కొంతమందిని చూస్తే ఏదో సానుకూల శక్తి ప్రసరిస్తున్నట్టు ఉంటుంది. వారి వైపే అప్రయత్నంగా దృష్టి మరలతుంది. వారితో మాట్లాడాలనిపిస్తుంది. ఎక్కువసేపు గడపాలనిపిస్తుంది. వీరు అయస్కాంతంలో ఇతరులను ఆకర్షిస్తారు. అలాంటి మీరు కూడా అయస్కాంతంలా మీ చుట్టూ ఉన్న వారిని ఆకర్షించాలంటే కొన్ని రకాల లక్షణాలు మీలో ఉండాలి.
మీటింగులు జరుగుతున్నప్పుడు, సోషల్ గ్యాదరింగ్ వంటి సమయంలో కొంతమంది వైపే అందరి దృష్టి పడుతుంది. వారిని చూసి అందరూ ఆకర్షణీయంగా ఫీలవుతారు. వారు ఎవరినైనా తన వైపు తిప్పుకునే శక్తిని కలిగి ఉంటారు. నిజానికి సామాన్య మనుషుల్లాగే వారు కనిపిస్తారు. కానీ వారి విశ్వాసం, సానుకూలత వంటివి వారి వైపు ఆకర్షించేలా చేస్తాయి. మీరు కూడా అలా మారాలంటే కొన్ని లక్షణాలను అలవరచుకోండి.
మీకు స్పష్టంగా మాట్లాడడం రావాలి. ఎదుటివారు చెప్పింది విని ప్రతిస్పందించడం కూడా గౌరవంగా ఉండాలి. మీరు మాట్లాడే మాటలు ఎదుటివారికి సులువుగా అర్థం అవ్వాలి. మీరు వాడే పదాలు కూడా హుందాగా ఉండాలి. ఇవన్నీ కూడా మీరు ఎదుటివారికి నచ్చేలా చేస్తాయి.
ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మంచి శ్రోతగా ఉండండి. వారు చెప్పేది పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. మాట్లాడుతున్నప్పుడు అడ్డు తగలకండి. ఇవన్నీ ఎదుటివారికి విసుగు కలిగిస్తాయి. మీరు తిరిగి సమాధానం ఇవ్వడానికి మీ సమయం వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ లక్షణాలన్నీ మీపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.
పెదాలపై చిరునవ్వు చెదరనివ్వకండి. కోపం వచ్చినా కూడా చిరునవ్వుతోనే సమాధానం చెప్పండి. మీ కళ్ళు కూడా నవ్వుతున్నట్టే ఉండాలి. ఇది మీలో నిజాయితీని తెలియజేస్తుంది. హృదయపూర్వకమైన చిరునవ్వు ఏ పరిస్థితుల్లోనైనా ఎదుటివారిని ఆకర్షిస్తుంది.
అలాగే ఎవరినైనా కూడా పేరుతో ప్రేమపూర్వకంగా పిలవడానికి ప్రయత్నించండి. పేరుతో పిలవడం వల్ల ఎదుటివారు కూడా ప్రత్యేకంగా ఫీల్ అవుతారు. మీకు దగ్గరైన అనుభూతి వాళ్లకి కలుగుతుంది. కాబట్టి పేరుతోనే పిలవడం అలవాటు చేసుకోండి. ఇది ఎదుటివారిని మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది.
మీ బాడీ లాంగ్వేజ్ కూడా నీ గురించి ఎదుటివారికి ఒక అభిప్రాయం కలిగేలా చేస్తుంది. కాబట్టి అహంకారంగా మాట్లాడడం మాని, ఏ స్థాయి వ్యక్తులతో అయినా కాస్త వినయంగా మాట్లాడడం నేర్చుకోండి. ఇది మీరంటే ఇష్టపడేలా అందరినీ మారుస్తుంది. మాట్లాడుతున్నప్పుడు చేతులు ఊపుతూ కదిలిస్తూ మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇది మరింత తేలికగా మీరు చెప్పేది ఎదుటివారు అర్థం చేసుకోవడానికి వీలుంటుంది.
ఎవరైనా ఉత్తమంగా పనిచేస్తే వారిని పొగిడేందుకు ప్రయత్నించండి. అలాగే మీటింగులు, సమావేశాల సమయంలో ఉత్తమంగా పనిచేసిన వారి గురించి ఒక 30 సెకన్లయినా మాట్లాడండి. ఈ పరోక్ష అభినందనలు వారికి మీపై మంచి అభిప్రాయాన్ని కలిగేలా చేస్తాయి.
Also Read: మీ భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమించినా.. ఈ విషయాలను మాత్రం సహించకండి
ప్రతి ఒక్కరికీ అభిరుచులు, అలవాట్లు ఉంటాయి. మీ అభిరుచులు మీ అలవాట్లు ఎదుటివారితో పంచుకుంటే… ఎదుటివారు కూడా ఓపెన్ గా మీతో మాట్లాడతారు. అలాగే మీ భాగస్వామ్యంలో కలిసి పని చేసేందుకు శ్రద్ధ కూడా చూపిస్తారు.