Robbery in Train: రైలు ప్రయాణికుల భద్రతపై.. మరోసారి ప్రశ్నలు తలెత్తే ఘటన చోటు చేసుకుంది. చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో దొంగలు తెగబడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని.. కోమలి గ్రామం వద్ద ఈ దారుణం జరిగింది. తెల్లవారుజామున రైలు సిగ్నల్ కేబుల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించారు. దీంతో చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్ రైలు అక్కడే ఆగిపోయింది.
ఈ సమయంలో ప్రయాణికులు అయోమయానికి గురవ్వగా, దాన్ని అవకాశంగా మలుచుకున్న దుండగులు.. S1, S2 బోగీల్లోకి ఎక్కి దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణికుల వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, వస్తువులను దోచుకుపోయారు.
ప్రయాణికులు అరుస్తున్నా.. ఎవరూ సాయం చేయలేకపోయారు. ఈ దొంగతనంలో గుత్తికి చెందిన ఓ మహిళ మెడలో ఉన్న.. సుమారు 27 గ్రాముల బంగారు గొలుసును దుండగులు అపహరించారు.
ఈ సంఘటనతో బోగీల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రయాణికులు వెంటనే సమీప రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. సంఘటన జరిగిన ప్రాంతం చుట్టూ పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. అయితే దుండగులు ముందే ప్రణాళిక చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రైల్వే పోలీసులు, లోకల్ పోలీసులు కలిసి ప్రత్యేక దర్యాప్తు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలు. టెక్నికల్ డేటా ఆధారంగా గాలింపు చేపట్టారు.
కాగా ఇటీవల పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని కావలి-శ్రీ వెంకటేశ్వర పాలెం రైల్వే స్టేషన్ల మధ్య.. పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు మూడు బోగీలలో చోరీకి పాల్పడ్డారు. ముగ్గురు మహిళల వద్ద 40 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 2,000 నగదు, ఒక సెల్‌ఫోన్ దొంగిలించబడ్డాయి. ఈ ఘటన సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రైలులో జరిగింది.
ఈ ఘటనపై రైల్వే భద్రతా విభాగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు రోజూ ప్రయాణించే రైళ్లలో కూడా భద్రత గ్యారంటీ లేదని.. ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ భద్రతను బలోపేతం చేయాలని.. ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై రాత్రివేళల్లో పోలీసు బందోబస్తు పెంచాలని కోరుతున్నారు.
Also Read: ఏఐ సీసీ కెమెరాలు, వాయిస్ మానిటరింగ్.. లోకల్ రైళ్లలో భద్రత మరింత పెంపు!
ప్రయాణీకులకు సూచనలు:
విలువైన వస్తువులు: బంగారు ఆభరణాలు లేదా గాడ్జెట్‌లను సురక్షితంగా బ్యాగులో లాక్ చేసి ఉంచండి. రాత్రిపూట వీటిని ధరించడం మానుకోండి.
అప్రమత్తత: రాత్రి సమయంలో ఒంటరిగా బోగీలో ఉండకండి. సహ ప్రయాణీకులు ఉన్న కంపార్ట్‌మెంట్‌లో ఉండటం సురక్షితం.
సహాయం: అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే, వెంటన RPF హెల్ప్‌లైన్ (139) లేదా GRPకి సమాచారం ఇవ్వండి.
బ్యాగేజ్ జాగ్రత్త: లగేజీని చైన్‌తో బిగించి, రాత్రిపూట కళ్లెదురుగా ఉంచండి.