Street style egg bonda: సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే.. పిల్లలు ఏదైనా వేడిగా, రుచికరంగా తినాలని మారాం చేస్తుంటారు. బయట స్ట్రీట్ ఫుడ్ తినిపిస్తే.. ఆరోగ్యానికి అంత మంచిది కాదని చాలా మంది తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. అలాంటప్పుడు ఇంట్లోనే.. కేవలం పది నిమిషాల్లో అచ్చం రోడ్డు పక్కన బండి మీద దొరికే స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండా చేసి పెట్టండి. తక్కువ పదార్థాలతో.. చాలా ఈజీగా తయారయ్యే ఈ స్నాక్ పిల్లలకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, 10 నిమిషాల్లో ఎగ్ బోండా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉడికించిన కోడిగుడ్లు – 3 లేదా 4
శనగపిండి – 1 కప్పు
బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు
కారం – రుచికి తగినంత
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
వాము లేదా జీలకర్ర – అర టీస్పూన్
వంట సోడా – చిటికెడు
కొత్తిమీర తరుగు – కొద్దిగా
నూనె – వేయించడానికి సరిపడా
1.ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, పసుపు, వాము, వంట సోడా, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ.. బజ్జీల పిండిలా మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా జాగ్రత్త పడాలి.
2.ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేయించడానికి సరి పడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కే లోపు ఉడికించిన కోడి గుడ్లకు కొద్దిగా ఉప్పు, కారం లేదా చాట్ మసాలా చల్లి సిద్ధంగా ఉంచుకోవాలి. పిల్లలు ఒకే సారి పెద్ద బోండా తినలేరు కాబట్టి, గుడ్లను సగానికి కోసి బోండా వేస్తే.. తినడానికి ఈజీగా ఉంటుంది, త్వరగా వేగుతాయి కూడా.
Also Read: రుచిలో అదుర్స్!చిక్కటి గ్రేవీతో గోబీ మసాలా కర్రీ
3.నూనె బాగా వేడయ్యాక, ఒక్కో కోడిగుడ్డు ముక్కను శనగ పిండి మిశ్రమంలో.. బాగా ముంచి, పిండి గుడ్డుకు అన్ని వైపులా పట్టేలా.. చూసుకోవాలి. తర్వాత జాగ్రత్తగా నూనెలో వేయాలి. మీడియం మంట మీద బోండాలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. రెండు వైపులా సమానంగా వేగాక, గరిటెతో.. తీసి టిష్యూ పేపర్ మీద వేయాలి. దీని వల్ల నూనె పీల్చుకుంటుంది.
వేడివేడి ఎగ్ బోండాలను ప్లేట్‌లో పెట్టి, పక్కన టమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే.. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కావాలంటే.. బోండా మీద కొద్దిగా ఉల్లి పాయ తరుగు, కొత్తిమీర , నిమ్మరసం పిండి స్ట్రీట్ స్టైల్‌లో కూడా ఇవ్వొచ్చు. కానీ పిల్లలకు కారం ఎక్కువగా లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.