Bhagavad Gita On Changing Destiny| మన జీవితంలో ఏదైనా అనుకున్నట్లు జరగకపోతే వెంటనే అదృష్టాన్ని నిందిస్తాం. నా రాత ఇంతే అనుకుని నిరాశ చెందుతాం. కానీ నిజంగా మన భవిష్యత్తు ముందే నిర్ణయించబడిపోయిందా? మనం చేసే పనులకు, తీసుకునే నిర్ణయాలకు మన జీవితంలో ఎలాంటి ప్రాధాన్యత లేదా? ఈ ప్రశ్నలకు వేల సంవత్సరాల క్రితమే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అద్భుతమైన సమాధానం చెప్పారు. మనిషి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ముందుగా తనను తాను మార్చుకోవాలని ఆయన బోధించారు. ముఖ్యంగా భగవద్గీతలోని ఆరో అధ్యాయం ఐదో శ్లోకం ప్రతి ఒక్కరికీ జీవిత పాఠం లాంటిది.
శ్రీకృష్ణుడు అర్జునుడికి విధిని నిందించకూడదని ఉపదేశిస్తూ ఈ శ్లోకాన్ని చెప్పారు
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్।
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః॥
అర్థం:
మనిషి తన ప్రయత్నంతో తనను తాను ఉన్నత స్థితికి తీసుకెళ్లాలి. తనను తాను ఎప్పుడూ కుంగదీసుకోకూడదు. ఎందుకంటే మన మనసే మనకు మంచి నేస్తం. అదే మనకు శత్రువు కూడా.
అంటే మన ఆలోచనలు, అలవాట్లు, నిర్ణయాలే మన ఎదుగుదలకు లేదా వెనుకబడటానికి కారణమవుతాయి.
మన ప్రయత్నాలతో విధిని మార్చుకోవచ్చా?
ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, ఓటములు, ఆర్థిక సమస్యలు, కుటుంబ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో చాలామంది తమ అదృష్టాన్ని నిందిస్తూ నిరాశ చెందుతారు. కానీ శ్రీకృష్ణుడి బోధన ప్రకారం మన పరిస్థితులన్నింటినీ మనం నియంత్రించలేకపోయినా, వాటిని ఎదుర్కొనే విధానాన్ని మాత్రం మార్చుకోవచ్చు. ధైర్యంగా ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకుని, నిరంతరం ప్రయత్నిస్తే జీవితంలో మంచి మార్పులు తీసుకురావచ్చు.
Also Read: పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే
Also Read: పిల్లలు తప్పు చేసినా సరే.. కోపంలో ఈ మాటలు మాత్రం అనకండి!
భగవద్గీత మనకు చెప్పే ముఖ్యమైన సందేశం ఒక్కటే. పరిస్థితులను నిందిస్తూ కూర్చోకుండా మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. విధి ఎలా ఉన్నా మన ప్రయత్నాన్ని ఆపకూడదు. మన ఆలోచనలు, నిర్ణయాలు, కర్మలు మన జీవిత గమనాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి అదృష్టం మారాలని ఎదురుచూడకుండా, మన జీవితంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఈ రోజే ప్రారంభించాలి.