E-Paper
Advertisement

Top 20 News Today: కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం రేవంత్ రెడ్డి, నేడు సీఐడీ ముందుకు హీరో రానా

Top 20 News Today: కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం రేవంత్ రెడ్డి, నేడు సీఐడీ ముందుకు హీరో రానా

1. ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్

సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ అయ్యారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని.. కూకట్‌పల్లిలో అరెస్టు చేశారు CCS పోలీసులు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వహిస్తున్నాడు.

2. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరనున్నారు. సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు.

3. ఐదేళ్ల తర్వాత గన్నవరం నుంచి సింగపూర్ సర్వీసులు ప్రారంభం..

ఐదేళ్ల తర్వాత గన్నవరం నుంచి సింగపూర్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రయాణికులు.. సర్వీసులు ప్రారంభం కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు హైదరాబాద్ నుంచి చెన్నై, చెన్నై నుంచి సింగపూర్ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సర్వీసులు ప్రారంభం కావడంతో.. చాలా సమయం కలిసి వస్తుందని ప్రయాణికులు చెబుతున్నారు.

4. నేడు మరో అగ్ని ప్రమాదం.. ధ్వంసం అయిన 4 ఇళ్లు..

విజయనగరం జిల్లా గరివిడిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కార్తీక మాసం సందర్భంగా ఓ డాబాపై వెలిగించిన దీపాన్ని కాకి కాలితో తన్నగా అది పక్కనే ఉన్న ఓ తాటాకు ఇంటిపై పడింది. దీంతో మంటలు చెలరేగి నాలుగు ఇళ్లు కాలిపోయాయి. దాదాపు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

5. నేడు సీఐడీ ముందుకు హీరో రానా

నేడు హీరో దగ్గుబాటి రానా సీఐడీ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌ కేసులో భాగంగా విచారణకు రానున్నారు. పలు బెట్టింగ్ యాప్స్‌ను రానా ప్రమోట్ చేసినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇవాళ రానా స్టేట్‌మెంట్ రికార్డు చేసే అవకాశం ఉంది.

6. దారుణం.. విద్యార్థి పై బ్లేడ్‌తో దాడి..

ఏలూరు జిల్లా చింతలపూడిలో విద్యార్ధిపై కొందరు విద్యార్థులు బ్లేడ్‌తో దాడి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఆనంద్ కుమార్ అనే విద్యార్థి గొంతు కోశారు. దీంతో విద్యార్థి గట్టిగా కేకలు వేయడంతో హాస్టల్ సిబ్బంది గమనించి చింతలపూడి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

7. ఎస్కార్ట్ సిబ్బందిపై వేటు

ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందిపై వేటు వేశారు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయడు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీతో కలిసి హోటల్లో టిఫిన్ చేసినందుకు వారిపై చర్యలు తీసుకున్నారు. ఎస్కార్ట్ సిబ్బంది ప్రసాద్, శివప్రసాద్, సాయి కిరణ్, సురేష్, ఏఎస్సై శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

8. AVSO సతీష్ కుమార్ మృతి కేసులో ట్విస్ట్

టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ మృతి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. సతీష్ కుమార్ హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పరకామణి కేసులోని ప్రత్యర్థులే హత్య చేశారని పోలీసులకు సతీష్ కుమార్ సోదరుడు ఫిర్యాదు చేశాడు. దాంతో గుత్తి రైల్వే పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు.

9. చిన్నారులపై కుక్కల దాడి.. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్న ప్రజలు

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చికెన్ సెంటర్ల వ్యర్థాలు రోడ్లపై పడేయడం దీనికి కారణమని పట్టణ వాసులు అంటున్నారు. నెల రోజుల క్రితం చిన్నారి వైష్ణవిపై దాడి జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

10. 26 మంది వైసీపీ నాయకులపై కేసు నమోదు..

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ పిలుపుతో ఈనెల 13న అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహించి నగరవాసుల స్వేచ్ఛకు ఇబ్బంది కలిగించినందుకు గాను, మాజీ ఎంపీతో సహా 26 మంది వైసీపీ నాయకులపై కేసు నమోదు చేశారు.

11. కొండగట్టు అంజన్న ఆలయంలో ఆర్జిత సేవల రేట్ల పెంపు

కొండగట్టు అంజన్న ఆలయంలో ఆర్జిత సేవల రేట్లు రెట్టింపు చేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై బ్రేక్ పడింది. ధరల పెంపుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఆలయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దేవుడి సేవలకు ధరలు పెంచవద్దని భక్తులు చేస్తున్న డిమాండ్‌తో అధికారులు ధరల పెంపు నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

12. కుత్బుల్లాపూర్‌లో బిగ్ టీవీ మెడికల్ క్యాంప్

హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ నిర్వహించింది. మమత హాస్పిటల్ సౌజన్యంతో.. BKR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య చేపట్టింది. ఈ మెడికల్ క్యాంపునకు పెద్ద సంఖ్యలో బస్తీ వాసులు తరలివచ్చారు. వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా టాబ్లెట్స్ తీసుకున్నారు.

