Exercise: ఉరుకులు పరుగుల జీవితంలో కొందరికి ప్రతిరోజూ వ్యాయామం చేయడానికి అస్సలు సమయం దొరకడం లేదు. ఇటు ఇంటి పని అటు ఆఫీస్ వర్క అంటూ బిజీ లైఫ్‌ని గడిపేస్తున్నారు. అలా రోజూ వ్యాయామం చేయడానికి టైం లేనివాళ్లని.. వీకెండ్ వారియర్స్‌గా మారిపొమ్మని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవును.. రోజూ చేసే కసరత్తులకు సమానంగా వీకెండ్ వర్కౌట్స్ కూడా ప్రయోజనాలు కల్పించే అవకాశముందని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో రోజూ వ్యాయామం చేసేవారు, వారాంతాల్లో చేసేవారు, అంతగా చేయనివారిని బృందాలుగా విభజించారు పరిశోధకులు.
ఇలా విభజించిన వారిలో.. వారానికి 150 నిమిషాల కన్నా తక్కువగా శ్రమ చేసేవారిని అంతగా వ్యాయామం చేయని వర్గంలో చేర్చారు. అందరిలోనూ మానసిక, జీర్ణకోశ, నాడీ సమస్యలతో పాటు మొత్తం 678 జబ్బుల తీరుతెన్నులను పరిశీలించారు. అంతగా వ్యాయామం చేయనివారితో పోలిస్తే.. ప్రతిరోజూ వ్యాయామం చేసేవారితో పాటు వారాంతాల్లో చేసేవారిలోనూ 200కు పైగా జబ్బుల ముప్పు తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనంలో తేలింది. వ్యాయామ ప్రయోజనాలు అధిక రక్తపోటు, మధుమేహం జబ్బుల విషయంలో మరింత బలంగా ఉండటం విశేషం.
ప్రతిరోజూ కసరత్తులు చేసేవారికి అధిక రక్తపోటు ముప్పు 28% శాతం, వారాంతంలో చేసేవారికి 23 శాతం తక్కువగా ఉంటోంది. అదే మధుమేహం ముప్పయితే వరుసగా 46 శాతం, 43 శాతం వరకూ తగ్గుతోంది. క్రమం తప్పకుండా కసరత్తులు చేసేవారితో సమానంగా.. వారాంతంలో చేసేవారిలోనూ ప్రయోజనాలు కనిపింపిస్తున్నాయి. దీనికి కారణం ఏమిటంటే.. వ్యాయామ తీరు కన్నా, ఎంత వ్యాయామం చేశారనేది కారణం కావొచ్చని భావిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వారాంతాల్లో.. వ్యాయామం చేసేవారికి గుండె, రక్తనాళాల జబ్బుల ముప్పు తక్కువనేది తెలిసిన విషయమే . అయితే, వీరికి కిడ్నీ జబ్బుల దగ్గరి నుంచి మూడ్ స్వింగ్స్ సమస్యల వరకూ ఇతర జబ్బుల ముప్పూ తక్కువేనని తాజా అధ్యయనంలో వెల్లయ్యింది. దీన్ని బట్టి అర్థం అయ్యింది ఏమిటంటే.. గుండె జబ్బులను తప్పించుకొని ఆరోగ్యంగా ఉండాలనుకుంటే.. ఎలాంటి చిన్న వ్యాయామం అయినా పెద్ద తేడాను చూపించగలదు.