Rammulkayala charu: అమ్మమ్మల కాలం నాటి వంటల్లో ఉండే కమ్మదనం,రుచి నేటి తరం వంటల్లో అరుదుగా కనిపిస్తాయి. ముఖ్యంగా రామ్ములక్కాయలతో చేసే చారు లేదా పులుసు వంటకాలకు మన తెలుగు ఇళ్లలో ప్రత్యేక స్థానం ఉంది. వేడి వేడి అన్నంలో ఈ చారు కలుపుకుని తింటే.. ఆ తృప్తి మాటల్లో చెప్పలేనిది. తక్కువ మసాలాలతో, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పాతకాలపు రెసిపీని మన ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు:
రామ్ములక్కాయలు(చిన్న టమాటోలు) – 250 గ్రాములు
చింతపండు – చిన్న నిమ్మకాయ సైజు అంత
వెల్లుల్లి రెబ్బలు – 6 నుంచి 8
జీలకర్ర – 1 టీస్పూన్
మిరియాలు – అర టీస్పూన్ (కచ్చాపచ్చాగా దంచినవి)
కారం – రుచికి తగినంత
పసుపు – పావు టీస్పూన్
ఉప్పు – తగినంత
కరివేపాకు – 2 రెబ్బలు
కొత్తిమీర తరుగు – కొద్దిగా
తాలింపు కోసం: నెయ్యి లేదా నూనె – 1 టేబుల్ స్పూన్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ
1.ముందుగా ఒక గిన్నెలో రామ్ములక్కాయలను తీసుకుని వాటికి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. ఇవి మెత్తగా, గుజ్జుగా ఉడికే వరకు మీడియం మంట మీద ఉడికించాలి. రాములక్కాయలు సరిగ్గా ఉడికితేనే వాటిలోని సారం చారులోకి దిగి రుచి బాగుంటుంది.
2.రామ్ములక్కాయలు మెత్తబడిన తర్వాత, ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో కలపాలి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, జీలకర్ర, మిరియాల మిశ్రమాన్ని వేయాలి. అమ్మమ్మల కాలం నాటి చారులో వెల్లుల్లి, మిరియాలు వేయడం వల్ల చారుకు మంచి ఘాటు, కమ్మదనం వస్తాయి.
3.చారు చిక్కదనానికి తగ్గట్టుగా మరికొన్ని నీళ్లు పోసి, చిన్న మంట మీద 5 నుంచి 8 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. చారు చక్కగా మరిగి, కమ్మటి సువాసన వస్తున్నప్పుడు కరివేపాకు , కొత్తిమీర తరుగు వేసి ఒక నిమిషం పాటు ఉంచాలి.
4. చివరగా ఒక చిన్న తాలింపు గరిటెలో నెయ్యి లేదా నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ వేసి వేయించాలి. తాలింపు చిటపటలాడిన వెంటనే మరుగుతున్న చారులో వేసి మూత పెట్టాలి. దీని వల్ల తాలింపు ఘుమఘుమ చారులోనే నిలిచి, రుచిని మరింత పెంచుతుంది.
రామ్ములక్కాయల్లో .. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మిరియాలు, వెల్లుల్లి, చింతపండు కలిసిన ఈ చారు జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. వేడివేడి అన్నంలో ఈ రామ్ముల్కాయల చారు కలుపుకునితింటే ఆ రుచిని మర్చిపోలేరు. మీరు కూడా ఈ సాంప్రదాయ వంటకాన్ని తప్పకుండా ఇంట్లో ప్రయత్నించి చూడండి.