Guntur allam pachadi: ఉదయం లేవగానే హడా విడిగా ఇడ్లీనో, దోశనో, పెసరట్టో వేసేటప్పుడు పక్కన అప్పటికప్పుడు పచ్చడి రుబ్బే టైమ్ కొన్ని సార్లు ఉండకపోవచ్చు? అందుకే నెల రోజులు పైన నిల్వ ఉండే గుంటూరు స్పెషల్ అల్లం పచ్చడి ఇంట్లో ఉంటే.. మార్నింగ్ టిఫిన్ టెన్షన్ ఉండదు! ఘాటైన అల్లం, పుల్లనైన చింతపండు, తీయ్యటి బెల్లం, కారం కలగలిసి ఈ పచ్చడి నాలుకకు సూపర్ కిక్ ఇస్తుంది. ఫ్రిజ్‌లో పెడితే ఒక నెల పైనే తాజాగా ఉండే ఈ అల్లం నిల్వ పచ్చడిని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.
లేత అల్లం ముక్కలు: 150 గ్రాములు
చింతపండు: 75 గ్రాములు
బెల్లం తురుము: 100 గ్రాములు
ఎండుమిర్చి: 15 నుంచి 20
మినపప్పు: 1 టేబుల్ స్పూన్
శనగపప్పు: 1 టేబుల్ స్పూన్
ఆవాలు: 1 టీస్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
మెంతులు: 1/4 టీస్పూన్
ఇంగువ: చిటికెడు
కరివేపాకు: 2 రెమ్మలు
ఉప్పు: రుచికి తగినంత
నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె: 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు
1. పచ్చడి నెల రోజులు నిల్వ ఉండాలంటే ముందుగా పాటించాల్సిన బేసిక్ రూల్ ఏంటంటే.. ఏ ఇంగ్రీడియంట్ కి కూడా తడి తగలకుండా.. చూసుకోవాలి. అల్లం తొక్క తీసిన తర్వాత క్లాత్‌తో బాగా తుడిచి, ఫ్యాన్ గాలి కింద కాసేపు ఆరబెట్టాలి. చింతపండుని నాన బెట్టకుండా పొడిగానే.. ఉంచితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒక వేళ చింతపండు గట్టిగా ఉంటే.. కొంచెం వేడి నీళ్లలో కాసేపు ఉంచి నీళ్లు పూర్తిగా పిండేయాలి.
2.ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడయ్యాక మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి లో ఫ్లేమ్ లో దోరగా వేయించాలి. పప్పులు మంచి రంగు మారి సువాసన వస్తున్నప్పుడు ఎండుమిర్చి వేసి మరో నిమిషం వేయించాలి. ఎండు మిర్చి మాడి పోకుండా జాగ్రత్త పడాలి, లేకపోతే పచ్చడి చేదు వస్తుంది. వేయించిన వీటన్నింటినీ ఒక ప్లేట్ లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.
3.అదే పాన్‌లో మిగిలిన నూనెలో కొంచెం వేసి, తరిగిన అల్లం ముక్కలను వేయాలి. అల్లం పచ్చి వాసన పోయి, రంగు కొంచెం మారే.. వరకు మీడియం ఫ్లేమ్ లో వేయించాలి. ఇలా అల్లం వేయించడం వల్ల ఘాటు సమతుల్యంగా మారి..నిల్వ ఉన్నప్పుడు కూడా చెడిపోకుండా ఉంటుంది. అల్లం వేగిన ..తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా చల్లారనివ్వాలి.
4.మిక్సీ జార్ పూర్తిగా పొడిగా ఉండేలా.. చూసుకోవాలి. ముందుగా చల్లారిన పప్పులు, ఎండు మిర్చి, తగినంత ఉప్పు వేసి.. బరకగా గ్రైండ్ చేయాలి. తర్వాత వేయించిన అల్లం ముక్కలు, చింత పండు, బెల్లం తురుము వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. అవసరమైతే.. ముందుగా తీసి ఉంచిన కొద్ది పాటి చింతపండు రసం లేదా వేడి నీళ్లు వేసి పేస్ట్ కన్సిస్టెన్సీని సెట్ చేసుకోవాలి. పచ్చడి మరీ నీళ్లలా కాకుండా, కాస్త చిక్కగా ఉంటేనే రుచి బాగుంటుంది.
Also Read: స్ట్రీట్ స్టైల్ మసాలా పాస్తా..ఇలా చేస్తే అదిరిపోతుంది!
5.ఇప్పుడు పచ్చడికి అసలైన టేస్ట్ ఇచ్చే తాలింపు వేద్దాం. పాన్‌లో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, చిటికెడు ఇంగువ, ఎండుమిర్చి, కరి వేపాకు వేసి చిటపటలాడించాలి. తాలింపు చక్కగా.. వేగాక రుబ్బి పెట్టుకున్న అల్లం పచ్చడిని ఇందులో.. వేసి బాగా కలపాలి. లో ఫ్లేమ్ లో 2 నుంచి 3 నిమిషాలు నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా తాలింపులో.. కొద్ది సేపు మగ్గించడం వల్ల పచ్చడికి అదనపు రుచి వస్తుంది.
పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలో లేదా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేయాలి. బయట ఉంచితే వారం నుంచి పది రోజుల వరకు తాజాగా ఉంటుంది. అదే ఫ్రిజ్‌లో పెడితే నెల రోజులు పైనే ఏ మాత్రం రుచి మారకుండా నిల్వ ఉంటుంది. తడి చెంచా వాడకుండా ప్రతిసారి పొడి చెంచాతో.. తీసుకుంటే పచ్చడి ఎప్పుడూ ఫ్రెష్ గానే ఉంటుంది.