Potlakaya perugu pachadi: ఎండాకాలమైనా, వర్షాకాలమైనా వేడివేడి అన్నంలోకి చల్లచల్లని, కమ్మని పొట్లకాయ పెరుగు పచ్చడి పడితే ఆ మజానే వేరు! మసాలాలు, భారీ కారం లేకుండా లైట్ గా, హెల్దీగా తినాలనిపించే రోజుల్లో ఈ రెసిపీ బెస్ట్ ఛాయిస్. లేత పొట్లకాయ ముక్కలు, చిక్కని పెరుగు, పచ్చిమిర్చి ఘాటు, కరివేపాకు తాలింపు కలగలిసి సింపుల్ గానే సూపర్ టేస్ట్ ఇస్తుంది. వర్కింగ్ డేస్ లో తక్కువ టైమ్ లో లంచ్ లేదా డిన్నర్ రెడీ చేసుకోవాలనుకునే వారికి ఈ ట్రెండీ పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.
లేత పొట్లకాయ: 1 మీడియం సైజుది
చిక్కని పెరుగు: 1.5 కప్పులు
పచ్చిమిర్చి: 3 నుంచి 4
ఉల్లిపాయ: 1 చిన్నది
పసుపు: 1/4 టీస్పూన్
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర: కొద్దిగా
నూనె: 1 టేబుల్ స్పూన్
ఆవాలు: 1/2 టీస్పూన్
జీలకర్ర: 1/2 టీస్పూన్
మినపప్పు: 1 టీస్పూన్
ఎండుమిర్చి: 1 లేదా 2
కరివేపాకు: 1 రెమ్మ
ఇంగువ: చిటికెడు
ఈ పచ్చడిలో అసలైన సీక్రెట్ ఏంటంటే.. పొట్లకాయ ముక్కలను సరిగ్గా ఉడికించడం, నీటిని కంట్రోల్ చేయడం. ముందుగా పొట్లకాయ తీసుకుని పైన ఉన్న లేత తొక్కను చాకుతో లేదా పీలర్ తో సున్నితంగా తొలగించాలి. మరీ గట్టిగా చెక్కేస్తే పొట్లకాయ సన్నబడిపోతుంది. తర్వాత మధ్యలోకి చీల్చి లోపల గింజలు, మెత్తని గుజ్జు తీసేసి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొట్లకాయ ఎంత లేతగా ఉంటే పచ్చడి అంత రుచిగా ఉంటుంది. ముదిరిన పొట్లకాయ తీసుకుంటే గింజలు గట్టిగా ఉండి రుచి మారుతుంది.
1. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం నూనె లేదా అసలు నూనె లేకుండానే, తరిగిన పొట్లకాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టాలి. మీడియం లేదా లో ఫ్లేమ్ లో 5 నుంచి 6 నిమిషాలు మగ్గనివ్వాలి. పొట్లకాయలో ఉండే సహజమైన నీరు బయటకు వచ్చి ముక్కలు మెత్తగా ఉడుకుతాయి. ముక్కలు మెత్తబడిన తర్వాత మూత తీసి, పాన్ లో ఏమైనా అదనపు నీరు ఉంటే హై ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు ఎగరగొట్టాలి. ఇలా చేస్తే పెరుగు కలిపిన తర్వాత పచ్చడి నీళ్లలా మారిపోకుండా ఉంటుంది.
2.ఉడికిన పొట్లకాయ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడివేడిగా ఉన్నప్పుడు పెరుగు కలిపితే పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ లోపు ఒక గిన్నెలో చిక్కని పెరుగు తీసుకుని, గరిటెతో ఉండలు లేకుండా బాగా గిలకొట్టాలి. పెరుగు మరీ గట్టిగా అనిపిస్తే రెండు మూడు చెంచాల నీళ్లు కలపొచ్చు, కానీ మరీ పల్చగా మాత్రం చేయకూడదు.
Also Read: గుమ్మడి వడియాలు..పక్కా కొలతలతో ఇలా చేయండి!
3.ఇప్పుడు తాలింపు వేసుకుందాం. చిన్న తాలింపు గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి పది సెకన్లు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ తాలింపుని కూడా కాస్త చల్లారనివ్వాలి.
4.ఇప్పుడు పూర్తిగా చల్లారిన పొట్లకాయ ముక్కలు, చీలికలుగా చేసిన పచ్చిమిర్చి (లేదా మిక్సీలో ఒక్కసారి బరకగా తిప్పిన పచ్చిమిర్చి పేస్ట్), సన్నగా తరిగిన ఉల్లి పాయ, కొత్తి మీరను గిలకొట్టిన పెరుగులో వేయాలి. రుచికి సరి పడా ఉప్పు వేసి మెల్లగా కలపాలి. చివరగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపును కూడా వేసి అంతా బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేయాలి.
అంతే! కమ్మని, చల్లని పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తింటుంటే, పక్కన ఏ కూర లేకపోయినా కడుపు నిండా హాయిగా తినేయొచ్చు. జొన్న రొట్టె లేదా చపాతీలోకి కూడా ఇది మంచి సైడ్ డిష్ గా సెట్ అవుతుంది. ఫ్రిజ్‌లో పెట్టి ఒక రోజులోపు తినేస్తే ఫ్రెష్ ఫ్లేవర్ అలాగే ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో ఎంతో రుచిగా ఉండే ఈ పొట్ల కాయ పెరుగు పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి