స్వీట్ కార్న్ మార్కెట్లో దొరికితే కొని ఇంటికి తెచ్చుకోండి. దీంతో టేస్టీగా కబాబులు చేసుకోవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో వేడి వేడి స్వీట్ కార్న్ కబాబ్ తింటూ ఉంటే ఆ రుచే వేరు. ఇందులో మనం ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పదార్థాలను వేస్తాము. కాబట్టి పొట్ట నిండిన ఫీలింగ్ కూడా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం స్వీట్ కార్న్ కబాబ్ ఎలా చేయాలో తెలుసుకోండి.
స్వీట్ కార్న్ కబాబ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
స్వీట్ కార్న్ – రెండు పొత్తులు
బంగాళదుంపలు – నాలుగు
నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
కసూరి మేతి – ఒక స్పూను
మసాలా పొడి – ఒక స్పూను
చాట్ మసాలా – ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – అర స్పూను
పచ్చిమిర్చి పేస్ట్ – అర స్పూను
శెనగపిండి – రెండు టేబుల్ స్పూన్లు
క్యాప్సికం తరుగు – ఒక స్పూను
క్యారెట్ తరుగు – ఒక స్పూను
స్వీట్ కార్న్ కబాబ్ ఇలా చేసేయండి
1. స్వీట్ కార్న్ తెచ్చుకున్నాక గింజలను ఒలిచి పెట్టుకోండి. వాటిని ఆవిరి మీద ఉడికించండి.
2. తర్వాత మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోండి. అన్ని సీట్ కార్న్ గింజలను రుబ్బకుండా కొన్ని పక్కన పెట్టుకోండి.
3. ఇప్పుడు మెత్తగా అయినా స్వీట్ కార్న్ మిశ్రమంలో ఈ ఉడికించిన గింజలను కూడా వేయండి.
4. ఇప్పుడు ఇదే మిశ్రమంలో ఉడికించిన బంగాళదుంపలను చేతితోనే మెత్తగా మెదిపి కలపండి.
5. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు, కసూరి మేతి వేసి బాగా కలపండి.
6. అలాగే మసాలా పొడి, చాట్ మసాలా, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపండి.
7. మెత్తగా తరిగిన క్యారెట్, క్యాప్సికం తరుగు, శెనగపిండిని కూడా వేసి బాగా కలపండి.
8. అవసరమైతే నీటిని వేయండి. మరి జారుడుగా కాకుండా మందంగా వచ్చేలా చూడండి. పదినిమిషాల పాటు సాధారణ ఫ్రిజ్లో ఉంచండి.
9. ఇప్పుడు దాని బయటికి తీసి కబాబ్ లాగా వత్తుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేయండి.
10. వేయించిన వాటిని టిష్యూ పేపర్ మీద వేసి ఒకసారి ఒత్తండి. అదనపు నూనెను ఆ పేపర్ పీల్చేస్తుంది.
11. దీన్ని పుదీనా చట్నీతో తింటే అదిరిపోతుంది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది.