క్యాన్సర్ కేసులు మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కువైపోతున్నాయి. క్యాన్సర్ రావడానికి కారణం జన్యుపరమైనవే కాదు… చెడు ఆహారపు అలవాట్లు అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మనం తినే ఆహారాన్ని, అలాగే ఆహారం తయారయ్యే పద్ధతిని కూడా గమనించాల్సిన అవసరం ఉంది.
ఆహారం అధిక ప్రాసెస్ కు గురైతే దానివల్ల జరిగే నష్టమే ఎక్కువ. ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఇంట్లోనూ రోటీలు, చపాతీలు తింటూనే ఉంటారు. అవి ఆరోగ్యానికి మంచిదే, కానీ వాటిని తయారు చేసే పద్ధతిపైనే అవి ఆరోగ్యకరమైనవా? కాదా? అనేది ఆధారపడి ఉంటుంది.
రోటీలు చపాతీలు కాల్చకూడదా?
మీరు చపాతీలు, రోటీలు ఎలా కాలుస్తారో ఒకసారి గమనించండి. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో కాలిస్తే మాత్రం వెంటనే మానేయండి. ఎందుకంటే రోటీలు, చపాతీలను ఇలా కాల్చడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు అధికమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి రోటీలను తినడం వల్ల శరీరం నెమ్మదిగా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది.
చాలామంది రోటీని లేదా చపాతీని తయారు చేసేందుకు ముందుగా స్టవ్ మీద పెనం పెడతారు. ఆ పెనం మీద సగం రోటీనీ లేదా చపాతీని కాలుస్తారు. తర్వాత తీసి నేరుగా గ్యాస్ మంటపైన పెట్టి రెండు వైపులా కాలుస్తారు. ఇలా రోటీని నేరుగా మంటపైన కాల్చడం అనారోగ్యకరమైన పద్ధతి. ఇలా తరచూ రొటీలను తయారు చేసుకుని తినేవారికి భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు పెరిగిపోతాయి.
ఈ క్యాన్సర్ రసాయనాలు
ఒక పరిశోధన ప్రకారం ఇలా నేరుగా రోటీని మంటపైనే కాల్చినప్పుడు హెటెరోసైక్లిక్ అమైన్లు, పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు, అలాగే ఇతర హానికరమైన రసాయనాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. తరచూ ఇలా నేరుగా మంటపైన కాల్చిన రోటీలను తింటున్న వారిలో ఈ రసాయనాలు పేరుకుపోతాయి. దీనివల్ల భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు పెరిగిపోతాయి.
చపాతీ కావచ్చు, రోటీ కావచ్చు.. ఎప్పుడూ కూడా నేరుగా మంట మీద కాల్చకూడదు. కేవలం పెనం మీద మాత్రమే రెండు వైపులా కాల్చి తినాలి. నేరుగా మంట మీద కాల్చడం వల్ల నూనె అవసరం ఉండదని ఎంతోమంది భావిస్తారు. అది నిజమే కావచ్చు. కానీ నేరుగా మంట మీద కాల్చడం వల్ల ఆరోగ్య ప్రమాదం ఎక్కువ.
చిటికెడు నూనెతో చపాతీలు కాల్చుకోవడం వల్ల జరిగే ప్రమాదం కన్నా ఇలా నేరుగా మంట మీద కాల్చడం వల్లే ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి. నిజానికి చిటికెడు నూనెతో చపాతీలు కాల్చుకొని తినడం వల్ల వచ్చిన ప్రమాదం ఏమీ లేదు.. రోజులో తీసుకునే నూనె మొత్తాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. కానీ ఇలా మంట మీదే కాలిస్తే మాత్రం ఆరోగ్యంలో ఎన్నో రసాయనాలు పేరుకుపోయే అవకాశాలు ఉంటాయి.