13. పెరుగుతున్న పొగమంచు.. వాహన దారుల ఇబ్బందులు

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. బాసర గోదావరి నదిపై ఉదయం పూట మంచు దుప్పటి కమ్ముకుంది. భక్తులు ఆహ్లాదకర దృశ్యాన్ని చూసి మురిసిపోయారు. ప్రధాన రోడ్లపై పొగమంచు కమ్ముకోవడంతో వాహన దారులు ఇబ్బందులు పడ్డారు.

14. వివాహేతర సంబంధం ఉందంటూ ఓ వ్యక్తి కోర్టు మెట్లు ఎక్కాడు..

గుజరాత్ హైకోర్టులో ఓ వ్యక్తి విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడు. తన భార్య తరచూ వీధి శునకాలను ఇంటికి తీసుకురావడం, తనను పట్టించుకోకపోవడం లేదన్నాడు. దీనికి తోడు తనకు వివాహేతర సంబంధం ఉందంటూ తనపై ఓ రేడియో ఛానల్‌లో ఫ్రాంక్ చేసిందని.. ఇది తనను ఎంతో మానసిక ఒత్తిడికి గురి చేసిందన్నాడు. దీనిపై హైకోర్టు నోటీసులు జారీ చేసి, విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది.

15. భూభాగంలో భారత సైన్యం 4వ కార్ప్స్

అధిక ఎత్తులో ఉన్న భూభాగంలో భారత సైన్యం 4వ కార్ప్స్ అరుణాచల్ ప్రదేశ్‌లోని కామెంట్ సెక్టార్‌లో 16వేల అడుగుల ఎత్తులో స్వదేశీ మోనోరైల్ వ్యవస్థను అమలులోకి తెచ్చింది. ఇది 300 కిలోల కంటే ఎక్కువ లోడ్లను రవాణా చేయగలదు. వాతావరణంతో సంబంధం లేకుండా.. సైన్యానికి అవసరమైన మిషన్-క్రిటికల్ వస్తువుల రవాణాకు, వైద్య అత్యవసరాలకు ఇది ఒక విప్లవాత్మక పరిష్కారం.

16. నిఖత్ జరీన్.. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్-2025లో పోటీ

భారత స్టార్ బాక్సర్, నిజామాబాద్ వాసి నిఖత్ జరీన్.. హరియాణాలోని గ్రేటర్ నోయిడాలో మొదలైన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్-2025లో పోటీ పడుతున్నారు. నవంబర్ 14 నుంచి 21 వరకు జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆమె 51 కిలోల విభాగంలో బరిలోకి దిగారు. ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన జరీన్.. ఈసారి ప్రత్యర్థులను పంచ్‌లతో మట్టి కరిపించి, ఫామ్‌లోకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

17. నవంబర్‌ 15న చివరిసారిగా బ్యాటింగ్‌ చేశా-సచిన్‌ టెండూల్కర్‌

టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ టీమిండియా తరఫున తొలి మ్యాచ్‌ నవంబర్‌ 15, 1989లో ఆడాడు. ఆఖరుసారిగా కూడా ఇదేరోజు నవంబర్‌ 15, 2013న వాంఖడే స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌ ఆడాడు. సచిన్‌ చివరిసారిగా బ్యాటింగ్‌ మాత్రం నవంబర్‌ 15న చేశాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది.

18. క్రీడా ప్రపంచంలో మరో అద్భుత విజయం..

భారత క్రీడా ప్రపంచంలో మరో అద్భుత విజయం నమోదైంది. ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో తెలుగు తేజం, భారత యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర ఒక చారిత్రక గోల్డ్ మెడల్‌ను గెలుచుకున్నారు. బంగ్లాదేశ్‌, ఢాకాలో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్స్‌లో… పురుషుల వ్యక్తిగ‌త విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మొదటి భారతీయ పురుషుల ఆర్చర్‌గా ధీరజ్ చరిత్ర సృష్టించారు.

19. మహేష్‌బాబు, రాజమౌళి కాంబోలో భారీ యాక్షన్

మహేష్‌బాబు, రాజమౌళి కాంబోలో భారీ యాక్షన్ అడ్వెంచర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ‌లో ఈ మూవీకి సంబంధించిన కార్యక్రమం ప్లాన్ చేశారు. ఇందులో మహేష్‌బాబు క్యారెక్టర్ రివీల్ చేస్తారని టాక్.

20. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి ఆనందం-రానా దగ్గుబాటి

‘కాంత’ సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి ఆనందంగా ఉందని రానా దగ్గుబాటి తెలిపారు. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే అత్యద్భుతమైన నటన కనబరిచారని ప్రశంసించారు. దుల్కర్, భాగ్యశ్రీ బోర్సే నటించిన ఈ చిత్రంలో రానా, సముద్రఖని కీలకపాత్రలు పోషించారు. చాలా గ్యాప్ తర్వాత తన పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయని రానా చెప్పారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×