Chemicals in Mangoes: వేసవికాలం వచ్చిందంటే చాలు మార్కెట్‌లో ఎక్కడ చూసినా మామిడి పండ్లే దర్శనం ఇస్తాయి. తాజాగా ఉండే ఈ పండ్లను చూడగానే నోరూరిపోతుంది. అయితే చక్కగా పండినట్లు కనిపించే ఈ పండ్లు సహజంగానే పండినవి అనుకుంటే పప్పులో కాలేసినట్టే అని నిపుణులు చెబుతున్నారు. కాయలు త్వరగా మక్కడానికి చాలా మంది వ్యాపారులు కెమికల్స్ సహాయంతో వీటిని పండుగా మార్చేస్తారని అంటున్నారు. కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలను కలిపి పండ్లుగా మార్చేస్తారు. వీటి వల్ల సహజంగా పండిన వాటిని గుర్తుపట్టడం కష్టతరంగా మారుతుంది. ఈ కెమికల్స్ కలిపిన మామిడి కాయలను తింటే ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
కాల్షియం కార్బైడ్ వల్ల ఏం జరుగుతుంది..?
కాల్షియం కార్బైడ్ కార్బైడ్‌లో ఉండే ఆర్సెనిక్,ఫాస్పరస్ వంటి హానికరమైన కెమికల్స్ పండ్ల ద్వారా శరీరంలోకి వెళ్తే ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చాలా మందిలో గ్యాస్ట్రిక్ సమస్యలు, లివర్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందట.
ఈ రసాయనాలతో పండిన పండ్లు తినడం వల్ల తక్కువ పోషణ అందుతుందట. కొన్ని సార్లు కాల్షియం కార్బైడ్ వల్ల జలుబు చేసే ఛాన్స్ ఉందట. ఈ కెమికల్స్ వల్ల కొందరికి తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
కెమికల్ ఉన్న పండ్లు ఎలా ఉంటాయి?
కాల్షియం కార్బైడ్‌తో పండిన మామిడి పండ్ల తోక్క మెరిస్తూ, నిగనిగలాడుతూ ఉంటుందట. కొన్ని పండ్లను చూస్తే కొంత భాగం వరకు పుసుపు రంగులో.. మరికొంత భాగం ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాల్షియం కార్బైడ్ కారణంగానే పండ్లు ఆ రకంగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమంగా పండిన మామిడి పండ్లలో కెమికల్స్ వాసన వస్తుందట. రసాయన లేదా బలమైన పారిశ్రామిక వాసనను వాసన చూస్తే, అది కాల్షియం కార్బైడ్ వాడి పండించినది కావొచ్చని అంటున్నారు.
పండ్లను సున్నితంగా నొక్కినప్పుడు, కార్బైడ్‌తో పండిన మామిడి పండ్లు అసహజంగా మృదువుగా లేదా మెత్తగా అనిపిస్తాయట. సహజంగా పండిన మామిడి పండ్లలా కాకుండా కొంచం ఎక్కువ మెత్తగా ఉంటాయట. కెమికల్స్ సహాయంతో వాడిన పండ్ల గుజ్జు కొద్దిగా చేదుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పండ్లు వగరు రుచిని కలిగి ఉండవచ్చు.
కెమికల్ ఉన్న పండును గుర్తించాలంటే..?
కాల్షియం కార్బైడ్ సహాయంతో పండించిన పండ్లను గుర్తించాలంటే ఒక సింపుల్ చిట్కా ఉందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని గుర్తించాలంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో మామిడి పండును ఉంచాలి. కాల్షియం కార్బైడ్‌ని ఉపయోగించి మామిడిని కృత్రిమంగా పండించినట్లయితే నీరు పసుపు రంగులోకి మారుతుందట. లేదా కొద్దిగా కెమికల్ రంగు ఉండవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.