రివ్యూ : టెస్ట్
తారాగణం : ఆర్ మాధవన్, నయనతార, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ తదితరులు.
దర్శకుడు : ఎస్ శశికాంత్
నిర్మాతలు : చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్
ఓటీటీ : నెట్‌ఫ్లిక్స్
Test Movie Review : నయనతార, మాధవన్, సిద్ధార్థ్ వంటి స్టార్స్ కలిసి నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’. ఈ మూవీ ఈరోజు నుంచే డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘ఫర్జీ’, ‘గన్స్ అండ్ రోజెస్’, ‘ఫ్యామిలీ మ్యాన్’ చిత్రాలకు రచయితగా పని చేసిన సుమన్ కుమార్ ఈ మూవీకి స్టోరీ అందించారు. ఈ మూవీతో నిర్మాత నుంచి దర్శకుడిగా టర్న్ తీసుకున్నారు ఎస్. శశికాంత్. పెద్దగా ప్రమోషన్లు లేకుండానే ఓటీటీలోకి వచ్చేసిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
‘టెస్ట్’ కథ మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. కుముదా శరవణన్ (నయనతార ) ఒక స్కూల్ టీచర్, తల్లి కావాలని కోరుకుంటుంది. కానీ కుముద భర్త శరవణన్ (ఆర్ మాధవన్), భారతదేశంలోనే బెస్ట్ సైంటిస్ట్ కావాలని కోరుకుంటాడు. కానీ అందుకోసం డబ్బు కావలసి ఉంటుంది. అలాగే ఫ్యామిలీ బాధ్యతలతో నలిగిపోతాడు. కుముద స్కూల్‌మేట్ అర్జున్ (సిద్ధార్థ్), భారతదేశం తరపున క్రికెట్ ఆడతాడు. క్రికెట్ అంటే అతనికి ప్రాణం. కానీ అతను ఫామ్ లో లేకపోవడంతో క్రికెట్ కమిటీ అతన్ని జట్టు నుండి తొలగించాలని భావిస్తుంది. ఇలాంటి వీళ్ళ లైఫ్ లోకి బెట్టింగ్ సిండికేట్ ఎంట్రీ ఇస్తుంది. వీరి ముగ్గురి భవితవ్యం జరగబోయే మ్యాచ్, బెట్టింగ్ పైనే ఆధారపడి ఉంటుంది. మరోవైపు బెట్టింగ్ వ్యవహారం తెలుసుకున్న అధికారులు బెట్టింగ్ మాఫియా అంతు చూడడానికి సిద్ధం అవుతుంది. మరి ఈ ముగ్గురి లైఫ్ లోకి బెట్టింగ్ మాఫియా ఎలా ఎంట్రీ ఇచ్చింది? వీరికి, క్రికెట్ కు ఉన్న లింక్ ఏంటి? చివరికి ఏం జరుగుతుంది? అన్నది తెరపై చూడాల్సిన కథ.
విశ్లేషణ
ఈ సినిమా మొదలైనప్పుడు టెస్ట్ మ్యాచ్ లాగా నెమ్మదిగా అనిపిస్తుంది. సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. బహుశా దర్శకుడు ఈ సినిమాతో టెస్ట్ మ్యాచ్ అనుభూతిని ఇవ్వాలనుకున్నాడేమో. ఈ సినిమా రచన, దర్శకత్వం రెండూ బలహీనంగా ఉన్నాయి. అందుకే జనాలు సినిమాతో కనెక్ట్ అవ్వడం కష్టం. ట్రైలర్ చూసిన తర్వాత కొందరు దీనిని స్పోర్ట్స్ డ్రామా అని, మరికొందరు థ్రిల్లర్ అని అన్నారు. కానీ సినిమాలో థ్రిల్ లేదు, స్పోర్ట్స్ డ్రామా లేదు. కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేది. మూడు పాత్రలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న తీరు నమ్మడం కష్టం. సినిమా రన్‌టైమ్ మరో సమస్య. 2 గంటల 25 నిమిషాలు ఉన్న ఈ సినిమా సహనాన్ని పరీక్షిస్తుంది.
ఆర్ మాధవన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఆయన నిస్సహాయ శాస్త్రవేత్త నుండి విలన్ వరకు చాలా బాగా నటించాడు. నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సిద్ధార్థ్ సినిమా మొత్తం ఒకే ఎక్స్ప్రెషన్ తో కన్పించడం బోర్ కొడుతుంది. సిద్ధార్థ్‌కి క్రికెట్టే సర్వస్వం అని డైలాగ్‌ల ద్వారా చూపించారు. కానీ సిద్ధార్థ్ చేసే పనులు చూస్తే అలా అనిపించదు. జీవితం అర్జున్ (సిద్ధార్థ్)కి కష్టమైన ఆప్షన్స్ ఇస్తుంది. అయితే సిద్ధార్థ సందిగ్ధతను సరిగ్గా చిత్రీకరించలేదు. ఆ ఎఫెక్ట్ క్లైమాక్స్ పై పడింది.
మొత్తంగా..
ఆర్ మాధవన్ నటనకు అభిమాని అయితే ఈ సినిమాను మిస్ కాకుండా ఓసారి చూడాల్సిందే. కానీ స్పోర్ట్స్ డ్రామా లేదా థ్రిల్లర్ సినిమా అనుకుని స్టార్ట్ చేస్తే డిజప్పాయింట్ అవ్వక తప్పదు.
Test Movie Rating : 2/5