Wine Shops Closed: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగబోయే ఉపఎన్నికల నేపథ్యంలో.. పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడటం, అక్రమ మద్యం సరఫరా జరగకుండా చూడటమే లక్ష్యంగా మొత్తం నాలుగు రోజుల పాటు వైన్ షాపులు, బార్లు, పబ్బులు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాన్ని నిషేధించారు. ఈ ఆదేశాలు నియోజకవర్గ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలకు వర్తించనున్నాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 9న సాయంత్రం 6 గంటల నుండి నవంబర్ 11న సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయం పూర్తిగా నిషేధం. అదనంగా, నవంబర్ 14న కౌంటింగ్ రోజు కూడా ఇదే ఆంక్షలు కొనసాగనున్నాయి. అంటే, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వైన్ షాపులు, బార్లు మూసేలా ఆదేశాలు జారీ చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా మద్యం పంపిణీ ద్వారా.. ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలను అరికట్టడమే లక్ష్యమని పోలీసులు స్పష్టం చేశారు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే మద్యం దుకాణాల లైసెన్సులను రద్దు చేసే అవకాశముందని తెలిపారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి కౌంటింగ్ ముగిసే వరకు మద్యం విక్రయం నిషేధం ఉంటుంది. ప్రజలంతా ఈ ఆంక్షలను సహకరించాలని కోరుతున్నాం అని పేర్కొన్నారు.
వైన్ షాపులతో పాటు మద్యం విక్రయించే హోటళ్లు, పబ్బులు, రెస్టారెంట్లలో కూడా ఈ నిషేధం అమల్లో ఉంటుంది. లైసెన్స్ కలిగిన ప్రైవేట్ క్లబ్బులు కానీ స్టార్ హోటల్లో కూడా మినహాయింపులో లేవని స్పష్టంచేశారు.
Also Read: చారిత్రక కట్టడాల వద్ద మెట్రో నిర్మాణ మ్యాప్‌ను సమర్పించండి: హై కోర్టు కీలక ఆదేశం
ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం రవాణా జరగకుండా.. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. సరిహద్దు జిల్లాల నుంచి మద్యం తరలించే ప్రయత్నాలు జరుగుతాయని సమాచారం అందడంతో అన్ని ఎంట్రీ పాయింట్లలో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నవంబర్ 11న జరగనుంది. అన్ని రాజకీయ పార్టీలూ చివరి దశ ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రాంతాల్లో శాంతి భద్రతల కోసం పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.