Creamy mushroom sandwich: ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయినా, సాయంత్రం స్నాక్‌గా అయినా లేదా పిల్లల లంచ్ బాక్స్‌కైనా శాండ్‌విచ్ ఎప్పుడూ ఒక బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా..బయటి కెఫేలలో దొరికే క్రీమీ మష్రూమ్ శాండ్‌విచ్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. మృదువైన పుట్టగొడుగులు, క్రీమీ సాస్ ,బంగారు రంగులో కాల్చిన బ్రెడ్ తో ఇది అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఎంతో ఖర్చు చేసి బయట తినాల్సిన అవసరం లేకుండా..ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే.. దీనిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, రుచికరమైన క్రీమీ మష్రూమ్ శాండ్‌విచ్ ఎలా చేయాలో చూద్దామా.
బ్రెడ్ స్లైసెస్ – 4
పుట్టగొడుగులు–1 కప్పు
ఉల్లిపాయ –1 చిన్నది
వెల్లుల్లి రెబ్బలు – 4 నుంచి 5
క్యాప్సికం లేదా స్వీట్ కార్న్ –కొద్దిగా
బటర్ (వెన్న)–2 టేబుల్ స్పూన్లు
మైదా లేదా గోధుమపిండి –1 టేబుల్ స్పూన్
పాలు –అర కప్పు
చీజ్ తురుము –2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి –అర టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ లేదా ఒరిగానో –అర టీస్పూన్
ఉప్పు –రుచికి తగినంత
కొత్తిమీర తరుగు –కొద్దిగా
1. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా బటర్ వేయాలి. బటర్ కరిగాక సన్నగా తరిగిన వెల్లుల్లి , ఉల్లిపాయ వేసి పచ్చి వాసన పోయే.. వరకు వేయించాలి. ఆ తర్వాత తరిగిన పుట్ట గొడుగులను వేసి మీడియం మంట మీద వేయించాలి. మష్రూమ్స్ నుంచి నీరు బయటకు వచ్చి, అవి మృదువుగా మారి రంగు మారే వరకు కలపాలి. ఇందులో.. కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
2.ఇప్పుడు అదే పాన్‌లో.. మిగిలిన కొద్దిగా బటర్ వేసి, ఒక టేబుల్ స్పూన్ పిండి వేసి 30 సెకన్ల పాటు వేయించాలి. తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. పాలు చిక్కబడి క్రీమీగా మారినప్పుడు, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. దీనికి తోడుగా.. చీజ్ తురుము, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో , కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనకు కమ్మని క్రీమీ మష్రూమ్ స్టఫింగ్ రెడీ అవుతుంది.
Also Read: 10 నిమిషాల్లో స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండా..పిల్లలకు ఇష్టమైన ఈజీ స్నాక్!
3. బ్రెడ్ స్లైసెస్ తీసుకుని, రెండింటి మీద తయారు చేసుకున్న మష్రూమ్ స్టఫింగ్‌ను సమానంగా పరచాలి. మరో బ్రెడ్ స్లైస్‌తో దీనిని కవర్ చేయాలి. ఇప్పుడు పెనం లేదా శాండ్‌విచ్ టోస్టర్‌కు కొద్దిగా.. బటర్ రాసి, శాండ్ విచ్‌ను ఉంచాలి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు, కరకరలాడుతూ వేగేలా కాల్చుకోవాలి.
4.వేడివేడిగా ఉన్నప్పుడే ఈ శాండ్‌విచ్‌ను మధ్యలోకి కట్ చేసి, టమాటో సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే.. రుచి అద్భుతంగా ఉంటుంది. పుట్టగొడుగులలో విటమిన్లు, ఖనిజాలు ,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంట్లోనే తాజాగా.. తయారు చేయడం వల్ల పిల్లల లంచ్ బాక్స్‌కు కూడా ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ప్రయత్నించి రుచి చూడండి.