Chai-Biscuit: చాయ్.. ఉదయం లేవగానే టీ తాగనిదే మనలో చాలా మంది రోజు ప్రారంభం అవ్వదు. సాయంత్రం ఫ్రెష్‌గా ఫీల్ అవ్వాలన్నా టీ పడాల్సిందే. టీతో పాటు చాలా మంది బిస్కెట్ వంటివి తినడం మనం చూస్తూనే ఉంటాం. ఇదిలా ఉంటే కొన్ని స్నాక్స్ టీతో కలిపి తినకూడదని నిపుణులు కూడా చెబుతుంటారు. ఇలా తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటారు. ముఖ్యంగా టీతో పాటు బిస్కెట్ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చాయ్ బిస్కెట్ కాంబినేషన్ చాలామందికి రిఫ్రెష్‌గా అనిపించవచ్చు. కానీ ఖాళీ కడుపుతో తరచుగా చాయ్ బిస్కట్ తినడం ఎక్కువ ప్రమాదకరం.
ప్రధానంగా ఆరోగ్యానికి హాని కలిగించే అంశాలు:
1. చక్కెర,శుద్ధి చేసిన పిండి అధికంగా ఉండటం:
చాలా రకాల బిస్కెట్లలో శుద్ధి చేసిన పిండి (మైదా) మరియు అధిక మొత్తంలో చక్కెర ఉంటాయి. ఈ రెండూ కలిసి రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి. అంతే కాకుండా ఇది దీర్ఘకాలంలో టైప్ -2 డయాబెటిస్, బరువు పెరగడానికి దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. చాయ్‌లో కూడా చక్కెర వేసుకుంటే.. ఈ ప్రభావం మరింత ఎక్కువ అవుతుంది.
2. పోషకాలు లేని కేలరీలు :
బిస్కెట్లు ఎక్కువగా పిండి, చక్కెర, నూనెలతో తయారవుతాయి. వీటిలో ఫైబర్, విటమిన్లు లేదా మినరల్స్ వంటి అవసరమైన పోషకాలు చాలా తక్కువగా లేదా అసలు ఉండవు.
బిస్కెట్లు కేవలం కేలరీలను అందిస్తాయి కానీ కడుపు నిండిన అనుభూతిని ఇవ్వవు. దీని వల్ల త్వరగా మళ్లీ ఆకలి వేసి అతిగా తినడానికి దారితీస్తుంది. ఇది బరువు పెరగడానికి కూడా దోహదపడుతుంది.
3. హానికరమైన కొవ్వులు: అనేక వాణిజ్య బిస్కెట్లు తయారీలో హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ లేదా ట్రాన్స్ ఫ్యాట్స్ వాడతారు. ఈ కొవ్వులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
4. జీర్ణక్రియ సమస్యలు: చాయ్‌లో టానిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి, ఇవి కడుపులో ఆమ్లత్వాన్ని పెంచే అవకాశం ఉంది.
ఖాళీ కడుపుతో చాయ్ తాగడం, దానితో పాటు మైదా, చక్కెరతో కూడిన బిస్కెట్లు తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
ఉదయాన్నే ఈ అలవాటు జీర్ణవ్యవస్థ సమతుల్యతను దెబ్బతీస్తుంది. అంతే కాకుండా ఇది ఐరన్ వంటి పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది.
Also Read: మీలో ఈ అలవాట్లున్నాయా ? వెంటనే మానేయండి !
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు:
చాయ్-బిస్కెట్ అలవాటును పూర్తిగా మానుకోలేకపోతే.. దాని స్థానంలో పోషకాహార నిపుణులు కొన్ని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను సూచిస్తారు. అవేంటంటే ?
బిస్కెట్లకు బదులుగా: గుప్పెడు గింజలు (నట్స్), కొన్ని వేయించిన శనగలు లేదా ఇంట్లో తయారుచేసిన, తక్కువ చక్కెర ఉన్న పోహా, ఉప్మా, ఇడ్లీ తీసుకోవడం ఉత్తమం.
చాయ్‌కు ముందు: ఉదయం ఖాళీ కడుపుతో చాయ్ తాగే బదులు, దానికి ముందు సోంపు నీరు , ధనియాల నీరు లేదా అలోవెరా జ్యూస్ వంటి ఆల్కలైన్ డ్రింక్స్ తాగడం మంచిది. ఇవి జీర్ణ వ్యవస్థ సమతుల్యతను కాపాడతాయి.
చాయ్-బిస్కెట్ కలిపి ఎప్పుడో ఒక సారి తీసుకుంటే ఫర్వాలేదు, కానీ దానిని రోజువారీ అలవాటుగా.. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. సమతుల్యత, పోషక విలువలు ఉన్న ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ద్వారా మీ చాయ్ సమయాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు.