Sambar Recipe: మకర సంక్రాంతి పండగను తెలుగు రాష్ట్రాలతో పాటు మన దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, లక్ష్యద్వీపాలు వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో సంక్రాంతిని ప్రతిఏటా జరుపుకుంటారు. అయితే అక్కడ సంక్రాంతిని ‘పొంగల్’ పేరుతో పిలుస్తారనే విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తమిళనాడులో ఈ పండగకు ప్రత్యేక వంటకాలు చేసి, జల్లికట్టు నిర్వహించి.. కుటుంబ సభ్యులంతా కలిసి వాళ్లు చేసిన వంటలను అరిటాకులో వడ్డించుకుని తినడం సంప్రదాయం. అయితే వాళ్లు పొంగల్ సందర్భంగా చేసుకునే సంప్రదాయ వంటకాల్లో సాంబార్ మాత్రం తప్పకుండా ఉండాల్సిందేనట.
అసలు సాంబార్ లేకుండా పొంగల్ పండగ పూర్తవ్వదని పెద్దలు చెబుతుంటారు. పొంగల్ అంటేనే కొత్త బియ్యం, పాలు, బెల్లం, నెయ్యి సువాసనలతో ఇళ్లంతా నిండి ఉండే ఆనందం. ఆ తియ్యని వెన్నెలకు సరైన జోడీగా నిలిచేది సాంబార్ మాత్రమే అని చెబుతారు. పసుపు, మిరప, ధనియాల సువాసనతో ఉడికిన కూరగాయల సాంబార్ పొంగల్ రుచిని రెట్టింపు చేస్తుంది. పండగ రోజు ఉదయం దేవునికి నైవేద్యంగా పొంగల్ పెట్టిన తర్వాత, కుటుంబ సభ్యులంతా కలిసి వేడి వేడి పొంగల్‌ను సాంబార్‌తో ఆస్వాదించడంలో ఉన్న ఆనందమే వేరని చెబుతారు. ఈ సంప్రదాయం కేవలం ఆహారం మాత్రమే కాదు.. కలిసి తినే అనుబంధాన్ని, పంచుకునే ప్రేమను గుర్తు చేస్తుంది.
Also Read: సొరకాయ రసంతో నాజూకైన నడుము సొంతం.. ఈ విధానంలో తాగారంటే పొట్ట వెన్నెలా కరిగిపోవాల్సిందే!
కందిపప్పు – 1 కప్పు
కూరగాయలు – వంకాయ, క్యారెట్, దొండకాయ, బీరకాయ, ముల్లంగి వంటివి – 1 కప్పు
చింతపండు గుజ్జు – చిన్న గిన్నె నిండా
సాంబార్ పొడి – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు – 1 టీస్పూన్
జీలకర్ర – 1/2 టీస్పూన్
ఎండుమిరపకాయలు – 2 నుంచి 3
కరివేపాకు – రెండు రెబ్బలు
ఇంగువ – చిటికెడు
పొంగల్ పండగకు సాంబార్‌ను ఎలా చేసుకుంటారంటే.. ముందుగా కందిపప్పును బాగా కడిగి ఉడికించాలి. మరోవైపు వంకాయ, క్యారెట్, దొండకాయ, బీరకాయ, ముల్లంగి వంటి కూరగాయలను ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి కాస్త మెత్తగా అయ్యేవరకు ఉడకబెట్టాలి. తర్వాత ఉడికిన పప్పులో ఈ కూరగాయలను వేసి, చింతపండు రసం, ఉప్పు, పసుపు, సాంబార్ పొడి కలిపి కొద్దిసేపు మరిగించాలి. చివరగా నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి పోపు చేసి సాంబార్‌లో కలపాలి. అంతే ఘుమఘుమలాడే ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ. ఎంతో ప్రత్యేకంగా తయారు చేసుకున్న సువాసనభరితమైన సాంబార్‌ను వేడి వేడి పొంగల్‌తో కలిపి తింటే.. ఆ మజానే వేరు.
Also Read: మిగిలిపోయిన అన్నంతో గార్లిక్ ఫ్రైడ్ రైస్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపించే రుచి!