Answara Rajan: మలయాళ బ్యూటీస్ టాలీవుడ్ ను ఏలుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కుర్ర హీరోయిన్స్ రచ్చ రేపుతున్నారు. ప్రేమలు సినిమాతో మమితా బైజు.. డ్రాగన్ తో కయాదు లోహర్ టాలీవుడ్లో ఎంత హైప్ తెచ్చుకున్నహీరో అందరికీ తెల్సిందే. ఇక వీరితో పాటు మలయాళంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీ అనస్వర రాజన్.
అనస్వర తెలుగులో నటించకపోయినా.. టాలీవుడ్ లో ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మలయాళంలో ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగారేఖాచిత్రం సినిమా ఆమెకు మరింత గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఓటీటీలో ఈ సినిమా తెలుగులో కూడా ఉంది. ఇక ఎప్పుడెప్పుడు ఈ భామ తెలుగుకు పరిచయమవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూసారు.
ఇక ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెర దించారు స్వప్న సినిమాస్. అనస్వర రాజన్ తెలుగు ఎంట్రీకి రంగం సిద్దమయ్యింది. కొత్త హీరోయిన్స్ ను తెలుగుకు పరిచయం చేయడం స్వప్న సినిమాస్ కు అలవాటుగా మారింది. జాతిరత్నాలు సినిమాతో ఫరియా అబ్దుల్లాని, సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన ఘనత వారికేదక్కుతుంది. ఇక ఇప్పుడు అనస్వరను కూడా వారే తెలుగుకు పరిచయం చేస్తున్నారు.
హీరో శ్రీకాంత్ వారసుడు రోషన్ మేక హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఛాంపియన్. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంక దత్, జికె మోహన్, జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మేకర్స్.. మలయాళ బ్యూటీ అనస్వర అధికారికంగా ప్రకటించారు. ఛాంపియన్ సినిమాలో చంద్రకళ అనే పాత్రలో ఆమె నటిస్తుందని పోస్టర్ ద్వారా తెలిపారు. పోస్టర్ లో అనస్వర.. కారులో ఎంతో అమాయకంగా కూర్చొని కనిపించింది. ఈ సినిమాతో అనస్వర లక్ మారిపోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో రోషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.