కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట బాధితులను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి పరామర్శించారు. వారికి నగదు సాయం అందజేశారు. అనంతరం వారు ఆలయ నిర్వాహకులైనహరిముకుంద పాండాని కూడా వారు కలిశారు. కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత బాధితులను అన్ని పార్టీల నేతలు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ బహిష్కృత నేత దువ్వాడ వారిని కలవడం విశేషం. ఆయన వ్యక్తిగత సాయం కూడా చేశారు. వాస్తవానికి దువ్వాడకు టెక్కలి స్థానిక నియోజకవర్గం. పక్కనే ఉన్న పలాస నియోజకవర్గంలో పరామర్శ యాత్ర చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించి దువ్వాడ తన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారా అనేది వేచి చూడాలి. ఈ పరామర్శను రాజకీయ కోణంలో చూడవద్దని, మానవతా దృక్పథంతో చూడాలని దువ్వాడ సన్నిహితులు చెబుతున్నారు.
తిరిగి రాజకీయాల్లోకి..
దివ్వెల మాధురి బిగ్ బాస్ నుంచి రిటర్న్ అయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్టు కనపడుతోంది. దువ్వాడ బర్త్ డే ని కూడా ఇటీవల మాధురి గ్రాండ్ గా నిర్వహించారు. అనంతరం స్థానికంగా దువ్వాడ తిరిగి ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కాశీబుగ్గ ఆలయ బాధితుల్ని వారిద్దరూ నేరుగా కలసినట్టు తెలుస్తోంది.
దువ్వాడ నెగ్గుకు రాగలరా..?
వ్యక్తిగత విషయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. జగన్ ఆయన్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత రాజకీయాలకు కాస్త దూరం జరిగినట్టు కనపడ్డారు. ఆ తర్వాత మాధురితో టూర్లు, షికార్లు, షాపింగ్ మాల్ తో బిజీ అయ్యారు దువ్వాడ. ఆ తర్వాత ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లడంతో దాదాపు 20రోజులపాటు దువ్వాడ శ్రీనివాస్ ఒంటరిగా ఉన్నారు. తిరిగి మాధురి వచ్చిన తర్వాత ఆయన జనంలోకి వస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దువ్వాడ తిరిగి రాజకీయాల్లో నెగ్గుకు రాగలరా లేదా అనేది తేలాల్సి ఉంది.
Also Read: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: తప్పులో కాలేసిన వైసీపీ సోషల్ మీడియా..
ఒంటరి రాజకీయం..
దువ్వాడ వైసీపీలో లేరు, అలాగని ఆయన్ను టీడీపీ, జనసేన దగ్గరకు తీసుకునే పరిస్థితులు లేవు. బీజేపీలోకి ఆయన వెళ్తాడా లేదా అనే చర్చ ఇప్పుడు జరగడం లేదు. రాజకీయాల్లోనే ఉండాలనేది దువ్వాడ శ్రీనివాస్ అభిమతం. అయితే పార్టీ లేకుండా సొంతగా ఆయన రాజకీయం చేయగలరా, ఇండిపెండెంట్ గా నెగ్గుకు రాగలరా అనేది మాత్రం ప్రశ్నార్థకం. మాధురితో పరిచయం తర్వాత ఆయనకు సెలబ్రిటీ హోదా పెరిగిపోయింది కానీ, రాజకీయ నాయకుడిగా మాత్రం ఆయన్ను ఎవరూ గుర్తించడం లేదు. ఆ దిశగా ఆయన వద్దకు కూడా ప్రజలెవరూ రావడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్సీ గా దువ్వాడను సహచర నాయకులు కూడా గుర్తిస్తున్నారా అనేది అనుమానమే. అయితే అవమానాలు ఎదుర్కొన్నా కూడా దువ్వాడ ఇంకా ప్రజా క్షేత్రంలోనే ఉండాలనుకోవడం విశేషం. తన వ్యక్తిగత జీవితంపై వచ్చే విమర్శలను కూడా ఆయన అంతే ఘాటుగా తిప్పికొడుతున్నారు. మరి భవిష్యత్ రాజకీయంలో ఆయన ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.
Also Read:మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?