విశ్వప్రేమకు ప్రతిరూపంగా భగవాన్ శ్రీసత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన శ్రీసత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు రాష్ట్రపతి ముర్ము. సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, సాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని కొనియాడారు.
హైదరాబాద్‌లో స్కూటీ శవ యాత్ర చేపట్టారు బీజేపీ నాయకులు, కార్యకర్తలు. GHMC ప్రధాన కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో బీజేపీ సెంట్రల్ అధ్యక్షుడు లంకల దీపక్, రాణి రుద్రమ పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ర్యాలీ చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మహిళలకు ఇస్తానన్న 2వేల 500లు, స్కూటీలు, తులం బంగారం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వెంటనే అర్హులందరికీ స్కూటీలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.
మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్లాంట్‌ను ఓఎంసీ చైర్మన్ అంజద్ హుస్సేన్ నేతృత్వంలోని మిషన్ భగీరథ ENC కృపాకర్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో వాటర్ టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, సంగారెడ్డి చీఫ్ ఇంజనీర్ CGM బ్రిజేష్‌లతో కూడిన బృందం పరిశీలించింది. ప్రాజెక్టును ఖాళీ చేసి మరమ్మతులు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం, మూడు జిల్లాల తాగునీటి అవసరాలపై బృందం సభ్యులు అధ్యయనం చేశారు. ఆరు టీఎంసీల నీటిని వదిలి 10 టీఎంసీలతో రిపేర్లు చేపట్టాలని నీటిపారుదల శాఖ యోచిస్తుండగా, దీనిపై వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చట్టపరమైన రిజర్వేషన్లను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. సర్పంచ్ ఎన్నికలలో చట్టబద్ధమైన రిజర్వేషన్లు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన వెళ్తోందని ఆయన మండిపడ్డారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సంఘాలతో చర్చించి, సీఎం నేతృత్వంలో ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ కావాలని డిమాండ్ చేశారు.
ఉప ఎన్నిక వస్తే కడియం శ్రీహరి పారిపోడని.. కచ్చితంగా తానే పోటీచేస్తానంటున్నారు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. స్పీకర్ ను కలిసి కొంత సమయం కావాలని అడిగినట్టు చెప్పారు. స్పీకర్ నోటీసులపై త్వరలోనే సమాధానం ఇస్తానన్నారు. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని..వివరణ ఇవ్వాలని ఇన్ని రోజులు ఆగినట్టు కడియం తెలిపారు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల శివారులో నేషనల్ హైవే 163పై రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఇండస్ట్రియల్ పార్క్ నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. లారీ బ్రేకులు సరిగ్గా పనిచేయకపోవడమే ప్రమాదానికి కారణమని డ్రైవర్ తెలిపాడు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ క్షేమంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం పోలీసులు లారీని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో, బీఆర్‌ఎస్ నాయకుడు సాగర్ రెడ్డి వడ్లు దిగుమతికి మిల్లు నిరాకరించింది. ‘రాజకీయ ఒత్తిడి’ అంటూ మిల్లు చెప్పడంతో, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కలెక్టర్‌కు, సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు.
అల్పపీడనం ప్రభావంతో కడపలో రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కో-ఆపరేటివ్ కాలనీలో భారీ చెట్టు కూలి, ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. విద్యుత్ సరఫరా నిలిపివేసి, మున్సిపల్ సిబ్బంది చెట్టును తొలగించారు.
అమరావతిలో రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై త్రి-మెన్ కమిటీ సీఆర్డీఏ కార్యాలయంలో సమావేశమైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ హాజరై, ప్లాట్ల కేటాయింపు సహా రైతు సమస్యలపై చర్చించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీకృత కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. మహిళల కోసం బస్సు సౌకర్యాలపై 8 వేల కోట్లు, సన్నబియ్యంపై 12 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఆయన తెలిపారు.
