Kids Healthy Food: చిన్నపిల్లలకు ఆకుకూరలు, కూరగాయలు తినిపించడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలు. వాటి రుచి, రంగు నచ్చక పిల్లలు మారాం చేస్తుంటారు. కానీ, రోజూ చేసే వంటలను కాస్త కొత్తగా, వాళ్లకు నచ్చేలా మారిస్తే ఎంచక్కా తినేస్తారు. బలవంతం చేయకుండా.. పిల్లలతో కమ్మగా కూరగాయలు తినిపించే కొన్ని సులభమైన మార్గాలేవో ఇప్పుడు చూద్దాం.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కోసం శనగపిండి, బొంబాయి రవ్వలో పాలకూర లేదా బీట్‌రూట్ రసం కలిపి దోసెల్లా వేయండి. దీనిపైన సన్నగా తరిగిన టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కాస్త చీజ్ వేసి కాలిస్తే చూడటానికి ఎంతో కలర్‌ఫుల్‌గా ఉంటుంది. చీజ్ రుచికి పిల్లలు వీటిని అస్సలు వదిలిపెట్టరు.
స్నాక్స్ లేదా లంచ్ బాక్స్ కోసం మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకోండి. మయోనైజ్ బదులు నీళ్లు వంపేసిన పెరుగులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలిపి బ్రెడ్‌కు రాయండి. మధ్యలో సన్నగా తరిగిన కీరదోస, క్యారెట్, క్యాప్సికమ్, చీజ్ పెట్టి కాల్చండి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టపడతారు.
Also Read: జిగురు లేకుండా అచ్చం అమ్మమ్మ చేతి వంటలా బెండకాయ పులుసు.. వేడి వేడి అన్నంలోకి అదుర్స్!
బయట దొరికే జంక్ ఫుడ్ బదులు ఇంట్లోనే గోధుమపిండితో మోమోస్ చేయండి. పిండిలో పాలకూర రసం కలిపితే మంచి రంగు వస్తుంది. లోపల క్యాబేజీ, క్యారెట్, బీన్స్, సోయా ముక్కల మిశ్రమం పెట్టి ఆవిరిపై ఉడికించండి. అలాగే, చపాతీలో పెరుగు, జీడిపప్పు పేస్ట్ రాసి, కూరగాయల ముక్కలు పెట్టి రోల్ చేసి ఇస్తే కడుపు నిండుతుంది.
పిల్లలు ముందు కళ్లతో తింటారు. కాబట్టి.. ప్లేట్‌లో కూరగాయలను మామూలుగా కాకుండా క్యారెట్, కీరదోస ముక్కలతో స్మైలీ బొమ్మల్లా అలంకరించండి. కూరగాయలతో ప్లేట్ డెకరేట్ చేయడంలో పిల్లలను కూడా భాగం చేయండి. కొద్దికొద్దిగా అలవాటు చేస్తూ ఓపికగా ప్రయత్నిస్తే.. పిల్లలు కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇష్టపడతారు.
Also Read: వంకాయను ఇలా కాల్చి రోటి పచ్చడి చేస్తే.. రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు!