karachi halwa: మన ఇళ్లలో ఏ చిన్న పండగ అయినా లేదా సడన్‌గా ఫంక్షన్ అయినా.. ఏదైనా స్వీట్ తినాలనిపించినా వెంటనే గుర్తొచ్చే వాటిలో కరాచీ హల్వా ఒకటి. ఈ మధ్యకాలంలో సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో తక్కువ టైమ్‌లో చేసే ట్రెండీ స్వీట్ రెసిపీలకు ఆదరణ పెరుగుతోంది. అందులో కరాచీ హల్వా ఒకటి. చూడటానికి కలర్‌ఫుల్‌గా, గ్లాసీగా మెరుస్తూ, తినడానికి సాఫ్ట్‌గా ఉండే ఈ స్వీట్‌ను ఒక్కసారి కరెక్ట్ కొలతల్లో చేస్తే మీ ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు.
కార్న్‌ఫ్లోర్ : 1 కప్పు
చక్కెర: 2 కప్పులు
నీళ్లు: 4 కప్పులు
నెయ్యి: ముప్పావు కప్పు
డ్రై ఫ్రూట్స్: జీడిపప్పు, బాదం, పుచ్చగింజలు
ఇలాచీ పొడి: అర టీస్పూన్
ఫుడ్ కలర్ లేదా కుంకుమపువ్వు: చిటికెడు
1.ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో 1 కప్పు కార్న్‌ఫ్లోర్ వేసి, అందులో 1.5 కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. మిగిలిన నీళ్లను వేరే పాత్రలో సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మందపాటి కడాయి లేదా నాన్-స్టిక్ పాన్‌లో 2 కప్పుల చక్కెర, కొద్దిగా నీళ్లు పోసి చక్కెర కరిగేదాకా వేడి చేయాలి. చక్కెర కరిగి సిరప్‌లా మారాక, ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని లో ఫ్లేమ్‌లో పోస్తూ గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి.
2. కొద్దిసేపటికే మిశ్రమం చిక్కబడి, పారదర్శకంగా మారుతుంది. ఈ దశలో నచ్చిన ఫుడ్ కలర్ లేదా కుంకుమపువ్వు వేసి కలపాలి. ఇప్పుడు నెయ్యిని ఒకే సారి కాకుండా, రెండు మూడు టేబుల్ స్పూన్ల చొప్పున విడతల వారీగా వేస్తూ తిప్పాలి. నెయ్యి వేసిన ప్రతిసారీ హల్వా దాన్ని పీల్చుకుని, పాన్ అంచుల నుంచి విడిపోతూ మంచి షైన్ ఇస్తుంది. అవసరమైతే మధ్యలో వేడి నీళ్లు కొద్ది కొద్దిగా చిలకరిస్తూ లో ఫ్లేమ్‌లో ఉడికిస్తే పిండి పచ్చి వాసన పోయి పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది.
Also Read: అదుర్స్ అనిపించే అరటికాయ ఫ్రై..క్షణాల్లోనే రెడీ
3.సుమారు పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికిస్తే.. హల్వా ముద్దలా కాకుండా, పాన్‌లో తిరుగుతూ గ్లాసీగా మారుతుంది. చివరగా వేయించిన జీడిపప్పు, బాదం, పుచ్చగింజలు, ఇలాచీ పొడి వేసి బాగా కలపాలి. నెయ్యి రాసిన ట్రే లేదా ప్లేట్‌లో ఈ హల్వాను వేసి సమానంగా సర్ది, గంట పాటు చల్లారనివ్వాలి.
4. చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్ కరాచీ హల్వా రెడీ అయిపోతుంది. ఈ కొలతలు, టిప్స్‌తో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి!