నలుగురు నడిచే దారిలో కాకుండా, తామే కొత్త దారిని నిర్మించాలనుకుంటారు కొంతమంది. వారి ప్రయాణం తొలుత ఇబ్బందులకు గురి కావచ్చు. కానీ, అంతిమంగా అద్భుత ఫలితాలను అందిస్తుంది. మధ్యప్రదేశ్ కు చెందిన డాక్టర్ బసు చౌదరి కూడా ఇదే కోవకు చెందుతుంది. ఎవరి దగ్గరో ఉద్యోగం చేయడం కంటే, స్వయంగా ఉపాధి పొందాలనుకుంది. తనతో పాటు మరికొంత మందికి ఉపాధి కల్పించాలనుకుంది. ఎవరూ ఎంచుకోని మార్గాన్ని ఎంచుకుంది. అందులో సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది. ఇంటి దగ్గరే ఉంటూ ఏడాది రూ. 60 లక్షలు సంపాదిస్తోంది. అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది.
బిఎస్సీ పూర్తి చేసిన బసు చౌదరి, సొంతంగా ఏదైనా సంస్థను స్థాపించాలనుకుంది. తన దగ్గర పెట్టుబడికి ఎక్కువ డబ్బులు లేకపోవడంతో.. భారీ పెట్టుబడితో కూడిన వ్యాపారాలు వద్దనుకుంది. తన చదువుకు అనుగుణంగా ఉండేలా ప్రయాణాన్ని మొదలు పెట్టాలనుకుంది. పుట్టగొడుగుల పెంపకం గురించి కాస్త అవగాహన ఉన్న ఆమె, దాన్నే తన వృత్తిగా మలుచుకోవాలనుకుంది. 2011లో హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ నుంచి 5 కిలోల ఆయిస్టర్ పుట్టగొడుగుల విత్తనాలను కొనుగోలు చేసింది. కిలోకు రూ. 80 చొప్పున రూ. 400 చెల్లించి తెప్పించుకుంది. ఆ తర్వాత గోధుమ గడ్డిని తెచ్చింది. 50 సంచులలో ఉంచింది. వాటిలో పుట్టగొడుగుల విత్తనాలు వేసింది. ట్రయల్స్ లో 150 కిలోల పుట్టగొడుగుల దిగుబడి వచ్చింది. వాటిని స్థానిక మార్కెట్ లో కిలోకు రూ. 200 చొప్పున అమ్మింది. మొత్తం రూ. 30,000 సంపాదించింది.
పుట్టగొడుగుల గురించి మరింత తెలుసుకునేందుకు 2013లో బసు ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలో చేరింది బసు. అదే సంవత్సరం, ఆమె 20 కిలోల పుట్టగొడుగుల విత్తనాలను కొనుగోలు చేసింది. వాటితో ఏకంగా 600 కిలోల ఓస్టెర్ పుట్టగొడుగులను ఉత్పత్తి చేసింది. ఈ పుట్టగొడుగులను నేరుగా అమ్మడంతో పాటు ఎండబెట్టి పౌడర్ రూపంలో సేల్ చేసింది. అటు టిష్యూ కల్చర్, పుట్టగొడుగుల పెంపకంలో ఇంటర్న్ షిప్ చేసింది. 2014లో 100 చదరపు అడుగులలో పుట్టగొడుగుల విత్తనాల(స్పాన్) లాబొరేటరీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల సబ్సిడీ తీసుకుంది. ప్రస్తుతం బసు తన ల్యాబ్ ను 200 చదరపు అడుగులకు విస్తరించింది. దేశ వ్యాప్తంగా అత్యంత అరుదైన, విలువైన పుట్టగొడుగులను సరఫరా చేస్తుంది.
ప్రస్తుతం బసు చౌదరి అరుదైన ఫారిన్ పుట్టగొడుగులు, వాటి విత్తనాలు(స్పాన్) అమ్మడం ద్వారా భారీగా డబ్బులు సంపాదిస్తుంది. తొలుత రూ. 30 వేల ఆదాయాన్ని సంపాదించిన ఆమె, ఇప్పుడు ఏడాదికి ఏకంగా రూ. 60 లక్షల టర్నోవర్ సాధిస్తోంది. షిటేక్, కింగ్ ఆయిస్టర్స్, లయన్స్ మేన్, రీషి, కార్డిసెప్స్ లాంటి విలువైన పుట్టగొడుగులను సాగు చేస్తుంది. 2017లో థాయిలాండ్ నుంచి కార్డిసెప్స్ మిలిటారిస్ పుట్టగొడుగుల విత్తనాలను తీసుకొచ్చింది. ఇది అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. డిమాండ్ ను బట్టి ఈ పుట్టగొడుగులు కిలోకు రూ. 90,000 నుంచి రూ. 3.5 లక్షల వరకు అమ్ముడవుతాయి. కార్డిసెప్స్ పుట్టగొడుగుల పంట ప్రతి మూడు నెలలకు ఒకసారి వస్తుంది. వార్షిక దిగుబడి 20 కిలోలు ఉంటుంది. కిలోకు రూ. 3 లక్షల నుంచి రూ. 3.5 లక్షల వరకు రిటైల్ లో నేరుగా వినియోగదారులకు అమ్ముతుంది. ఫార్మా కంపెనీలకు రూ. 75,000 నుంచి రూ. 1 లక్ష వరకు హోల్ సేల్ గా అమ్ముతోంది. ప్రస్తుతం అమె పుట్టగొడుగులతో పాటు పుట్టగొడుగుల విత్తనాలను కూడా అమ్ముతూ లాభాలను సంపాదిస్తోంది. అదే సమయంలో పుట్టగొడుగుల పెంపకం గురించి గ్రామీణ మహిళలకు శిక్షణ కూడా ఇస్తుంది. స్వయం ఉపాధి పొందేలా సాయపడుతుంది.
Read Also: జపాన్‌లో ఇళ్లన్నీ ఖాళీ.. ఫ్రీగా ఇచ్చేయడానికి సిద్ధమవుతోన్న ప్రభుత్వం, మీకు కావాలా?