తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 12 వేల 760 పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 4 వేల 200 సర్పంచ్ స్థానాలకు 37 వేల 440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలకు డిసెంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
కడప జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. తన సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే ఉన్నారు. ఇవాళ పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్‌లో జరిగే వివాహానికి వైఎస్ జగన్ హాజరవుతారు. అక్కడి నుంచి బ్రహ్మణపల్లి చేరుకుని.. అరటి తోటలను పరిశీలించి అక్కడే రైతులతో మాట్లాడతారు.
అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ దిశగా ఫారిన్ ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పించేలా రాష్ట్ర బ్రాండింగ్ ఉండాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే నెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న సమ్మిట్ బ్రాండింగ్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈనెల 29 నుంచి డిసెంబర్ ఒకటి వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కొనసాగుతున్న వాయుగుండంతో పాటు.. కొమెరిన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో.. రెండు అల్పపీడనాలు కలిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పటిష్టంగా ఉందనడానికి కోకాపేట నియోపోలీస్ భూముల వేలమే నిదర్శనంగా నిలుస్తోంది. రికార్డు స్థాయిలో రేట్లు పలకడంతో…అందరి దృష్టి కోకాపేటపై పడింది. అయితే విశాలమైన రోడ్లు, పక్కనే ఔటర్ రింగురోడ్డు, 20 నిమిషాల్లోనే ఎయిర్‌పోర్టుకు చేరుకునే సౌకర్యం ఉండటంతో…కోకాపేట భూముల ధరలు ఆకాశాన్ని తాకయని చెప్పొచ్చు.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ కొనుగోలుకు త్వరలో టెండర్లు పిలవాలని మంత్రులు నిర్ణయించారు. కొత్త పరిశ్రమలు సొంతంగా విద్యుత్ తయారీ చేసుకునేందుకు అనుమతి, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించారు. పాల్వంచ, మక్తల్‌లోనూ ప్లాంట్ల నిర్మాణ అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు మంత్రులు.
నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ సోదరుల పోలీస్ కస్టడీకి విజయవాడ ఎక్సైజ్ కోర్టు అనుమతి ఇచ్చింది. జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాములను 4 రోజుల పాటు విచారించనున్నారు. కేసులో మరింత లోతైన దర్యాప్తు కోసం వారిని విచారించాల్సి ఉందని ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది.
గ్రేటర్ హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించాలని నిర్ణయించింది. ఓఆర్ఆర్ లోపల, బయట, అలాగే దానికి ఆనుకుని ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డెసిషన్ తీసుకుంది. అలాగే రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
మ్యాట్రిమోనీ వేదికగా మహిళలను మోసం చేస్తున్న ఓ నిత్య పెళ్లికొడుకును అరెస్ట్ చేశారు భువనగిరి పోలీసులు. కడపకు చెందిన సురేంద్ర అనే నిందితుడు పలువురు మహిళలను పెళ్లి చేసుకొని మోసం చేసినట్లుగా ఫిర్యాదు వచ్చింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.
గ్రామ సచివాలయాల పని తీరు, ఆ వ్యవస్థ నిర్మాణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. గ్రామ స్థాయిలో వివిధ శాఖల నిర్మాణం, సచివాలయం ఉద్యోగులను ఆయా శాఖలకు ఎలా అనుసంధానించాలి అనే అంశంపైనా కూలంకషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రుల బృందంతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు.
తాగునీటిని వృథా చేసిన వ్యక్తికి హైదరాబాద్ జలమండలి అధికారులు షాకిచ్చారు. తాగునీటితో కారు కడిగినందుకు జరిమానా విధించారు. ఈ ఘటన బంజారాహిల్స్‌లో జరిగింది. తాగునీరు లేక జనం అల్లాడుతుంటే..ఇలా ఇతర అవసరాలకు వినియోగిస్తారా అంటూ మండిపడ్డారు.
