 
					Aadhaar Updates: ఆధార్ అప్డేట్ కోసం ఇన్నాళ్లు నానా తిప్పలు పడేవాళ్లం. పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇలా ఏది మార్చుకోవాలన్న ఆధార్ సెంటర్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై ఇలాంటి తలనొప్పి లేకుండా మన ఫోన్ లో ఇంట్లో కూర్చొని ఆధార్ ను అప్డేట్ చేసుకోవచ్చు. నవంబర్ 1, 2025 నుంచి ఆధార్‌ను అప్డేట్ పై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొస్తుంది. ఇకపై మీరు ఎలాంటి క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఆధార్ ను అప్డేట్ చేసుకోవచ్చు. రేపటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ మేరకు ఆధార్ సేవలను వేగంగా, చాలా సులభంగా, సురక్షితంగా మార్చుకోవచ్చు.
గతంలో మీరు పొందిన ఆధార్ కార్డులో ఏమైనా వివరాలు తప్పుగా నమోదు చేసుకుని ఉంటే, ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేయవచ్చు. ఆధార్ కార్డులో మార్పు చేసుకునే వివరాలను నిర్దారించేందుకు పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డ్ వంటి ప్రభుత్వ పత్రాలతో ధ్రువీకరించవచ్చు. అన్ని వివరాలు సరిగ్గా ఉండే అప్డేట్ చాలా వేగంగా పూర్తి అవుతుంది. mAadhaar Portal లో ఆధార్, ఓటీపీతో లాగిన్ అయి మీ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ లో పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ మార్పులకు యూఐడీఏఐ ఇకపై అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ వివరాల అప్డేట్ కు ఫీజును పెంచింది. అలాగే ఆధార్ సెంటర్లలో చేసే అప్డేట్ లకు రుసుము పెంచింది.
పేరు, అడ్రస్, మొబైల్ నంబర్‌ను అప్డేట్ కోసం రూ. 75
వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లేదా ఫొటో అప్డేట్ కు రూ. 125
5 నుంచి 7 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు, 15 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేయనున్నారు.
జూన్ 14, 2026 వరకు ఉచితంగా ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో అప్డేట్ కు రూ. 75 ఖర్చవుతుంది.
ఆధార్ రీప్రింట్ కోసం రూ. 40
ఒకే చిరునామాలో ఉన్న వారికి ఇంటి వద్దే ఆధార్ నమోదుకు మొదటి వ్యక్తికి రూ. 700, ఆ తర్వాత ప్రతి వ్యక్తికి రూ. 350
డిసెంబర్ 31, 2025 నాటికి పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. అలా లింక్ చేసుకోకపోతే జనవరి 1, 2026 నుంచి పాన్ కార్డు పనిచేయదని తెలిపింది. ఎలాంటి ఆర్థిక, ఇతర పన్ను ప్రయోజనాలకు దీనిని ఉపయోగించలేరు. కొత్త పాన్ కార్డ్ తీసుకున్న వారికి లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
Also Read: Mumbai Hostage: 5 రోజుల ప్లానింగ్, 3 గంటల భయం, ఒక్క బుల్లెట్‌కు హతం.. ఇది కిడ్నాపర్ కథ!
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు నో యువర్ కస్టమర్ (KYC) విధానాన్ని కేంద్రం సులభతరం చేస్తుంది. ఆధార్ ఓటీపీ, వీడియో కేవైసీ, ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్ ద్వారా KYC పూర్తి చేయవచ్చు.
ఈ కొత్త నిబంధనలతో ఆధార్ అప్డేట్, కేవైసీ సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.