Trap House Party: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఫాంహౌస్‌లో ఆదివారం మైనర్ల డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ ఫాంహౌస్ పార్టీలో 50మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో 14మంది బాలికలు, 34 మంది మైనర్లు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.
ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఆహ్వానం
ఇటీవల కెనడా నుంచి వచ్చిన ఇషాన్ అనే యువకుడు ఈ పార్టీకి నిర్వాహకుడు. విదేశీ జీవనశైలికి అలవాటు పడ్డ ఇషాన్, తిరిగి వచ్చిన తర్వాత కూడా అదే వాతావరణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా “ట్రాప్‌హౌస్ హైదరాబాదు అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్ పేజీని క్రియేట్ చేశాడు. ఈ పేజీ ద్వారా మైనర్లకు కూడా సులభంగా యాక్సెస్ ఇచ్చి, పార్టీ వివరాలను షేర్ చేశాడు. ప్రత్యేకంగా పాస్‌వర్డ్ ద్వారా మాత్రమే.. పార్టీ లొకేషన్ వివరాలు అందేలా చేశాడు.
ఒక్కో టికెట్‌కు ₹1300
ఈ పార్టీకి ఎంట్రీ ఫీజు రూపంలో ఒక్కొక్కరితో రూ.1300 వసూలు చేసినట్లు సమాచారం. నగర పరిధిలోని ఒక ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. మ్యూజిక్, లైటింగ్, డీజే సిస్టమ్‌తో పాటు పోలీసులు ఫాంహౌస్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసి పార్టీలో.. భారీగా డ్రగ్స్, గంజాయి, మద్యం స్వాధీనం చేసుకున్నారు.. మొత్తం 65 మంది పార్టీకి హాజరయ్యారు. వారిలో 59 మంది యువతీ యువకులు కాగా, మిగతా వారు డీజే ప్లేయర్లు, సౌండ్ టెక్నీషియన్లు, ఆర్గనైజింగ్ టీమ్ సభ్యులు.
పార్టీలో మైనర్లు ఎక్కువగా
పార్టీలో పాల్గొన్న వారిలో మైనర్లుగా గుర్తించిన పోలీసులు, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మద్యం సీసాలు, స్మోక్ హూకాలు వంటి వాటిని అక్కడే సీజ్ చేశారు. యువత మద్యం సేవిస్తూ, సోషల్ మీడియాలో లైవ్ వీడియోలు పోస్ట్ చేయడం కూడా బయటపడింది.
ఫామ్‌హౌస్ యజమాని సహా నలుగురిపై కేసులు
ఈ ఘటనపై పోలీసులు సీరియస్‌గా వ్యవహరించారు. ఫామ్‌హౌస్ యజమాని, పార్టీ నిర్వాహకుడు ఇషాన్, అలాగే ఇద్దరు మైనర్లపై కేసులు నమోదు చేశారు. వారిపై మద్యం చట్టం ఉల్లంఘన, పబ్లిక్ న్యూసెన్స్, జువెనైల్ యాక్ట్ ఉల్లంఘన వంటి సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల దాడి ఎలా జరిగింది
రాత్రి సమయంలో వచ్చిన సమాచారం మేరకు, స్థానిక పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. అకస్మాత్తుగా వచ్చిన పోలీసులను చూసి అక్కడున్న యువతీ యువకులు భయాందోళనకు గురయ్యారు. చాలామంది పారిపోవడానికి ప్రయత్నించినా, వారిని అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో పార్టీ సౌండ్ సిస్టమ్స్, డీజే పరికరాలు, మద్యం బాటిల్స్, ప్రవేశ టికెట్లు వంటి ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇలాంటి పార్టీలపై హెచ్చరిక
భవిష్యత్తులో ఇలాంటి గోప్యమైన పార్టీలను కఠినంగా అణచివేస్తామని హెచ్చరించారు. “ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ ద్వారా యువతను మోసగించడానికి ప్రయత్నించే వారిపై సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తుందని అధికారుల ప్రకటన చేశారు.
Also Read: బెంగళూరుకు సీఎం రేవంత్.. అసలు విషం ఇదే
ఈ ఘటన తల్లిదండ్రులకు కూడా హెచ్చరికలాంటిదని పోలీసులు పేర్కొన్నారు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు క్రమం తప్పకుండా దృష్టి ఉంచాలని సూచించారు. మద్యం, డ్రగ్స్, నైట్ పార్టీల వలలో పడుతున్న యువతను కాపాడటానికి.. కుటుంబం నుంచే అవగాహన ప్రారంభం కావాలి అని పోలీసులు చెప్పారు.