ప్రతి ఇంట్లోనూ వేరుశనగ పలుకులు అవసరం పడుతుంది. పులిహోర నుంచి చట్నీల వరకు వేరుశనగ పలుకులు ఉండాల్సిందే. వాటిని కొనేవారికి దాని ధర ఎంతో తెలుస్తుంది. కేజీ పల్లీల ధర 180 నుంచి 250 రూపాయలకు తగ్గకుండా ఉంటుంది. అదే పల్లీ నూనె కొని చూడండి… లీటరు 150 రూపాయలకు కూడా వచ్చేస్తుంది. కేజీ పల్లీలను ఆడిస్తే లీటరు నూనె రాదు. కానీ పలుకుల కన్నా నూనె ఖరీదే చాలా తక్కువ. కేజీ వేరుశెనగ పలుకుల కన్నా… ఒక కేజీ శెనగ నూనె ఎందుకు అంత చవకగా వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా?
కేజీ పల్లీలతో ఎంత నూనె?
ఒక కేజీ పల్లీలతో కేవలం 400 గ్రాముల పల్లి నూనెను మాత్రమే తయారు చేయగలం. కానీ కిలో నూనె 150 రూపాయలకే మార్కెట్లో లభిస్తోంది. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు చర్చించుకోవాలి. పరిశ్రమలు కనీసం 30 నుంచి 40 శాతం లాభాన్ని ఆశించాకే ఉత్పత్తులను తయారుచేస్తుంది. అప్పుడే వారి వ్యాపారం నిలబడుతుంది. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఖర్చులు, ప్యాకేజింగ్ ఖర్చులు, మార్కెటింగ్ ఖర్చులు, లేబర్ ఖర్చులు, విద్యుత్ ఖర్చులు, యంత్రాల ఖర్చులు ఇవన్నీ కూడా వారికి రావాలి. అలాగే లాభం కూడా మిగలాలి. కాబట్టి వారు తక్కువ ధరకు అమ్మే అవకాశం లేదు. అయినా కూడా తక్కువకి అమ్ముతున్నారంటే కొన్ని ఆర్థిక సూత్రాలను, వాస్తవాలను అర్థం చేసుకోవాలి.
ఎక్కువ మొత్తంలో తక్కువకు కొని
ఒక వేరుశెనగ పలుకులో 40 నుంచి 50శాతం వరకు మాత్రమే నూనె ఉంటుంది. అంటే మీరు ఒక కిలో పల్లీలను ఆడిస్తే 400 గ్రాముల నుండి 500 గ్రాముల నూనె వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు రైతుల నుండి చాలా పెద్ద మొత్తంలో పల్లీలను కొనుగోలు చేస్తారు. బయట మార్కెట్లో మనం కొంటే కిలో 180 రూపాయలకు పల్లీలు వస్తాయి. కానీ వ్యాపారులకు మాత్రం కిలో 80 రూపాయలు నుంచి 140 రూపాయలు లోపే కిలో పల్లీలు ఇస్తారు. రైతులు నుంచి పెద్ద మొత్తంలో పల్లీలను తీసుకుంటారు. కాబట్టి పల్లీల ధర తక్కువకే వస్తుంది. ఇక ఆయిల్ మిల్లులో నూనెలను తయారు చేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా అమ్ముతారు. కాబట్టి వారికి వచ్చే లాభాన్ని నూనె అమ్మడం ద్వారా, అలాగే పిండి అమ్మడం ద్వారా ఎంత వస్తుందో చూసుకుంటారు.
ఈ నూనెలు కూడా కలిపి
కొన్నిసార్లు పల్లీ నూనెలో పామాయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి తక్కువ ధర పలికే నూనెలను కలుపుతారు. అయితే రిఫైన్డ్ కెమికల్ ప్రాసెసింగ్ చేయడం వల్ల పల్లీల నుంచి నూనె అధికంగా వస్తుంది. అందుకే రిఫైండ్ నూనెనే అధికంగా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు.
నిజమైన స్వచ్ఛమైన పల్లీ నూనె అయితే 150 రూపాయలకి లీటర్ అమ్మడం సాధ్యం కాదు. రెండు కిలోల పల్లీల నుంచే ఒక లీటరు పల్లీ నూనె వస్తుంది. కాబట్టి ఏ వ్యాపారస్తుడికి ఇది లాభదాయకం కాదు. దానిలో ఇతర నూనెలు కలపడం వంటి పద్ధతుల ద్వారా తక్కువ ధరకు అమ్మేందుకు ప్రయత్నిస్తారు. అందుకే కోల్డ్ ప్రెస్డ్ నూనె కొనుక్కోవాలి. ఇది లీటరు 400 రూపాయల నుంచి 500 రూపాయల ఖరీదు ఉంటుంది. మీరు పల్లీలను తీసుకొని వెళ్లి కోల్డ్ ప్రెస్ట్ నూనె మిల్లుకు ఇస్తే… వారు మీ ముందే స్వచ్ఛమైన పల్లీ నూనెను తయారు చేసి ఇస్తారు.
కాబట్టి బయట దొరికే పల్లీ నూనె స్వచ్ఛమైనదని భావించకండి. అది దాదాపు ఇతర నూనెలు కలిసినదే. స్వచ్ఛమైనదైతే కనీసం 400 రూపాయలు నుండి 500 రూపాయలు వరకు పరిశ్రమలు అమ్మాల్సి వస్తుంది.