ఆఫీసులో బ్రేక్ వస్తే చాలు సిగరెట్ జోన్ కు వెళ్లి ఒక చేత్తో కప్పు టీ మరో చేత్తో సిగరెట్ తాగుతూ కనిపిస్తారు. ఎంతోమంది ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల మీ జీర్ణ ఆరోగ్యం దెబ్బతింటుంది. జీవక్రియ ప్రభావితం అవుతుంది. టీలో కెఫిన్ అధికంగా ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. పేగుల పొరను పొడిగా మార్చేస్తాయి. ఇక అధిక కెఫీన్ డీ హైడ్రేషన్‌కు కారణమవుతుంది. ఈ రెండింటి వల్ల మలబద్ధకం తీవ్రంగా మారిపోతుంది.
డీహైడ్రేషన్ సమస్య అధికంగా ఉంటే మలంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీనివల్ల అది బాగా గట్టిపడి శరీరం నుంచి బయటకు వెళ్లడం కష్టంగా మారిపోతుంది. ఇది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. టీలో పాలు కలుపుకొని తాగే వారు కూడా ఎక్కువే. ఇది కూడా కొవ్వును అధికంగా ఉత్పత్తి చేసి జీర్ణ క్రియను నెమ్మదించేలా చేస్తుంది. ఇవన్నీ కూడా మలబద్ధకానికి కారణమయ్యే అంశాలే.
ధూమపానం చేయడం వల్ల అందులో ఉండే నికోటిన్ జీర్ణాశయంతర వ్యాధులకు కారణం అవుతుంది. నికోటిన్ పేగు సంకోచాలను తీవ్రంగా ప్రేరేపిస్తుంది. ఇలా ఓవర్ గా ప్రేరేపించడం వల్ల పేగు సంకోచాలు బలహీనపడతాయి. అవసరానికి మించి అవి సంకోచించడం జరుగుతుంది. ధూమపానం జీర్ణాశయాంతర వ్యవస్థలోని నరాలు, కండరాలను దెబ్బతీస్తాయి. పెద్ద పేగు ద్వారా మలం నెమ్మదిగా రవాణా అయి బయటకు వస్తుంది. ఆ ప్రక్రియకు ఇది అడ్డంకిగా మారుతుంది.
సిగరెట్‌లలోని నికోటిన్ పేగులకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. పేగు కదలికలను మందగించేలా చేస్తుంది. ఇది కూడా మలబద్ధకానికి కారణం అవుతుంది. ధూమపానం చేసేవారు సరైన ఆహారం తీసుకోవడం అత్యవసరం. కానీ స్మోకింగ్ అలవాటు వారిని మంచి ఆహారాన్ని తిననివ్వకుండా అడ్డుకుంటుంది. అలాంటి కోరికలను కలగనివ్వదు. వారు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోరు. దీనివల్ల జీర్ణ ప్రక్రియ మరింత కష్టతరం అవుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటేనే జీర్ణ క్రియ సవ్యంగా సాగుతుంది.
ధూమపానం చేస్తూ నిశ్చల జీవన శైలికి అలవాటు పడితే అది మరింత తీవ్రమైన సమస్యగా మారవచ్చు. మీకు మలబద్ధకం అనే సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మీ అలవాట్లపై ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ధూమపానం, టీ తాగడం ఈ రెండు అలవాట్లు ఉంటే ఆ రెండింటి వల్లే మీరు మలబద్ధకం సమస్య బారిన పడ్డారేమో అని ఆలోచించుకోండి. మలబద్ధకం సమస్య వినడానికి చిన్నగా కనిపించవచ్చు. కానీ అది తీవ్రంగా మారితే భరించడం చాలా కష్టం. వెంటనే ధూమపానం మానేసి టీ తాగడం పరిమితం చేయండి. ఫైబర్ ఉండే ఆహారాన్ని తీసుకోండి. నీరు అత్యధికంగా తాగండి. ధూమపానం సమస్య రాకుండా ఉంటుంది.