శాఖాహారాల్లో మన కంటి చూపును కాపాడే పదార్థాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుత సమయంలో అధిక స్క్రీన్ టైమ్ వల్ల కళ్ళు నీరసించి పోతున్నాయి. ఎన్నో కంటి సమస్యలు వస్తున్నాయి. కళ్ళను జాగ్రత్తగా చూసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిల్లో పోషకాహారాన్ని అందించడం కూడా ఒకటి. ఎలాంటి ఆహారాలు తినడం ద్వారా కంటి చూపును కాపాడుకోవచ్చు తెలుసుకోండి.
క్యారెట్లు
ప్రతిరోజు ఒక క్యారెట్ తినేందుకు ప్రయత్నించండి. దీనిలో బీటా కెరాటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇదే శరీరంలో చేరాక విటమిన్ ఏ గా మారుతుంది. ఇది దృష్టిని కాపాడడంలో ముందుంటుంది. రేచీకటి రాకుండా కూడా అడ్డుకుంటుంది. క్యారెట్ ను నేరుగా పచ్చిగా తింటే ఎంతో మంచిది. విటమిన్ ఏ లోపం వల్ల కలిగే అంధత్వాన్ని నివారించడంలో ఇది ఉపయోగపడుతుంది.
పాలకూర
పాలకూరలో లూటీన్, జియాక్సింతిన్ వంటి కీలకమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేసి కంటి శుక్లాన్ని కాపాడుతుంది. వయసుతోపాటు మాక్యులర్ క్షీణత ప్రమాదం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే పాలకూరను స్మూతీలు, సూపులు, కూరల్లో భాగం చేసుకొని తినాలి. లేదా పాలకూర, వెల్లుల్లి కలిపి వేయించుకుని తిన్నా మంచిదే. ఒక అధ్యయనం ప్రకారం పాలకూర అధికంగా తినే వారికి అది కంటికి సన్ స్క్రీన్ లాగా ఉపయోగపడుతుందని తేలింది. హానికరమైన నీలి కాంతి నుండి పాలకూర కాపాడుతుంది. కాబట్టి వారంలో రెండు మూడు సార్లు పాలకూర తినేందుకు ప్రయత్నించండి.
బ్రోకలీ
విటమిన్ సి, లుటీన్, జియాక్సంతిన్ వంటివి బ్రోకలీలో అధికంగా ఉంటాయి. ఆక్సీకరణ నష్టాన్ని నివారించేందుకు ఉపయోగపడతాయి. ఒక అధ్యయనం ప్రకారం బ్రోకలీలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఈ… వంటివి అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆక్సీకరణ ఒత్తిడిని, వాపుని కలగకుండా రక్షిస్తాయి. డయాబెటిక్ రెటినోపతి వంటి కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.
అవకాడోలు
రెటీనా ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే మన కంటిచూపు ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. ఆరు నెలలపాటు ప్రతిరోజు ఒక అవకాడో తినేందుకు ప్రయత్నించండి. మీ కంటి చూపులో ఎంతో స్పష్టత వస్తుంది. మాక్యులర్ పిగ్మెంట్ సాంద్రతను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే అభిజ్ఞా పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. కంటి మెదడు ఆరోగ్యానికి అవకాడో ఎంతో ఉపయోగపడుతుంది.
క్యాప్సికమ్
క్యాప్సికమ్‌లు పసుపు, ఎరుపు, నారింజ రకాల్లో దొరుకుతాయి. ఆకుపచ్చ కాప్సికంలు అధికంగా దొరుకుతాయి. అయితే ఎరుపు, పసుపు, నారింజరంగుల్లో ఉన్న క్యాప్సికంలను కూడా తినాలి. వీటిని బెల్ పెప్పర్స్ అంటారు. వీటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మీ కళ్ళను దెబ్బ తినకుండా కాపాడుతాయి. దీర్ఘకాలికంగా దృష్టి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. బెల్ పెప్పర్స్ లో బీటా కెరాటిన్ ఉంటుంది. ఇది మన దృష్టిని క్షీణించకుండా కాపాడుతుంది. పొడి కళ్ళు సమస్య రాకుండా అడ్డుకుంటుంది.