పైరసీ కింగ్‌పిన్ ఇమంది రవిని మరోసారి కస్టడీకి తీసుకోవడానికి సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రవి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరోసారి కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం నాంపల్లి కోర్టులో ఏడు రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ కస్టడీపై కోర్టు ఇవాళ తీర్పును వెలువరించనుంది.
శ్రీకాకుళం జిల్లా ఉద్యానంలో ఎలుగుబంట్లు హల్‌చల్ చేస్తున్నాయి. నల్లబడ్లూరు గ్రామంలో పట్టపగలు మూడు ఎలుగుబంట్లు నానా హంగామా సృష్టించాయి. గ్రామాల్లోకి వస్తున్న భల్లోకాలతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎవరిపై దాడి చేస్తాయో.. ఎలాంటి విధ్వంసానికి పాల్పడతాయో అని జనం బిక్కుబిక్కుమంటున్నారు.
నమో భారత్ రైళ్లలో ఇకపై పుట్టినరోజు వేడుకలు, ప్రీ-వెడ్డింగ్ షూట్‌లు జరుపుకునేందుకు అవకాశం కల్పించింది. ఢిల్లీ-మీరట్ కారిడార్‌లో సేవలందిస్తున్న నమో భారత్ కోచ్‌లను ప్రైవేట్ వేడుకలకు ఎన్‌సీఆర్‌టీసీ అందుబాటులోకి తెచ్చింది. మాకప్ కోచ్ గంటకు 5వేలు ప్రారంభ ధరతో బుక్ చేసుకోవచ్చు. ఈ వినూత్న సేవ ప్రయాణికులను ఆకర్షించే అవకాశం ఉంది.
రెడ్‌ఫోర్ట్ బ్లాస్ట్ కేసులో దర్యాప్తు జరుగుతున్న కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమర్ ఎక్కడికి వెళ్లిన ఓ సీక్రెట్ కేసును తీసుకెళ్లాడని. అందులోనే బాంబు తయారీకి కావాల్సిన అన్ని కెమికల్స్, వస్తువులను తీసుకెళ్లే వాడని తెలిపారు. ఇప్పుడీ విషయం అధికారులను కాస్త షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి.
సమ్మతంతో జరిగిన సంబంధం విఫలమైనంత మాత్రాన రేప్ కేసు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. న్యాయవాదిపై నమోదైన కేసును కొట్టివేసింది. బలమైన ఆధారాలు లేకుండా ప్రతి విఫల సంబంధాన్ని రేప్‌గా మార్చడం చట్టాల దుర్వినియోగమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తమ దేశంలో పర్యటించాలంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పంపిన ఆహ్వానాన్ని అంగీకరించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బదులుగా ఆ తర్వాత అమెరికాలో పర్యటించాలని జిన్‌పింగ్‌ను కోరినట్లు తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్’లో తెలిపారు. గతనెలలో దక్షిణ కొరియాలో జరిగిన భేటీ తర్వాత తొలిసారిగా ట్రంప్, జిన్‌పింగ్ ఫోనులో మాట్లాడుకున్నారు.
గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించారు. నిన్న ఉదయం సెషన్‌లో రెండు వికెట్లు పడగొట్టిన జడేజా..సౌతాఫ్రికాపై 50 వికెట్లు తీసుకున్న ఐదో భారత బౌలర్‌గా నిలిచారు. దీంతో భారత మాజీ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, అశ్విన్ వంటి బౌలర్ల సరసన రవీంద్ర జడేజా చేరారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న మెగా టోర్నమెంట్, 2026 ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభమై మార్చి 8న జరిగే ఫైనల్‌తో ముగియనుంది.
ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో రామ్ పోతినేని.. తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్‌పై స్పందించారు. ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ పుకార్లపై రామ్ స్పందిస్తూ.. సినిమాలో తాను రాసిన ప్రేమ గీతం వల్లే ఈ పుకార్లు వచ్చాయన్నారు. ఆ సమయంలో హీరోయిన్‌ను కూడా ఫైనల్ చేయలేదని స్పష్టం చేశారు.