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాకలికొండలో చైన్ స్నాచింగ్ జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
జనగామ జిల్లా పాలకుర్తిలో ఇరిగేషన్ అధికారి ఏసీబీకి చిక్కారు.10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇరిగేషన్ డీఈ సంధ్యారాణి మిషన్ భగీరథ కాంట్రాక్టర్ వద్ద 10 వేలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
తూర్పుగోదావరి జిల్లా రాజోలులో ఈ నెల 26న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. శివకోడులో హెలీప్యాడ్ కోసం స్థల పరిశీలన చేశారు అధికారులు. శివకోటిలో కాపుల కల్యాణ మండపం వద్ద రాష్ట్రస్థాయి పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు.
గ్రేటర్ విశాఖ పరిధిలోని రోడ్లను ప్రైవేటీకరణ చేయడానికి కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నారు. జీవీఎంసీ పరిధిలోని 88 కిలోమీటర్ల ప్రధాన రోడ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి కౌన్సిల్ తీర్మానించింది. పీపీపీ మోడల్‌లో రోడ్లను ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి అధికారులు చూస్తున్నారు. రోడ్లను ప్రైవేటీకరణ చేయడం వల్ల జీవీఎంసీ ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గుతాయని అధికారులు అంటున్నారు.
మహారాష్ట్రలోని ఠాణే జిల్లా అంబర్‌నాథ్ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. శివసేన పార్టీ స్థానిక ఎన్నికల అభ్యర్థి కిరణ్ చాబే ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా.. కారు డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో నియంత్రణ కోల్పోయిన కారు వేగంగా ఎదురుగా వస్తున్న బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక బైకర్ గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ కింద పడ్డాడు.
మార్టిగేజ్ పేరుతో తమ భూములను కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా అంతారం గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమ భూములను తిరిగి తమ పేరున రిజిస్ట్రేషన్ చేయాలని లేదంటే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు నిందితులను అరెస్టు చేసి, తమ భూములను తిరిగి ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
బిహార్‌లో సీఎం నీతీశ్ కుమార్ సారథ్యంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపు చేపట్టారు. మంత్రిత్వశాఖల కేటాయింపుల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 20 ఏళ్ల పాటు తన వద్ద ఉన్న కీలకమైన హోంశాఖను సీఎం నీతీశ్ వదులుకున్నారు. అత్యంత కీలకమైన ఈ శాఖను డిప్యూటీ సీఎం నీతీశ్ సామ్రాట్ చౌధరికి కేటాయించారు.
శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది తలెత్తి.. ఆస్పత్రిలో చేరిన క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ డిశ్చార్జి అయ్యారు. శ్వాస, ఊపిరితిత్తుల సమస్యలతో పోప్ ఫ్రాన్సిస్ రోమ్‌లోని జెమెల్లీ ఆస్పత్రిలో చేరగా నయమవడంతో వైద్యులు డిశ్చార్జి చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన చెప్పారు.
ప్రస్తుతం పలు మూవీలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అందులో కొన్ని తెలుగు మూవీలు కాగా.. మరికొన్ని వేరే భాషలవి. అయితే 24 గంటల్లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ టికెట్లు 41.87Kపైగా అమ్ముడయ్యాయి. ఇండియా అంతటా నిన్న రిలీజైన సినిమాల్లో ఈ ఘనత సాధించిన మూవీగా ఇది రికార్డు సృష్టించింది.
కోల్‌కతా టెస్ట్‌లో బ్యాటింగ్ చేస్తూ శుభ్‌మన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గువాహటి వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్‌కూ అతడు దూరమయ్యాడు. దీంతో రిషభ్‌పంత్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. టెస్టుల్లో టీమ్‌ఇండియాకు సారథిగా వ్యవహరించడం పంత్‌కు ఇదే తొలిసారి. ఈ విషయంలో ఆసీస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్.. రిషభ్‌పంత్‌కు మద్దతుగా నిలిచాడు. సిరీస్ మధ్యలో కెప్టెన్‌గా వ్యవహరించడం అంత సులువు కాదన్నాడు.