపై కేసు నమోదు చేశారు.
కడప జిల్లా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బద్వేల్ పట్టణం, తెలుగు గంగా కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీరామచంద్ర ఆలయంలో నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలోని జ్యోతి ల్యాబ్‌ను టెక్నీషియన్ లేరని సీజ్ చేశారు. జిల్లాలో ఎన్నో ల్యాబ్‌లు ఉన్నాయని కొందరు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని సక్రమంగా అన్ని అనుమతులతో రన్ చేస్తున్న అడ్డు రోడ్డు జ్యోతి ల్యాబ్‌ని మాత్రమే సీజ్ చేయమని రాష్ట్ర హోం మంత్రి అనిత అధికారులకు చెప్పారని జ్యోతి ల్యాబ్ నిర్వాహకరాలు దాట్ల ఉమాదేవి ఆరోపిస్తున్నారు.
కృష్ణాజిల్లా గుడివాడలోని EVR ఆసుపత్రిపై ఆరోగ్యశ్రీ దొంగ బిల్లుల ఆరోపణలు వచ్చాయి. ఉచిత క్యాంప్‌కు వచ్చిన వృద్ధురాలు యాళ్ల సావిత్రికి గుండె పరీక్షల పేరు చెప్పి, మోకాలి శస్త్రచికిత్స చేసినట్లు తప్పుడు బిల్లు పెట్టి, వేలిముద్రలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా కొలుకుల గ్రామంలో బత్తుల కుటుంబానికి చెందిన శివ గంగురాజు, నందినిల వివాహం ఒక వింత ఆచారంతో ప్రత్యేకంగా నిలిచింది. ఈ సంప్రదాయంలో వరుడు పట్టుచీర, అలంకరణతో వధువులా, వధువు తెల్ల పంచె, కుర్తాతో వరుడిలా వేషధారణలో కనిపించారు. ఇలా చేస్తే నూతన జంటకు శుభం జరుగుతుందని కుటుంబ సభ్యులు నమ్ముతారు.
ఏపీ జిల్లాల పునర్విభజనలో భాగంగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనిపై రంపచోడవరం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదట తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రంపచోదవరం నియోజకవర్గాన్ని అల్లూరి జిల్లాలో కలిపింది గత ప్రభుత్వం.
ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలో పర్యటించారు. ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠానికి వెళ్లిన ఆయన లక్ష కంఠ భగవద్గీత పఠనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగద్గీత శ్లోకాలను మోడీ పఠించారు. అనంతరం మధ్యసరోవరంలో తీర్థ ప్రోక్షణ ఆలయంలో కనకన కిండి నుంచి శ్రీకృష్ణుడిని మోడీ దర్శించుకున్నారు.
శ్రీలంకలో వరదల బీభత్సం కారణంగా 56 మంది మరణించారు. మరో 21 మంది గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనలో 600కు పైగా ఇళ్లు, పాఠశాలలు, వంతెనలు దెబ్బతిన్నాయి. శ్రీలంక ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేసి, రైలు సర్వీసులను నిలిపివేసింది.
వెనెజువెలాకు చెందిన డ్రగ్స్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లపై చర్యల కోసం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆపరేషన్లు సిద్ధం చేశారు. అతి త్వరలో వెనెజువెలా భూభాగంపై సైనిక చర్యలు చేపడతామని ట్రంప్ హెచ్చరించారు. వెనెజువెలా ముఠాల నుంచి మాదక ద్రవ్యాల సరఫరాను ఆపడానికి సైనిక దళాలను రంగంలోకి దింపారు.
ప్రమాదం కారణంగా తాను ఏడాది పాటు షూటింగ్‌లో పాల్గొనలేకపోయానని, ప్రేక్షకుల ఆశీస్సులతో మళ్లీ నటించగలిగానని నవీన్ పొలిశెట్టి అన్నారు. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా అనగనగా ఒక రాజు. మీనాక్షీ చౌదరి హీరోయిన్. మారి దర్శకుడు. 2026 జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో భీమవరం బల్మా సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర తరఫున పృథ్వీ షా సూపర్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. షా 36 బంతుల్లో మూడు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 66 పరుగులు చేశాడు. హైదరాబాద్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని మహారాష్ట్ర 18.4 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో ఛేదించింది.