Farmers Debt Clears: గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాకు చెందిన ఒక వ్యాపారి తన తల్లి వర్ధంతి రోజున గ్రామంలోని మొత్తం 290 రైతులను రుణ విముక్తులను చేశారు. జిరా గ్రామంలో నివసించే బాబుభాయ్ తన తల్లి వర్ధంతి సందర్భంగా.. గత 30 సంవత్సరాలుగా అప్పుల కూరుకుపోయిన 290 మంది రైతులను ఆ కష్టాల నుంచి బయటపడేశారు. ఇందుకోసం ఆయన 90 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. జిరావాలా సాయంతో గ్రామంలోని రైతులందరూ రుణ విముక్తి పొందారు.
1995 నుంచి జిరా గ్రామంలోని రైతులపై బ్యాంకు రుణాల కేసు పెండింగ్‌లో ఉంది. దీనిపై బాబుభాయ్ జిరావాలా మాట్లాడుతూ 1995 నుండి తన గ్రామంలో ఒక పెద్ద వివాదం కొనసాగుతోందన్నారు. సొసైటీ నిర్వాహకులు రైతుల పేరుతో మోసపూరితంగా రుణాలు తీసుకున్నారు. సొసైటీ సభ్యులే అవినీతికి పాల్పడ్డారనేది బహిరంగ రహస్యం. అప్పుల కారణంగా ప్రభుత్వం అందించే సహాయం, రుణాలు, ఇతర సౌకర్యాలను రైతులు పొందలేకపోతున్నారు. బ్యాంకులు గ్రామంలోని రైతులకు ఎలాంటి రుణాలు ఇవ్వడంలేదు. రుణాలు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు.
గ్రామంలోని మొత్తం 290 మంది రైతుల అప్పు 89,89,209 లక్షల రూపాయలు. గ్రామ రైతుల అప్పులు తీర్చేయాలని బాబుభాయ్ నిర్ణయించుకున్నారు. ఆయన తన సోదరుడితో కలిసి బ్యాంకు అధికారులను కలిశారు. దీంతో అధికారులు కూడా సహకరించారు. గ్రామ రైతులకు మొత్తం 89,89,209 లక్షల రూపాయలు అప్పు ఉందని బ్యాంకు అధికారులు తేల్చారు. అప్పులు తీర్చేసి బ్యాంకు నుంచి రైతుల పేర్లతో నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఆ తర్వాత ఒక వేడుకలో రైతులకు పంపిణీ చేశారు. ఇవాళ అమ్మ కోరికను నెరవేర్చినందుకు, ఆమెకు నిజమైన నివాళి అర్పించినందుకు తన కుటుంబం ఎంతో సంతోషంగా ఉందన్నారు బాబుభాయ్.
Also Read: Wild Elephants Control With AI: అడవి ఏనుగులను ఏఐతో కట్టడి.. సరికొత్త సాంకేతికతో ఏపీ సర్కార్ ముందడుగు
జిరా గ్రామంలోని 290 మంది రైతులకు ‘నో డ్యూ సర్టిఫికెట్లు’ అందజేశారు. ఏళ్ల నాటి రుణ భారాలకు విముక్తి కల్పించినందుకు రైతుల కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి. రైతులు జిరాభాయ్ గొప్ప మననును ఆశీర్వదించారు. సంపదను తమ తోటి వారికి సహాయం చేసినప్పుడు, దాని విలువ బిలియన్ల రూపాయల కంటే చాలా రెట్లు పెరుగుతుందని ఈ దృశ్యం నిరూపించింది. జిరా గ్రామంలోని 290 కుటుంబాలకు బాబూభాయ్ కొత్త జీవితాలను ప్రసాదించారు.