Lake Placid 3 on OTT: ప్రశాంతంగా కనిపించే ఓ సరస్సులో భయంకరమైన రాక్షస మొసళ్లు ఉన్నాయని తెలిస్తే.. అటువైపు వెళ్లాలంటేనే గుండె దడదడలాడుతుంది కదా. అలాంటిది వాటిని చిన్నప్పటి నుంచి పెంచితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ మొసళ్లే పెరిగి పెద్దవై మనుషుల వేట మొదలుపెడితే ఇంకేమైనా ఉందా? ఇలాంటి భయంకరమైన కథతో వచ్చిన క్రీచర్ హారర్ థ్రిల్లర్ ‘లేక్ ప్లాసిడ్ 3’ (Lake Placid 3) ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. కొలిన్ ఫెర్గూసన్, యాన్సీ బట్లర్, కిర్స్టీ మిచెల్, మైఖేల్ ఐరన్‌సైడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు గ్రిఫ్ ఫర్స్ట్ దర్శకత్వం వహించారు. 93 నిమిషాల పాటు ఉత్కంఠతో సాగుతూ ప్రస్తుతం హారర్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో నిలిచింది ఈ మూవీ.
ఈ సినిమా కథంతా అమెరికాలోని ‘బ్లాక్ లేక్’ (Black Lake) అనే ఒక అందంగా కనిపించే అత్యంత ప్రమాదకరమైన సరస్సు చుట్టూ ఉత్కంఠభరితంగా సాగుతుంది. గతంలో ఆ సరస్సులో ఉన్న రాక్షస మొసళ్లన్నీ చనిపోయాయని భావించిన వైల్డ్‌లైఫ్ గేమ్ వార్డెన్ నాథన్ బికర్‌మాన్, తన భార్య సుసాన్, చిన్నారి కొడుకు కానర్ తో కలిసి తన పూర్వీకుల ఇంటికి మకాం మారుస్తాడు. అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న సమయంలో కానర్‌కు సరస్సు ఒడ్డున కొన్ని మొసలి పిల్లలు కనిపిస్తాయి. వాటిపై జాలితో తల్లిదండ్రులకు తెలియకుండా ఆహారం పెడుతూ పెంచడం మొదలుపెడతాడు. కానీ రెండేళ్లు గడిచేసరికి ఆ చిన్న మొసళ్లు కాస్తా భారీ రాక్షసాకారాలుగా మారిపోతాయి. ఆకలి తీర్చుకోవడానికి సరస్సులోకి వచ్చే మనుషులపై దాడులు మొదలుపెడతాయి. దీంతో బ్లాక్ లేక్ ప్రాంతం మరోసారి భయానకంగా మారుతుంది.
మొసళ్ల దాడుల గురించి తెలుసుకున్న నాథన్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి రంగంలోకి దిగుతాడు. స్థానిక పోలీస్ టోనీ విల్లింగర్, మొసళ్ల వేటలో అనుభవం ఉన్న రీబా కూడా అతడికి తోడవుతారు. అయితే ఆ మొసళ్లు సాధారణమైనవి కావు. నీటిలో దాక్కొని ఎప్పుడు దాడి చేస్తాయో తెలియని పరిస్థితి. చివరికి నాథన్ బృందం ఆ మొసళ్లను అంతం చేయగలిగిందా? వాటి బారి నుంచి తన ఫ్యామిలిని కొడుకును కాపాడుకున్నాడా? అనేది సినిమాలో చూడాల్సిందే. రాక్షస మొసళ్ల దాడులు, రక్తపాతంతో సాగే ఈ క్రీచర్ హారర్ అభిమానులకు పక్కా థ్రిల్ ఇచ్చే మూవీ.
గ్రిఫ్ ఫర్స్ట్ దర్శకత్వం వహించిన Lake Placid 3 హారర్ యాక్షన్ మూవీ Lake Placid 3 2010లో విడుదలైంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ ఒరిజినల్ ఆడియోతో పాటు హిందీ ఆడియో కూడా అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. తెలుగులో ఆడియో ప్రస్తుతం అందుబాటులో లేదు. రాక్షస జంతువులు, మొసళ్ల దాడులతో సాగే హారర్ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమాను ప్రయత్నించవచ్చు.